పోరాట ప్రవాహం ఆమె జీవితం

ABN , First Publish Date - 2022-03-22T07:58:20+05:30 IST

ఆమెకుమల్ల యుద్ధం రాదు. కాని మల్లు. స్వరాజ్యం కోసం, స్వతంత్రం కోసం కుస్తీ పట్టిన యోద్ధ. ఇంటివాళ్లు ఎకరాలకు ఎకరాలు పేదలకు ఇస్తుంటే సామాజిక అవసరం అర్థం చేసుకుంది. వెట్టిచాకిరి చేయించే దొరల దుర్మార్గాన్ని...

పోరాట ప్రవాహం ఆమె జీవితం

నివాళి : మల్లు స్వరాజ్యం 1931–2022

ఆమెకుమల్ల యుద్ధం రాదు. కాని మల్లు. స్వరాజ్యం కోసం, స్వతంత్రం కోసం కుస్తీ పట్టిన యోద్ధ. ఇంటివాళ్లు ఎకరాలకు ఎకరాలు పేదలకు ఇస్తుంటే సామాజిక అవసరం అర్థం చేసుకుంది. వెట్టిచాకిరి చేయించే దొరల దుర్మార్గాన్ని తన 11వ ఏట చూసి బాధ పడింది. వెట్టి చాకిరిగాళ్లకు బియ్యం పంచింది. 16వ ఏటనే తుపాకీ పట్టింది. మహిళా దళాధిపతి అయింది. ఆమె మల్లు స్వరాజ్యం. 91వ ఏట ఈ నెల 19న తన జీవనపోరాటాన్ని విరమించింది.


‘1930–31 ప్రాంతాల్లో పుట్టినన్నేను. స్వరాజ్యం అని, నాకీ పేరు మా అమ్మనే పెట్టుకున్నది. మా బంధువొకాయన కాంగ్రెస్ సభలకు పొతుండేటోడట. బొంబాయికి పోయి సత్యాగ్రహంలో కూడా పాల్గొన్నడట. గాంధీ గురించి, జాతీయోద్యమం గురించి అమ్మకు ఆయన వివరించిండట. అప్పటికి నేను పుట్టి 20 రోజులైంది. ఆయన మాటలు విన్న మా అమ్మ నాకు స్వరాజ్యం అని పేరు పెట్టుకున్నది’ (నా మాటే తుపాకీ తూటా). ఝాన్సీ లక్ష్మీబాయి, ఓరుగల్లు రాణి రుద్రమల ప్రభావం తనపై ఉంది. చదువుతోపాటు ఈత, గుర్రపు స్వారీ కూడా నేర్చుకున్నారు. స్వరాజ్యం గారి అమ్మ ఆమెకు చిన్నపుడే మాక్సింగోర్కీ రాసిన ‘అమ్మ’ పుస్తకాన్నిచ్చింది. (ఈ సిలబస్ రచించిన ఆ తల్లికి జోహార్లు). ఆ పుస్తకంలో నియంతలు కొడుకును నిర్బంధించినప్పటికీ అతడి లక్ష్యాన్ని సాధించడం కోసం రంగంలోకి దిగిన అమ్మ, స్వరాజ్యంను కదిలించింది.


‘ఒకసారి ఎల్లమ్మ వడ్లు దంచుతూ కళ్లుతిరిగి పడిపోయింది. అక్కడ కాపలా ఉన్న బాలిక స్వరాజ్యం దబదబ నీళ్లు తీసుకుపోయి తాపించింది. ఆకలైతున్నదంటే అన్నం తినిపించింది. దంచుతున్నవాళ్లందరు మాక్కూడా ఆకలైతున్నదమ్మా అన్నం పెట్టరా అని అడిగిన్రు. ఇంట్లో అంత అన్నం లేదు. బియ్యం తీసుకుని నాన పెట్టుకుని తింటమన్నరు. మంచిది తినమని చెప్పిన’ అని స్వరాజ్యం అన్నారు. అయితే ఆ మంచి పని కుటుంబంలో తప్పయిపోయింది. చిన్న పిల్ల దాన్ని ఏమనకండి అని తన తల్లి తనకు అండగా నిలవడం ఆమె గుర్తు చేసుకున్నారు. ఆమె బాలల సంఘం పెట్టి బాలల కోసం పోరాడేది. చిన్నపుడే పెళ్లి అయిన ఒక అమ్మాయిని కొన్నేళ్లకు అత్తవారింటి మగవారు బలవంతంగా గుంజుకుపోతుంటే చూసిన స్వరాజ్యం, తన పిల్లల గుంపుతో కలిసి వారిని ఎదిరించి వెనక్కి తీసుకురావడం ఒక అద్భుత విజయం అనవచ్చు. (తరువాత రెండు కుటుంబాల వారు మాట్లాడుకుని మళ్లీ ఆమెను అత్తవారింటికి పంపారట).


ఆడపిల్లలు కష్టాలు చెప్పుకుంటూ పాటలు పాడుకునేవారు. అందులో ఒక ఉయ్యాల పాట స్వరాజ్యం తన పుస్తకంలో రాసారు. ‘భారతి భారతి ఉయ్యాలో మా తల్లి భారతి ఉయ్యాలో, జనగామ తాలూక ఉయ్యాలో విసునూరి దొరోడు ఉయ్యాలో, నైజాం రాజ్యాన ఉయ్యాలో, నాగిరెడ్డి పాలన ఉయ్యాలో, వెట్టి చేయలేక ఉయ్యాలో, చచ్చిపోతున్నం ఉయ్యాలో....’ ఈ విధంగా సాగుతుంది ఆ కష్టాల పాట. ఈ పాట పాడెటోళ్లం అని చెప్పారామె. ఒక్కో ఊళ్లో తిరుగుబాటు నేర్పడానికి పోరుబాట చూపడానికి జనంలో నిప్పురగల్చడానికి ఇటువంటి పాటలు సాధనమైనాయన్నారు. ఇక ఆమె ఊళ్లో చేయవలిసిన పని గానీ చేయలేని పని గానీ ఏదీ లేకుండె. ఒక పక్కన తుపాకి పట్టుకుని మరొక పక్కన మంత్రసాని పనికూడ చేసిన అని రాసారు. ఒక ఊళ్లో ఐలమ్మ ధైర్యంగా నిలబడ్డది. ‘దొరోడు ఏం పీకుతడో జూస్త’ అని అనగలిగింది. అది స్వరాజ్యం విజయం. ఆ విధంగా ఒక్కొక్క ఊరూ తిరగబడ్డది. స్వరాజ్యం మాటలు తూటాలై తిరగబడేట్టు చేసినై. ఆ రోజుల్లో అంటే ఈనాటి ఆజాదీకా అమృతోత్సవ్ అని పండుగలు చేసుకోవడానికి 75 ఏళ్ల ముందు, పట్టిస్తే పదివేలు అని స్వరాజ్యం తలకు వెల కట్టాడు నిజాం రాజు. కాని జనం పదివేలకు కక్కుర్తిపడలేదు. తమకోసం తుపాకి పట్టిన వీర వనిత అని తెలుసు కనుక ఎవరూ పట్టివ్వలేదు. అక్క శశిరేఖ, సోదరుడు భీంరెడ్డి నరసింహారెడ్డి, ఆయన సహాధ్యాయి రావి నారాయణ రెడ్డి ఆమెకు నిలబడే వెన్నెముకను, నిలదీసి అడిగే ధైర్యాన్నిచ్చారు. అన్యాయం మీద మెదడు తొలిస్తే, నిలబడగలిగితే కదా తుపాకి పట్టుకోవడానికి చేయి కదిలేది.


‘నీ కాల్మొక్త దొరా నీ బాంచెను’ అనకండి ‘దున్నేవాడిదే భూమి, గీసేవాడికే చెట్టు, భూమి కోసం భుక్తి కోసం ప్రజాస్వామ్య విముక్తి కోసం ఈ పోరాటం’ అనండి అని స్వరాజ్యం నినదించారు. ఆ రోజుల్లో యువతులచేత తుపాకీ పట్టించిన తూటాలు ఈ మాటలు. తన చిన్నతనంలో కుటుంబ సభ్యులు తమకున్న వందల ఎకరాలు పేదలకు దానం చేస్తుంటే చూసింది. తరువాత రజాకార్లు అతి క్రూరంగా జనం మీద పడి విలయతాండవం చేస్తుంటే సహించలేకపోయింది. ఇళ్లు గుంజుకుని, బట్టలు బోళ్లతోపాటు బయటికి తోసి, పొలాలు సొంతం చేసుకొని, ఊళ్లకు ఊళ్లు తగల బెట్టి, అత్యాచారాలు చేసి, ఏం చేయకపోయినా చంపేసి రజాకార్ల దండు చేయని అక్రమాలు లేవు. ఆ దండు వస్తే చావడం తప్పదు. ‘ఎట్లాగూ చస్తాం కదా.. చావడానికి సిద్ధంగా ఉందాం, శత్రువులను చంపడానికి సిద్ధపడదాం, చచ్చే ముందు చంపుదాం’ అని స్వరాజ్యం పల్లెటూళ్లలో దళాలను తయారు చేసారు. గ్రామాల్లో వేలకొద్ది దళాలు ఏర్పడ్డాయి, వాళ్లు వడిసెల్లో రాళ్లు పెట్టి కొడతారు. కారపు నీళ్లు కళ్లల్లో చల్లుతారు. తుపాకులు ఎక్కుపెడతారు. చంపుతారు, చనిపోతే పోతాం ఫరవాలేదంటారు. ఆనాటి ఆ అరివీరదళాలకు అధినేత్రి మల్లు స్వరాజ్యం.


మహిళ కావడం అనే అంశం స్వరాజ్యం ఉద్యమానికి ఆవేశానికి అడ్డుకాలేదు. నాగళ్లు వదిలిపెట్టి తుపాకులు పట్టుకోవడానికి రైతులను సిద్ధం చేయడానికి అడ్డుపడలేదు. నిజాం రాజుకు, అతని భూస్వాములకు దొరలకు బానిసలుగా బతుకుదామా, వీరోచితంగా పోరాడదామా అని ఆమె అడుగుతూ ఉంటే ఎవరు మాత్రం ఏ జవాబు ఇవ్వగలుగుతారు. తుపాకి పట్టడం తప్ప ఏం చేస్తారు?


నిజాం రాజు కంటే అతని తాబేదార్లు, దొరలు మరీ దుర్మార్గులు. ప్రతిదానికీ పన్ను వేస్తారు. ఇంట్లో పాప పుడితే వాడికి నజరానా ఇవ్వాలట. పెళ్లి చేసుకుంటే దొరకు పన్ను కట్టాలట. కూలి నాలి చేసుకునేవాడు, వడ్రంగి కమ్మరి, కుమ్మరి ప్రతివాడూ తన సంపాదనలో కొంత వీడికి కట్టాలట. బాలింతలు పాప పుట్టిన మూడో రోజే పనికి వెళ్లాల్నట. పాలియ్యడానికి కూడా వదలరట. ఆకలికి పాపలు బలవుతుంటే కూడ కదలని ఈ దొరల మీద తిరగబడడం నేర్పింది మల్లు స్వరాజ్యం.


దొర గడీ గడియ వేసి ఉన్నా సరే దాని ముందు వీడు చెప్పులు తొడుక్కొని నడవొద్దు. నీ బాంచెను అనకుండా ఒక్క వాక్యం కూడా చెప్పొద్దు. నీ కాల్మొక్త అనడమే కాదు కాళ్ల మీద తల పెట్టాల్సిందే. నెత్తికి రుమాల్ ఉండొద్దు. విప్పి చంకలో పెట్టుకోవాలె. భయపడుతూ చావడమా, భయపడకుండా పోరాడడమా అని స్వరాజ్యం వాళ్లను అడిగింది. ప్రతి ఊళ్లో 20 నుంచి 30 మందిని తయారు చేసేది. మరోవైపు గ్రంథాలయాలు పెట్టి, వాటికి భవనాలు లేకపోతే చెట్టుకింద పుస్తకాలు ఇచ్చి చదువుకొమ్మనేది. వారంతట వారే పంచాయత్‌లుగా ఏర్పడి చిన్ని చిన్న ఊరి సమస్యలు పరిష్కరించుకొమ్మనేది. అప్పట్లో ఆంధ్ర మహాసభ వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాడేది. దుర్మార్గాలను ఎదిరించేది. ఆంధ్రమహాసభలో చురుకైన కార్యకర్తగా ఉండే దొడ్డికొమురయ్యను విసునూరు రామచంద్రారెడ్డి చంపించిన సంఘటన తెలంగాణను కదిలించింది. విప్లవోద్యమం ఊళ్లు జిల్లాలు దాటి చెలరేగింది. కొమురయ్య హత్య సంచలనం ఉద్యమానికి ఊపునిచ్చింది. పోరాడినా పోరాడకపోయినా చావు తప్పదు. కనుక పోరాడడమే మంచిదనే నిర్ణయానికి వచ్చారు.


తనకు మేజర్ జైపాల్ సింగ్ తుపాకి పట్టడం నేర్పినాడని స్వరాజ్యం ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నిజాం సాయుధ పోలీసులు, దానికి తోడు అడ్డూ అదుపూ బాధ్యతా ఏదీ లేని రజాకార్ల బందిపోటు ముఠా. వాళ్లతో కొట్లాడడం కోసం వ్యూహాలు నేర్చుకునేవారు. తుపాకీని శత్రువులకు దొరకకుండా కాపాడుకోవడం నేర్చుకునేవారు. తన పోరాట అనుభవాలు ఈ విధంగా వివరించారు: ‘అన్నకొడుకు పోలీసుల మీద తుపాకులతో కాల్పులు జరిపి, ఎస్ఐని చంపేసి, తుపాకీ గుళ్లనీ కొట్టేసి, తూటాలు వడిసిపోయిన తరువాత శత్రువుచేతిలో చావు తప్పదని తెలిసిన తరువాత తుపాకీని పూర్తిగా విరగ్గొట్టి గాని చనిపోలేదట. అంత పట్టుదల, చావులో కూడా కర్తవ్యనిర్వహణాదీక్ష. మరణానికి భయపడకుండా ఆ విధంగా సిద్ధపడడం అంటే ఎంత గొప్ప ధైర్యం అది’. ఆ విధంగా ఆమె నలుగురు సన్నిహిత బంధువులను కోల్పోయారు. తన పెద్దన్నయ్య వకీలు, ఆయన కొడుకుల్లో ముగ్గురు విప్లవోద్యమంలోకి వచ్చారు. వారిలో ఒకరు సాయుధ దళానికి నాయకత్వం కూడా వహించారు. మరొకరు ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడు.


సాయుధ రైతాంగ పోరాటం ఫలితంగా మూడువేల గ్రామాలు విముక్తమైనాయి. నిజాం కూలిపోయాడు. హైదరాబాద్ భారతదేశంలో కలిసింది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగపరమైన స్వరాజ్యపాలన వచ్చాయి. కాని పేదల బతుకులు, వారి పైన కొత్త భూస్వాముల పెత్తనం మారలేదని మల్లు స్వరాజ్యం బాధపడేవారు. దున్నేవాడు భూమికోసం పోరాడుతూనే ఉన్నాడు. గీసేవాడు చెట్టు అడుగుతూనే ఉన్నాడు. దున్నేవాడికే భూమి అని ఇంకా చెప్పుకుంటూనే ఉన్నాం. ఆజాదీకి 75 ఏళ్లు వస్తున్నట్టే, రైతాంగ పోరాటానికి 75 ఏళ్లు నిండినట్టే, దున్నేవాడికే భూమి అనే శుష్కనినాదానికి కూడా స్వర్ణోత్సవాలు చేసుకుంటున్నాం. మల్లు స్వరాజ్యం తొలుత 1978లో, ఆ తరువాత 1983లో శాసనసభకు ఎన్నికైనారు. ఆమె ఒక రోజు శాసనసభా సమావేశ మందిరంలో కొన్ని బుల్లెట్లు తెచ్చి పోసారు. తన నియోజకవర్గంలో ఒక సామాన్యుడి భూమిని కొత్త దొర ఎవరో బలవంతంగా తీసేసుకున్నాడు. ఆమె మరికొందరిని కలుపుకొని ఆ దొర భవనానికి వెళ్లి ఏమిటీ అన్యాయం అని నిలదీసారు. అప్పుడా దొర తుపాకీ తీసి కాల్చాడు. చేతి కందిన రాళ్లు విసిరి జనం ప్రాణాలు దక్కించుకున్నారు. మల్లు స్వరాజ్యం దొర కాల్చిన తుపాకీ తూటాలను ఏరుకుని శాసనసభలో పోసి, ఇదిగో ఇదీ మన ప్రజాస్వామ్యం అని చెప్పారు. దీనికోసమేనా మనం పోరాడింది అని నిలదీసి అడిగారు. ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం ఇస్తారు? ప్రతి వోటరూ సమాధానమైనా చెప్పాలి లేదా ఈ ప్రశ్నైనా అడగాలి.

మాడభూషి శ్రీధర్

Updated Date - 2022-03-22T07:58:20+05:30 IST