సామాజిక దూరం ఏదీ? ఎక్కడ?

ABN , First Publish Date - 2020-03-26T09:20:27+05:30 IST

‘గుంపులుగా జనం తిరగకూడదు. వైరస్‌ కట్టడికి అదే మందు. ఇందుకు సామాజిక దూరం పాటించడం

సామాజిక దూరం ఏదీ? ఎక్కడ?

రైతుబజార్ల నిర్వహణలో లోపాలు

కొనుగోళ్లకు గుంపులుగా ఎగబడుతున్న జనం

సమస్యను పట్టించుకోని వైనం

ప్రయాణ సదుపాయం లేక రైతులు, వినియోగదారులకు ఇక్కట్లు

పారిశుధ్య సమస్యపైనా దృష్టి కరువు


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం): ‘గుంపులుగా జనం తిరగకూడదు. వైరస్‌ కట్టడికి అదే మందు. ఇందుకు సామాజిక దూరం పాటించడం అత్యవసరం’...కేంద్రం నిర్దేశించిన ‘లాక్‌ డౌన్‌’ ప్రధాన ఉద్దేశం ఇది. సామాజిక దూరం అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య కనీసం మీటరు దూరం ఉండాలి. కానీ, నగరంలోని రైతు బజార్ల నిర్వహణ చూస్తే ‘సామాజిక దూరం’ అన్న లక్ష్యమే దూరమైందనిపిస్తుంది. ఓ వైపు జనం ముందస్తు కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. ఉల్లి, టమోటా, చిక్కుళ్లు, పచ్చిమిర్చి, బెండ, దొండ వంటి సరకులు అమ్మే దుకాణాల దగ్గర జనం పదుల సంఖ్యలో ఎగబడుతున్నారు.


రైతుబజార్లలో ఈ సమస్య ఉందని ప్రత్యామ్నాయ బజార్లు ఏర్పాటు చేశారు. కానీ  అక్కడా ఇదే సమస్య. రైతుబజార్లలో పరిస్థితి చూస్తే ‘నగరం అంతా కర్ఫ్యూ విధించి, రైతుబజార్లను గాలికి వదిలేశారు’ అన్న భావన తప్పక కలుగుతుంది. మరోవైపు ప్రయాణ సదుపాయ లేక రైతులతోపాటు వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎటువంటి ముందస్తు చర్యల్లేకుండా దొరికిన మైదానంలో రైతుబజార్‌లు ఏర్పాటు చేయడంతో పారిశుధ్య సమస్య వేధిస్తోంది.  వీటిపై అత్యవసరంగా ఉన్నతాధికారులు చర్చించి, తగిన చర్యలు చేపట్టాలి.


రైతులు ఎలా వస్తారు...సరుకులు ఎలా తెస్తారు

నగరంలో 13 రైతు బజార్లున్నాయి. చుట్టుపక్కల మండలాల నుంచి రైతులు తమ పంటలతో వస్తారు. వీరి కోసం ఆర్టీసీ అధికారులు ఆరు బస్సులు నడిపేవారు. కరోనా కట్టడి చర్యల తర్వాత వాటిని ఆపేశారు. రవాణా సదుపాయం లేక సగం మంది రైతులు బజార్లకు రావడం మానేశారు. నగరానికి సమీపంలో ఉన్న కొందరు మాత్రమే తెల్లవారు జామున ఆటోల్లో సరుకులు వేసుకుని వస్తున్నారు. ఉదయం ఏడు గంటలు దాటితే పోలీసులు వారిని ఆపేస్తున్నారు. దీంతో తిరిగి వెళ్లలేక, బజారుకు రాలేక ఇబ్బంది పడుతున్నారు. పూర్తి స్థాయిలో రైతులు రాక బజార్లలో కూడా అన్ని రకాలు లభించడం లేదు. అన్ని సరుకులు దొరక్క వినియోగదారులు పదేపదే రైతు బజార్లకు వస్తున్నారు.


ఇవీ సమస్యలు

రైతు బజార్లకు వచ్చే రైతులను, సిబ్బందిని కూడా పోలీసులు ఆపేస్తున్నారు. వీరికి ప్రత్యేక పాసులు జారీచేసి అనుమతించాలి.

రైతులకోసం పాత విధానంలో బస్సులనైనా తిప్పాలి. లేదంటే రైతులు ఏర్పాటుచేసుకునే వాహనానికి ప్రత్యేక పాసు ఇచ్చి తిరిగేందుకు అనుమతించాలి. పాసులు దుర్వినియోగం కాకుండా నిఘాపెట్టాలి.

రైతుబజార్లలో రోజుకి కనీసం అర టన్ను చెత్త పోగవుతుంది. దీన్ని ఎత్తి తరలించడం, బజారును శుభ్రం చేయడం, బ్లీచింగ్‌ చల్లేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలి.

రైతు బజార్లకు ఒక్కో ఎస్టేట్‌ అధికారి, అటెండర్‌, వాచ్‌మెన్‌ ఉన్నారు. ఇప్పుడు పెట్టిన అదనపు రైతుబజార్ల పర్యవేక్షణకు అదనపు సిబ్బందిని నియమించాలి.

ప్రత్యామ్నాయ రైతుబజార్లలోను తాగునీరు, మరుగుదొడ్లు సదుపాయం కల్పించాలి. 

చికెన్‌, మటన్‌ దుకాణాలు మూత పడటంతో కూరగాయాలకు గిరాకీ పెరిగింది. అందువల్ల కొత్త రైతులకు తాత్కాలికంగానైనా గుర్తింపు కార్డులిచ్చి సరుకులు అమ్మించాలి.

రైతుబజార్లను ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరిచి ఉంచకుండా నిర్థిష్ట సమయాల్లో నడపాలి.


Updated Date - 2020-03-26T09:20:27+05:30 IST