శివ భక్తిలో పూచిన కవిత్వ పుష్పం

ABN , First Publish Date - 2020-06-29T11:06:16+05:30 IST

అక్కమహాదేవి వచనాలన్నీ - ఆమె భావావేశాలు, ఆమె ఆలోచనలు, ఆమె సంఘర్షణలు, ఆమె పరమానందాలు. ఇది చేయండని అది చేయండని బోధించలేదు....

శివ భక్తిలో పూచిన కవిత్వ పుష్పం

అక్కమహాదేవి వచనాలన్నీ - ఆమె భావావేశాలు, ఆమె ఆలోచనలు, ఆమె సంఘర్షణలు, ఆమె పరమానందాలు. ఇది చేయండని అది చేయండని బోధించలేదు. శివుడ్ని కోరుకుంటూ అతనిని నిరంతరం ప్రేమిస్తూ, భూగోళం చీకటి అడవిలో చెన్నమల్లికార్జునుని పిలుపుకోసం ఎదురుచూస్తూ కొమ్మలన్నింటి మీదా ఆశతో కూస్తున్న కోయిలలా గడిపింది. 


శిమోగా జిల్లాలోని, శికారిపురా తాలూకా ఉదుతడి (ఉద గని)లో శివభక్తులైన నిర్మల, సుమతిశెట్టి దంపతులకు 1130లో జన్మించింది మహాదేవి. బాల్యం నుండీ చెన్న మల్లికార్జునిని ఆరాధనలోనే ఎక్కువ కాలం గడిపేది. సామాజి కంగా ఆశించేవాటికి అనుగుణంగా నడుచుకోవటం, ఆపేక్షకు విరుద్ధంగా పోగలిగే నేర్పు సాహసాన్ని కలిగి ఉండటం, సంపూర్ణ ఉత్తేజంతో తాను నమ్మిన దైవారాధనలో లీనమవటం - వీటన్నింటి మధ్యా నలిగిపోయేది. ఆమె యవ్వనప్రాయానికి వచ్చేసరికి, ఆ ప్రాంతపు జైన సామంతరాజు కౌషికుడు (జైనుడు కాకముందు అతని పేరు కాసపయ్య నాయక), మహాదేవి అందానికి రమణీయానికి ఆకర్షితుడై ఆమెనే పెళ్లి చేసుకోవాల నుకున్నాడు. రాజు తలచుకుంటే జరగనిది ఏముంది. అయితే ఆమె పెట్టిన నిబంధనలకు లోబడి ఉంటేనే అతనికి భార్యగా ఉంటానని రాజు దగ్గర వాగ్దానం తీసుకొని వివాహానికి ఒప్పు కొంది. పెళ్లయాక పేరుకే ఆమె తన భార్యగా ఉండటం, ఆమెకు ఇచ్చిన వాగ్దాన చట్రంలో నిత్యం ఇమిడి ఉండటం, రాజుకు ఎన్నాళ్లో సాధ్యం కాలేదు. అతని కామేచ్ఛ అతని వాగ్దాన భంగానికి దారితీయటంతో, ఆమె అతనిని తోసిరాజని బయట పడింది. రాజుని ఎదిరించటం ఎవరికైనా సాధ్యమయే పనికాదు. అందులోనూ మగతనం ఎంతకైనా తెగిస్తుంది. అందుకని ఆమె ఆభరణాలనే కాదు, దుస్తుల్ని సైతం త్యజించి, కేవలం తన పొడవాటి జుత్తును మాత్రమే నగ్న శరీరానికి కప్పుకుని బయలుదేరింది. ‘‘చేతి సంపాదనకు పన్ను వేయొచ్చు/ శరీర సౌందర్యానికి పన్ను వేయొచ్చా/ నా దుస్తుల్నీ ఆభరణాల్నీ నువ్వు లాక్కోవచ్చు/ నన్ను ఆవరించిన శాంతిని నువ్వు లాక్కో గలవా?/ చెన్నమల్లికార్జునుడి కాంతిని కప్పుకొని సిగ్గుని విడిచి పెట్టాక/ ఒరే మూర్ఖుడా/ నాకు ఆభరణాలు ఎందుకు?/ ఆచ్ఛాదన ఎందుకు?’’ - అని ధైర్యంగా ఎదిరించ్గలిగింది.


స్త్రీ అందమే ఆమెను శత్రువులా వెన్నాడుతుంటుంది. ఒకవైపు రాజు ప్రయత్నాలు రాజువి, మరోవైపు కాముకుల ప్రయత్నాలు వారివి. వాటనన్నింటినీ తట్టుకొని, చెన్నమల్లికార్జునిని మీద భారం వేసి, చివరకు వీరశైవుల క్షేత్రంగా మారిన, వీరశైవులు ఆరా ధ్యుడుగా కొలిచే బసవన్న, అతని సమకాలిక శరణుల స్థలం, బీదర్‌ జిల్లాలోని పశ్చిమ చాళుక్యుల రాజధాని కళ్యాణలోని అనుభవమంటపాన్ని చేరుకుంది. అప్పటికి ఆమె వయస్సు పద హారేళ్లు. ఆమె వారిలో చేరటం కూడా అంత సులువుకాలేదు. అక్కడ కూడా వారి పరీక్షల్లో తననుతాను నిరూపించుకోవలసి వచ్చింది. ‘‘నీ భర్త ఎవరు?’’ అని, అనుభవమంటపం అధ్యక్షుడు గొప్ప యోగి అయిన, అల్లమ ప్రభు అడిగినదానికి, ‘‘చెన్నమల్లికా ర్జునుడే నా భర్త కావాలని కోరుకుంటున్నాను’’ అందామె. కేవలం జుత్తు కప్పుకుని నగ్నంగా తిరగటం సిగ్గనిపించటం లేదా అంటే, నేను జుత్తును కప్పుకున్నది సిగ్గుతో కాదు, ఇతరుల కోసం అంది. 


అందరికంటే ముందు అనుభవమంటపంలోని ఒక శరణుడు కిన్నెర బ్రహ్మయ్య ఆమెను అవమానకరంగా అసభ్యంగా పరీక్షించ బోయి అతనే భంగపడి క్షమాపణ కోరుతాడు. అల్లమప్రభువు అడిగిన ప్రశ్నలకు ఆమె ఇచ్చిన జవాబులు, వారందరికీ ఆమె పట్ల గౌరవాన్ని పెంచాయి. ఎంతగానంటే ఆమెను మొట్టమొదటి సారిగా అక్కా అని వారు సంబోధించారు. ఆమె పేరులో అది ఒక భాగమై, అప్పటినుండీ ఆమె అక్కమహాదేవి అయింది. వీరశైవు ల్లో ఒకరిగా మారింది. ఆమె వైశ్య కులానికి చెందినది. ఆ కులా నికి చెందిన స్త్రీ వచనకారుల్లో ఆమె ఒక్కర్తే.  


కళ్యాణలోని అనుభవ మంటపం నుండి ఆమె ప్రియుడు చెన్నమల్లికార్జునునిలో ఐక్యమయేందుకు శ్రీశైలంలోని కదళీవనానికి చేరుకుని, అక్కడే ముప్పయి సంవత్సరాల ప్రాయం లోనే 1160లో శివైక్యం చెందింది. ప్రబోధాత్మక కవిత్వం ఆమెది. చెన్నమల్లికార్జునిపైన ప్రేమ, ప్రకృతితో సామరస్యం నిండి సరళమైన భాషలో ఉండే అద్భుత వచన కవితలు ఆమెవి. చెన్నమల్లికార్జున మకుటంతో రాసిన ఆమె వచనాలు 434 వరకూ ఉన్నాయి. మల్లిక అంటే పార్వతి, అర్జున అంటే శివుడు, చెన్నమల్లి కార్జునుడు అంటే అందమైన పార్వతీశివుడు, ఆమె ఆరాధ్యుడు బాల్యం నుండీ. భౌతిక ఉప మానాలు, సంపన్నమైన అభి వ్యక్తితో, మార్మిక కవిత్వంతో, చెన్నమల్లికార్జుని పట్ల అచం చలమైన ప్రేమతో ఆమె వచనాలు అలరారుతాయి. యోగాంగ త్రివిధి, స్వరవచన, శ్రీస్త్రియవచన, మంత్రగోప్య లాంటి ఇతర రచనలు ఆమెవి ఉన్నా, ఆమె ఆంతరికజీవితాన్ని ఆలోచనల్ని సంపూర్ణంగా ప్రతిబింబించేవి మాత్రం ఆమె వచనాలే. 


ఆమె తరచు ప్రకృతిని ఉదాహరణలుగా వాడుతుంది. బండతో నదిలోకి దూకినంత మాత్రాన నీ కష్టాలు తొలగిపోతాయా, తిన్నాక కూడా ఆకలి అనటం మంచిదా అని తనను తాను ప్రశ్నించుకుంటుంది. ఆమె ఒక గొప్ప గురువు, మార్మికురాలు: ‘‘కోతులాడించే వాని కట్టె మీద కోతిలా/ దారానికి చివర కీలు బొమ్మలా/ నువ్వు ఆడించినట్టల్లా ఆడాను/ నువ్వు చెప్పినట్టల్లా పలికాను/ నువ్వు ఎలా ఉంచుతే అలా ఉన్నాను/ నువ్వు ఆపేయ్‌ అని అరిచేవరకూ/ పరుగెడుతూనే ఉంటాను/ ఓ విశ్వేశ్వరా, చెన్నమల్లికార్జునా’’ - అని చెప్పుకుంది

స్త్రీగా తన జీవితం నుండి వచ్చినవే, అక్కమహాదేవి ఉప మానాలు. మోహానికీ కామానికీ, కోరిక దారితీస్తుందని; అది ప్రసవవేదనకి, కానుపయ్యాక గృహస్థు బాధ్యతలకి దారితీసా ్తయని; అవి శివైక్యం చెందటానికి అవరోధంగా మారతాయని గ్రహింపు ఆమెకు ఉంది. మగవారికి ప్రసవవేదనలు లేవు, తమ అవసరాలకంటే పిల్లల అవసరాలే ముఖ్యం అని భావించటాలు కూడా మగవారికి లేకపోవటంతో, వారికి బంధనాలు బంధ నాలుగా అనిపించవు. స్త్రీ జీవితం - భర్తా, బిడ్డలతో పెనవేసు కునిపోయి ఉంటుంది. బలవంతపు వివాహానికి అంగీకరించక ముందునుండే, అటువంటి జీవితం ఆమె ఆధ్యాత్మిక జీవితానికి, గొప్ప అడ్డంకి అని తెలుసుకొంది. ఆ స్త్రీని చూడు, నిప్పు ఉందని మరచిపోయి నిప్పుగూడులోకి ప్రవేశిస్తోంది అని కూడా వాపోతుంది. ఉదయాస్తమయాల రెండు కొలతలతో, జీవితం ధాన్యంకుప్పని కొలుస్తారు. అదేదో అయిపోయేలోగానే శివుని గుర్తుంచుకో. ఈ జీవితం మళ్లీ రాదు అని హెచ్చరిస్తుంది. 


‘‘దాని స్వీయ లాలాజలం దారాలతో/ తన ఇంటిని ప్రేమగా అల్లుతూ/ బిగువుగా చుడుతూ చుడుతూ/ ఆ దారాలలోనే/ చస్తున్న పట్టుపురుగులాగ/ నా హృదయం కోరుకుంటున్న కోరికలో/ నేను దహించు కుపోతున్నాను./ ఓ స్వామీ/ నా హృదయ పేరాసను/ నరుక్కుంటూపోయి/ నీ దారి నాకు చూపించు/ చెన్నమల్లికార్జునా’’ అని వేడుకొంది ‘‘వెనక గొయ్యి, ముందు ప్ర వాహం/ అడ్డంగా ఎలా వెళ్లగలను చెప్పు?/ వెనక సరస్సు, ముందరంతా వల/ స్థైర్యంగా ఎలా ఉండగలను చెప్పు?/ నీ మాయ నన్నిక్కడ చంపుతోంది/ రక్షించు రక్షించు ఓ చెన్నమల్లికార్జునా!’’ అని ప్రాధేయపడుతుంది.


ఆమె అనుభూతుల తీవ్రత, ఆమె ఆత్మ శోధన, ఆమె వ్యక్తిగత స్పర్శ మూలంగా ఆమె వచనాలు ఎవరికైనా దగ్గరవుతాయి. ‘‘ఒక్క చంద్రునికే తెలుసు ఆకాశంలో ఏముందో/ అంతెత్తున ఎగిరే రాబందుకు తెలుస్తుందా స్వామీ?/ ఒక్క పద్మానికే తెలుసు సరస్సులో ఏముందో/ ఒడ్దునున్న కలుపుమొక్కకు తెలుస్తుందా స్వామీ?/ ఒక్క తుమ్మెదకే తెలుసు పుష్పంలోని సుగంధం/ దోమకు తెలుస్తుందా స్వామీ?/ స్వామీ చెన్నమల్లికార్జునా/ నీ ఒక్కనికే తెలుసు నీ భక్తులు/ బర్రెల శరీరం మీద తిష్ట వేసిన ఈగలకు తెలుస్తుందా?’’ - అని ప్రశ్నిస్తుంది.


‘‘సూర్యరశ్మి ఆకాశాన్నంతా కనబడని చ్చింది/ చెట్ల, పొదల, తీగల మీద గాలి కదలిక,/ ఆకూ, పూవూ, ఆరు రంగులూ/ ఇదంతా పగళ్ల ఆరాధన/ చంద్రకాంతి, నక్షత్రం, మంట, మెరుపు,/ కాంతితో ముడిపడ్డవన్నీ రాత్రుల ఆరాధన/ రాత్రులూ పగలూ నీ ఆరాధనలో నన్ను నేను మరచిపోతాను/ చెన్నమల్లికార్జునా!’’ అంటుంది. ఆమె తల్లిదండ్రులు ఆమె విష యంలో జోక్యం చేసుకుందుకు నిరాకరించాక, అవమానాన్ని భరించలేక అహం దెబ్బతిని మరొకమారు, రాజు కౌషికుడు, శ్రీశైలం కూడా వెళ్లి ఆమెను తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేసాడు. అది కూడా విఫలమైంది. తాను మరీ దుర్మార్గుడు కాదని చెప్పుకుందుకు, చివరిసారిగా తనను క్షమించమని చెప్పుకుం దుకు మాత్రమే, ఇంకొకసారి వెళ్లి తిరిగొచ్చాడు.


ఆమె ఆధ్యాత్మిక మార్గంలో అడ్డొచ్చిన పురుషులనే ఆమె వ్యతిరేకించింది తప్ప ఆమె పురుష ద్వేషి కాదు. ఆమెకు బాల్యంలో ఆత్మలింగ దీక్షనిచ్చిన తన కుటుంబ గురువు పట్ల గౌరవం, తోటి శరణుల పట్ల ప్రేమ ఉంది. ఆకలి, కర్మ, మాయ లాంటి అవరోధాలను తొలగించమని వేడుకున్న వచనాలూ ఉన్నాయి. ఆమె యోగాంగ త్రివిధిలో భక్తితోపాటు, కుండలిని శక్తి మేల్కొన్న అనుభవాలను సైతం కవిత్వీకరించింది. ఆత్మ సమర్పణ అహంకార సమర్పణ, ఏ పనిలో ఉన్నా దేవుని సన్నిధి తప్ప ఏ ఇతర కోరికా లేకపోవటం, సర్వేశ్వరినిలో ఐక్యం కావటం లోనే పరమానందం ఉందని భావించి ఆచరించింది. ఆమె జన్మిం చిన ఉదుతడిలో, విగ్రహాన్ని నెలకొల్పారు. శ్రీశైలంలో ఆమె ధ్యానం చేసుకున్న గుహని అక్కమహాదేవి గుహగా పిలుస్తున్నారు.   


భర్తగా శివుడిని ప్రేమించాలని ఆమె స్త్రీలకు సలహా ఇవ్వ లేదు. పురుషులను ద్వేషించాలని, సమాజానికి ఎదురుతిరగాలని ఆమె చెప్పలేదు. ఏ ఇతర ప్రాపంచిక ఆలోచనలూ లేకుండా భర్తగా శివుడిని ప్రేమించింది. ఈ భూమిమీద తన జీవిత మంతా ఆ చెన్నమల్లికార్జునుడే, ఆమె భర్త అని అని చెప్పటా నికే ప్రయత్నం చేసింది. అక్కమహాదేవి వచనాలన్నీ - ఆమె భావావేశాలు, ఆమె ఆలోచనలు, ఆమె సంఘర్షణలు, ఆమె పరమానందాలు. ఇది చేయండని అది చేయండని బోధించ లేదు. శివుడ్ని కోరుకుంటూ అతనిని నిరంతరం ప్రేమిస్తూ, భూ గోళం చీకటి అడవిలో చెన్నమల్లికార్జునుని పిలుపుకోసం ఎదురు చూస్తూ కొమ్మలన్నింటి మీదా ఆశతో కూస్తున్న కోయిలలా గడిపింది. కన్నడ వచనకారుల భక్తి కవిత్వంలో అక్కమహాదేవి ఒక పరిమళభరితమైన కవిత్వపుష్పం.  

ముకుంద రామారావు

99083 47273


Updated Date - 2020-06-29T11:06:16+05:30 IST