హామీల వరద!

ABN , First Publish Date - 2020-05-27T09:49:47+05:30 IST

వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది అయింది. ఎన్నికలకు ముందు, ఆ తరువాత

హామీల వరద!

పాదయాత్రలో పలు ప్రాజెక్టులకు హామీలు

అవన్నీ ఇంకా నివేదికల్లోనే.. 

గండికోట పునరావాస ప్యాకేజీకి నిధులేవీ..?

సర్వేలోనే 20 టీఎంసీల జలాశయం

జ్యుడిషియల్‌ కమిటీకి రాజోలి, జొలదరాశి, కుందూ లిఫ్ట్‌ ప్రాజెక్టులు

డీపీఆర్‌ తయారీలో చక్రాయపేట-కాలేటివాగు లిఫ్ట్‌ 

సీఏం జగన్‌ ఏడాది పాలనలో జిల్లా ప్రాజెక్టుల తాజా పరిస్థితి 


కడప, మే 26 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది అయింది. ఎన్నికలకు ముందు, ఆ తరువాత జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తానని హామీల వరద పారించారు. అధికారం చేపట్టాక గత ఏడాది డిసెంబర్‌ 23న జిల్లా పర్యటనలో పలు నీటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. ఐదు నెలులు గడిచింది. జొలదరాశి, రాజోలి జలాశయాల ఫైల్‌ జ్యుడిషియల్‌ కమిటీకి వెళితే.. కుందూ-టీజీపీ లిఫ్ట్‌ టెండరు దశలో ఉంది. చక్రాయపేట-కాలేటివాగు, సీబీఆర్‌-ఎర్రబల్లి ఎత్తిపోతల పథకాలు డీపీఆర్‌ తయారీలో ఉన్నాయి. 20 టీఎంసీల జలాశయం సర్వేలోనే కొట్టుమిట్టాడుతోంది. జగన్‌ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయా ప్రాజెక్టుల తాజా పరిస్థితిని పరిశీలిస్తే.. 


డీపీఆర్‌ తయారీలోనే చక్రాయపేట-కాలేటివాగు లిఫ్ట్‌

గాలేరు నగరి-హంద్రీనీవాను కలుపుతూ చక్రాయపేట-కాలేటివాగు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి జగన్‌ హామీ ఇచ్చారు. రూ.1,200 కోట్లతో ఈ ప్రాజెక్టుకు డిసెంబర్‌ 25న శంకుస్థాపన చేశారు. జీఎన్‌ఎ్‌సఎ్‌స నుంచి హంద్రీనీవా కాలువకు 1,500 క్యూసెక్కులు ఎత్తిపోసి రాయచోటి నియోజకవర్గంలో చెరువులకు 350 క్యూసెక్కులు, హంద్రీనీవా 473 కి.మీల వద్ద 700 క్యూసెక్కులు ఇవ్వాలి. అయితే.. దీనిని 2 వేల క్యూసెక్కులకు పెంచి రాయచోటి పరిధిలో 450 క్యూసెక్కులు, వెలిగల్లు రిజర్వాయర్‌ నింపి హంద్రీనీవాకు 750 క్యూసెక్కులు, పుంగనూరు బ్రాంచి కాలువకు 800 క్యూసెక్కులు ఇచ్చేలా డిజైన్‌ మార్చారు.


ఇది డీపీఆర్‌ తయారీలోనే కొట్టుమిట్టాడుతోంది. చిత్రావతి రిజర్వాయర్‌-ఎర్రబల్లి లిఫ్ట్‌ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. సీబీఆర్‌ నుంచి ఎర్రబల్లి ట్యాంక్‌కు అక్కడి నుంచి గిడ్డంగివారిపల్లె దగ్గర 1.20 టీఎంసీలతో జలాశయం నిర్మించి 25 వేల ఎకరాలకు సాగునీరు, యురేనియం బాధిత గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని రూ.49 కోట్లతో నివేదిక సిద్ధం చేశారు. వీటికి నిధులు రావాలి.. టెండర్లు పిలవాల్సి ఉంది.


సర్వేలోనే 20 టీఎంసీల జలాశయం

గండికోట దిగువన 20 టీఎంసీల సామర్థ్యంతో మరో జలాశయం నిర్మిస్తామని పులివెందుల సభలో సీఎం జగన్‌ ఇచ్చిన హామీ. ఐదు నెలలుగా ఎక్కడ రిజర్వాయర్‌ నిర్మించాలో స్పష్టత రాలేదని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. సర్వేలోనే ఐదు నెలలు గడిపోయింది.


జ్యుడిషియల్‌ కమిటీకి

పాదయాత్రలో భాగంగా దువ్వూరులో జరిగిన సభలో రాజోలి, జొలదరాశి జలాశయాలు నిర్మించి కేసీ కాలువ ఆయకట్టుకు సాగునీటి సమస్య లేకుండా చేస్తానని ఇచ్చిన హామీ. ఈ మేరకు గత ఏడాది డిసెంబర్‌ 23న దువ్వూరు దగ్గర ఈ జలాశయాలతో పాటు కుందూ-టీజీపీ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. కుందూ నదిపై రూ.800 కోట్లతో 0.60 టీఎంసీల సామర్థ్యంతో జొలదరాశి, రూ.1,300 కోట్లతో 2.90 టీఎంసీలతో రాజోలి జలాశయాలు నిర్మించాలి. కర్నూలు జలవనరుల శాఖ ఇంజనీర్ల పర్యవేక్షణలో చేపట్టే ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ ప్రభుత్వానికి వెళ్లింది.


న్యాయ సలహా కోసం జ్యుడిషియల్‌ కమిటీకి పంపారని ఇంజనీర్లు తెలిపారు. అలాగే.. కుందూ నది నుంచి 8 టీఎంసీలు తెలుగుగంగ కాలువలో ఎత్తిపోసి బ్రహ్మంసాగర్‌లో నిల్వ చేయాలని రూ.589 కోట్లతో కుందూ-టీజీపీ ఎత్తిపోతల పథకం డీపీఆర్‌ ప్రభుత్వానికి వెళ్లినా టెండర్లు ఎలా పిలవాలనే చర్చలోనే ఉంది. టెండర్ల పక్రియ పూర్తి చేస్తే ఈ పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. అయితే.. ప్రభుత్వం స్థాయిలో ఫైలు నత్తనడకన కదులుతోందని సమాచారం.


గండికోటలో 27 టీఎంసీలు నింపాలంటే

గండికోట సామర్థ్యం 26.850 టీఎంసీలు. పునరావాస ప్యాకేజీ (ఆర్‌ అండ్‌ ఆర్‌) నిధుల సమస్య కారణంగా 12 టీఎంసీలు కూడా నింపలేని పరిస్థితి. చంద్రబాబు పునరావాస ప్యాకేజీ రూ.6.75 లక్షలకు పెంచి రూ.479 కోట్లు ఇచ్చారు. సీఎం జగన్‌ రూ.10 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఖాళీ చేసిన 14 గ్రామాలకు బ్యాలెన్స్‌ అమౌంట్‌ రూ.2.25 లక్షల ప్రకారం, 20 టీఎంసీల లెవల్‌లో ఖాళీ చేయాల్సిన తాళ్లప్రొద్దుటూరు, ఎర్రగుడి, చామలూరు గ్రామాలు కలిపి రూ.943 కోట్లు పునరావాస ప్యాకేజీ ఇవ్వాలి. 27 టీఎంసీల లెవల్‌లో మరో 6 గ్రామాలు ఖాళీ చేయాలంటే సుమారు రూ.350-400 కోట్లు కావాలని అంచనా. 20 టీఎంసీలు నింపాలన్నా రూ.943 కోట్లు ఇవ్వాలి. ఆ మూడు గ్రామాలను ఖాళీ చేయాలన్నా రూ.359 కోట్లు ఇవ్వాలి.


అయితే.. కొండాపురానికి మాత్రమే రూ.145 కోట్లు ఇచ్చారు. మిలిగిన గ్రామాలను ఖాళీ చేయించకపోతే 27 టీఎంసీలు నిల్వ చేయడం ఎలా సాధ్యం..? సీఎం జగన్‌ ఇచ్చిన హామీ నేరవేరాలంటే తక్షణమే పునరావాస ప్యాకేజీ నిధులు ఇవ్వాల్సి ఉంది. 


ఉమ్మడి జిల్లాల ప్రాజెక్టు గుండ్రేవుల

తుంగభద్ర నదిపై గుండ్రేవుల జలాశయం నిర్మిస్తామన్నది పాదయాత్రలో ఇచ్చిన కీలక హామీల్లో ఒకటి. కేసీ కాలువ కింద కర్నూలు, కడప జిల్లాలో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలంటే 20 టీఎంసీలతో నిర్మించదలచిన ఉమ్మడి జిల్లాల ప్రాజెక్టు అయిన గుండ్రేవుల ఎంతో అవసరమని రైతులు అంటున్నారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ ప్రభుత్వం వద్ద ఉంది. చంద్రబాబు ప్రభుత్వం 2019 డిసెంబర్‌ 21న రూ.2,890 కోట్లు మంజూరు చేస్తూ జీవో ఆర్‌టీ నెం.154 జారీ చేసింది. తుంగభద్రకు ఏటా జూన్‌ ఆఖరులో, జూలై ప్రారంభంలో వరద వస్తుంది. ఈ జలాశయం నిర్మిస్తే కడప జిల్లాలో కేసీ చివరి ఆయకట్టుకు సాగునీటి సమస్యే ఉండదని ఇంజనీర్లు అంటున్నారు. అలాగే.. శ్రీశైలం 854 అడుగుల లెవల్‌లో సిద్ధేశ్వరం అలుగు (బ్రిడ్జి కం బ్యారేజీ) నిర్మాణానికి జగన్‌ హామీ ఇచ్చారు. ఆ ప్రాజెక్టు ఊసే లేదు.

Updated Date - 2020-05-27T09:49:47+05:30 IST