Abn logo
Jun 21 2021 @ 00:38AM

నేల ఇది నీది దక్కించుకో నీకై!

ఈ ధాత్రి

ఓ చైతన్య స్రవంతి.

కాల్జేతులు మట్టికొట్టుకుపోయి

ఈ నేల దున్నిన వారే వినగలరు

గ్రామదేవతని తొలుస్తున్న

తొలి ఉలి రవాలు.

తత్తర జ్వాలల్లో రేగిన ఆర్యుల శ్లోకాలు

చాతుర్వర్ణాల సంకెలలు, పాశాలూ,

ధూమం, సింధూరం, గుర్రాల దౌడు, సమరాలూ,

ఇతిహాసాలూ, పురాణాలూ,

తలుపులు తెరిచిన తాళంచెవిలా

తదుపరి వెన్నులో దిగిన చురకత్తీ!


రేగిన తేనెతుట్టె సద్దుమణిగే రీతి

భావ ధారలు

అక్కున చేరిన ఆలోచనలు, విశ్వాసాలూ.

కొన్ని విషపూరితం,

కొన్ని యాతన భరితం.

మరికొన్ని

ఆలయాల, మసీదుల, చర్చీల నీడన అల్లుకున్న

సామూహిక సామరస్య కదంబ మాలలు. 

అవే ఈ జాతి ఇవాళ్టికీ వేసే 

    ప్రతి అడుగు కింది పునాదులు.

శిథిలాలపైనే కదులుతూ

చాలా కాలమే అయ్యింది

పరాయి వెళిపోయీ!

అర్ధరాత్రి తంతులో యజమానుల ఆధీనం ఈ భూభాగం.

వేకువలో వెలుగులు

నలుదిశలా ప్రసరించాయి,

చూపులకే కిటికీలు

నలుదిక్కులు చూపించాయి.


క్షీరం... హరితం... చిత్రం

తీర్చేందుకు ఆకలి దాహం

ఒకే చూరు కింద అంతా బతికేందుకు

కొందరు గోడలు బద్దలుకొట్టడంలో

నిరతం నిమగ్నులై వున్నారు.

ఇంకొందరు అపహరించారు,

తలుపులు మూసేసారు,

ధృవీకరణ పత్రం తారుమారు రాస్తున్నారు,

ఒప్పందం ఏమారుస్తున్నారు,

గోడలు తిరిగి కట్టేస్తున్నారు,

కొత్త రంగులు పులుముతున్నారు,

పాత మంత్రాలతో బందీలను వశీకరించేసారు,

కిటికీలకు విశ్వాసాల పరదాలు రెపరెపలాడించారు.  

చొరబడదిక ఏ వెలుగు!

అంతా అలముకున్న చీకటి!


విశ్వాసం ఒక హేతుబద్ధ ఉద్వేగం అయితే

కాలం అల్లిన కట్టుకథల దారానికి

ఎటో తెలియక వేలాడే బుడగలా

ఎగరేయకు దాన్ని మటుకు.


భీతితో దున్ని,

కన్నీటితో నాటిన విత్తులిక్కడ

కలుపుల పాలు 

ఇది సమయం

కలుపులతోపాటు అన్నింటినీ

ఒక కాపు కాసేందుకు

మనకు పురుడుపోసిన నేలన

మనం పురుడు పోసిన నేలన

ఒక కాపు కాసేందుకు

ఇదీ సమయం!


ఈ నేలన నడయాడిన

కవులు, రైతులు, జనపదులూ,

ఇతిహాసాలూ, పురాణాలూ,

మూలాలూ, పాశాలూ,

మదిని, హృదిని అల్లుకున్న

పేదరాశి పెద్దమ్మ తెగిన కథల లంకెలన్నీ

తిరిగి కూర్చి వల్లించేందుకు

బాకీ పడ్డాము మనమే!

 

ఇదేమీ కట్టుకథ కాదు

గులాబీలు గుబాళిస్తున్నాయి అంతటా

భయాలు వీడుతున్నాయి.

కన్నీరు తుడుచుకుపోయింది

సొలసిన కవాతులో.

అడుగులు దిటవయ్యాయి.

గరిమ కూడిక చేస్తోంది మననంతా

ఓ వేకువకువ దిక్కుకు!

జమిలి కవనం: సతీష్‌ చంద్ర, 

శ్రీశైల్‌ రెడ్డి పంజగుల, 

అనంతు చింతలపల్లి