పాటల పూదోటలో అరుణారుణ పుష్పం

ABN , First Publish Date - 2020-07-09T06:05:56+05:30 IST

పాటల పూదోటలో అరుణారుణ పుష్పం తెలంగాణ ప్రజాకవి వాగ్గేయకారుడు కామ్రేడ్‌ నిసార్‌ (58) ఇక లేడన్న వార్త ఇంకా జీర్ణం కావడం లేదు. నెల రోజుల క్రితం కరోనాపై ప్రజల్ని చైతన్యం చేస్తూ పాటలు...

పాటల పూదోటలో అరుణారుణ పుష్పం

కామ్రేడ్‌ నిసార్‌ మృతితో తెలుగు నేల ఒక గొప్ప ప్రజా వాగ్గేయకారుడిని, ఉద్యమ కారుణ్ణి కోల్పోయింది. ‘‘తాను చెమటలో తడిసి ముద్దవుతూ తన పాటలతో దోపిడి గుండెలకు సెమటలు పట్టిస్తాడు నిసార్‌,’’ అన్న పులి సాంబశివరావు మాటల్లో నిసార్ నిలువెత్తు రూపం నాకెప్పుడూ కనబడుతూ ఉంటుంది. కరోనా కాలానికి బలయిన నిసార్‌ జ్ఞాపకాలను నిలుపుకునేట్టు గుండాల తాలుకా కేంద్రానికి ఆయన పేరు పెట్టి ప్రతిష్ఠాత్మకమైన ఒక అవార్డును ప్రజాకళాకారులకు అందించేలా చూడాల్సిన బాధ్యత మన అందరిది.

                నివాళి : కామ్రేడ్‌ నిసార్‌

తెలంగాణ ప్రజాకవి వాగ్గేయకారుడు కామ్రేడ్‌ నిసార్‌ (58) ఇక లేడన్న వార్త ఇంకా జీర్ణం కావడం లేదు. నెల రోజుల క్రితం కరోనాపై ప్రజల్ని చైతన్యం చేస్తూ పాటలు పాడిన నిసార్‌ అంతుచిక్కని జ్వరంతో ప్రైవేటు దవాఖానాలన్ని తిరిగి కడకు గాంధీ హాస్పిటల్‌కు చేరి ఈ రోజే ప్రాణాలు వదిలాడు. తెలంగాణ సాయుధపోరాట యోధుడు, ప్రజాకవి సుద్దాల హనుమంతు స్వగ్రామమైన సుద్దాలలోనే మహమ్మద్‌ అబ్బాస్‌, అమీనాబి దంపతులకు కలిగిన ఐదుగురు సంతానంలో నిసార్‌ చిన్నవాడు. తండ్రి అబ్బాస్‌ ఆబ్కారి జవానుగా లంచగొండి ఉద్యోగం చేయలేక వదిలిపెట్టినా, రజాకారు జమానాలో తాను ప్రజల మనిషిగా నిరూపించుకోవడమనేది ఒక అగ్ని పరీక్షనే. అలాంటి కుటుంబ నేపథ్యంలో పదవతరగతి పూర్తి కాగానే పట్నం చేరుకొని బతకడం నిసార్‌కు కత్తి మీద సాములాంటిదే. ఒక ఇసుక లారీ మీద క్లీనర్‌గా చేరి డ్రైవింగ్‌ నేర్చుకొని బతుకు పోరాటంలో గెలిచిన నిసార్‌ బతుకు పోరాట పాటలు అల్లడం కూడా నేర్చుకున్నాడు. కుల మత బేధాలెరుగని పీరీల పండుగలోని సారాన్ని, గ్రామీణ వావి వరుసల బంధాన్ని మనసునిండా అల్లుకున్నట్లు నిసార్‌ పాటల్లో, ఆయన ముల్కీ కథలో కళ్ళకు కట్టినట్టు అగుపిస్తాయి. ప్రజానాట్యమండలి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా, ప్రజాకవిగా, కళాకారుడిగా, AIPSO సహ సభ్యుడిగా అన్నింటికిమించి గొప్ప మనసున్న మనిషిగా, ఊరు పక్క ఊరోడుగా నిసార్‌తో చెరిగిపోని అనుబంధం ఉండేది.  


బహుశా 1985లో అనుకుంటా ఆర్టీసిలో కండక్టర్‌ ఉద్యోగం సంపాదించినా డ్రైవర్‌గా, మెకానిక్‌గా ఆయనకు తెలియని విద్యలేదు. నేడు అదే సంస్థలో కంట్రోలర్‌గా ఉద్యోగం నిర్వహిస్తూ ఆర్టీసి కార్మిక విభాగాల మీద, పోలీసుల మీద, భవన కార్మికుల మీద, స్త్రీల అణచివేత మీద నిసార్‌ సృజించని పాటలు లేవు. కాలికి గజ్జెకట్టి ప్రజల్ని మెప్పిస్తూ పాడని పాట లేదు. ప్రత్యేకించి ‘‘పండు వెన్నెల్లలోన వెన్నెల్లలోన/ పాడేటి పాటలేమాయె/ నా పల్లెటూరిలోనా ఆడేటి ఆటలేమాయె’’ అనే పాట ఒక రకంగా తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమ పాటగా రాష్ట్ర సాధనోద్యమంలో మార్మోగింది. ధూంధాం వేదికయినా విశ్వవిద్యాలయమైనా నిసార్‌ పాటలేని వేదికలేదంటే అతిశయోక్తి లేదు. జీవిత కాలంలో వందలపాటలు రాసినా ‘నిసార్‌ ప్రజల పాటలు’ ఒకటే పుస్తకంగా ప్రచురించబడ్డది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో మొట్టమొదటి జెఎసిగా ఏర్పడ్డ ‘జనందరువు’ లోనూ ప్రజానాట్యమండలితో నిస్సార్‌ భాగమయ్యాడు. ఆఖరికి తెలంగాణ సాధించుకున్నాక నేను కన్వీనర్‌గా ఉన్న ప్రజా కళాకారుల ఐక్యవేదికలోనూ మా భాగస్వామ్యం కొనసాగింది. జూన్‌ 20, 2020 నాడు గూడ అంజన్న, ప్రభుల సంస్మరణ సభలో అరుణోదయ అధ్యక్షుడు మోహన్‌తో కల్సి వేదిక పంచుకున్నాడు. ఆ సమయంలోనే కోవిడ్‌పై నిసార్‌ పాటకు నేను అమర్‌ కల్సి అభినందనలు చెప్పాం. అమర్‌కు నిసార్‌తో అదే చివరి పలకరింపయ్యింది. అఖిల భారత శాంతి సంఘీభావ సంస్థలో సభ్యుడిగా ప్రపంచమంతా తిరిగినా, 2018లో చైనా గ్రేట్‌వాల్‌ దగ్గర మేమిద్దరం దూలా ఆడి పాడినా, మా ప్రజాఉద్యమ నేస్తం చాలా కాలం కొనసాగింది. ‘40 ఏళ్ళ నా ఉద్యమ పాటల ప్రస్థానం’ సభలో పాల్గొని ఆడి పాడాడు. నన్ను జైల్లో నిర్భంధిస్తే ‘‘విమలక్క/ నీ సేతులకు బేడీలు ఏందక్కా’’ అంటూ రాసి పాడాడు. నిసార్‌ పాటల పుస్తకాన్ని అభివర్ణిస్తూ గద్దర్‌, గోరటి, సుద్దాల అశోక్‌ తేజ, వందేమాతరం శ్రీనివాస్‌లు ఎన్ని మాటలు రాసినా, ‘‘తాను చెమటలో తడిసి ముద్దవుతూ తన పాటలతో దోపిడి గుండెలకు సెమటలు పట్టిస్తాడు నిసార్‌,’’ అంటూ పులిసాంబశివరావు మాటల్లో నిసార్‌ నిలువెత్తు రూపం నాకెప్పుడు కనబడుతూ ఉంటుంది. వాగ్గేయకారుడిగా నిసార్‌తో నేను కలిసి పంచుకున్న వేదికలకు లెక్కలేదు. నిసార్‌ నాకు మంచి మిత్రుడు.


సంఘర్షణాయుత తెలంగాణ నేల మీద నిసార్‌ కుటుంబం ప్రత్యేకించి ఆయన తండ్రి మహమ్మద్‌ అబ్బాస్‌ చేసిన అస్తిత్వ పోరాటం తండ్రితో పాటు, నిసార్‌ను ఒక కమ్యూనిస్ట్‌గా నిలబెట్టింది. ఎన్నో ఆటుపోట్ల మధ్య సాగిన జీవితమే నిసార్‌కు పాఠమై, పాటయై నిలబెట్టింది. తురుకోల్లంతా రజాకార్లని అనుమానిస్తున్న వేళ ‘తురుకోల్లు లేని ఊరు బరకతుండదని’ నిరూపించే దాకా ఎలా సాగిందో చెబుతూ- ‘వతన్‌’ కథల సంకలనంలో తన ముల్క్‌ (ముల్కీ) సుద్దాల అని, భారతదేశం తన మాతృభూమి అనీ నిసార్‌ రాసిన కథ కండ్లు చెమరింపజేస్తుంది. కాకలుదీరిన కథకుల్లాగా తన మాయిముంత గూర్చి, గ్రామీణ జీవితం గూర్చి అనుభవపూర్వకంగా రాసిన నిసార్‌ ‘ముల్కీ’ కథ మనసులో హత్తుకుంటది.  


తెలుగు నేల ఒక గొప్ప ప్రజా వాగ్గేయకారుడిని ఉద్యమ కారుణ్ణి కోల్పోయింది. కరోనా కాలానికి బలయిన నిసార్‌ జ్ఞాపకాలను నిలుపుకునేట్టు గుండాల తాలుకా కేంద్రానికి ఆయన పేరు పెట్టి ప్రతిష్ఠాత్మకమైన ఒక అవార్డును ప్రజాకళాకారులకు అందించేలా చూడాల్సిన బాధ్యత మన అందరిది. ఆయన ఇద్దరు కొడుకుల్లో ఒకరు జ్వరంతో బాధపడ్తున్నట్లు తెల్సింది. అతనికి, కుటుంబ సభ్యులందరికి సరయిన వైద్య చికిత్స అందించడమేగాకుండా కుటుంబంలో ఒకరికి ఉద్యోగమిచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తన ఆశయం సమతా సమాజ నిర్మాణమే అన్న నిసార్‌ చెరిగిపోని యాదిని గుండెల్లో నిలుపుకుందాం. నిసార్‌కు అరుణారుణ నివాళులర్పిద్దాం.

విమలక్క

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య

Updated Date - 2020-07-09T06:05:56+05:30 IST