నాలుగు సార్లు నవరాత్రులు!

ABN , First Publish Date - 2020-10-23T05:30:00+05:30 IST

నవరాత్రులు అనగానే గుర్తుకు వచ్చేవి దేవీ శరన్నవరాత్రులు. అయితే భారతీయ సంస్కృతిలో వివిధ మాసాల్లో నవరాత్రులను జరిపే సంప్రదాయం ఉంది. వాటిని చైత్ర, ఆషాఢ, మాఘ మాసాల్లో నిర్వహిస్తారు...

నాలుగు సార్లు నవరాత్రులు!

నవరాత్రులు అనగానే గుర్తుకు వచ్చేవి దేవీ శరన్నవరాత్రులు. అయితే భారతీయ సంస్కృతిలో వివిధ మాసాల్లో నవరాత్రులను జరిపే సంప్రదాయం ఉంది. వాటిని చైత్ర, ఆషాఢ, మాఘ మాసాల్లో నిర్వహిస్తారు.


చైత్రే శ్వినే తథాషాడే మాఘే కార్యోమహోత్సవః

చతుర్షు నవరాత్రేషు విశేషాత్ఫలదాయకః- అని ‘దేవీ భాగవతం’ చెబుతోంది. గొప్ప ఫలితాలను కోరుకొనే వారు ఈ నాలుగు నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సేవించాలని సూచిస్తోంది. 


వసంత నవరాత్రి: వసంతకాల ప్రారంభమైన చైత్ర మాసంలో మొదటి తొమ్మిది రోజులూ నిర్వహించే నవరాత్రులను ‘వసంత నవరాత్రులు’ అంటారు. దేవీ పూజలను ఈ రోజుల్లో విశేషంగా చేస్తారు. అలాగే పాడ్యమి నుంచి నవమి వరకూ శ్రీరామ నవరాత్రులను జరిపి, తొమ్మిదో రోజైన శ్రీరామ నవమి నాడు సీతారామ కల్యాణం నిర్వహిస్తారు. 


ఆషాఢ నవరాత్రి: ఆషాఢ మాస శుక్ల పక్షంలోని తొలి తొమ్మిది రోజులూ అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. వీటిని ‘శాకంబరీ నవరాత్రులు’గా, ‘గుప్త నవరాత్రులు’గా వ్యవహరిస్తారు.


శరన్నవరాత్రులు: శరద్రుతువులో ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి తొమ్మిది రోజులను ‘శరన్నవరాత్రులు’, ‘దేవీ నవరాత్రులు’గా పాటిస్తారు. అమ్మవారిని వివిధ సంప్రదాయాల ప్రకారం తొమ్మిది రూపాల్లో పూజిస్తారు. పదో రోజైన విజయదశమిని చెడుపై మంచి గెలిచిన పర్వదినంగా నిర్వహిస్తారు.


మాఘ నవరాత్రులు: మాఘ మాసంలో పాడ్యమి నుంచి నవమి వరకూ... తొమ్మిది రోజులు ఆదిపరాశక్తిని ఆరాధిస్తారు. మహా విష్ణువుకూ, సూర్యుడికీ ప్రీతికరమైన మాఘ మాసంలోని ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించడం అత్యంత ఫలదాయకమని పెద్దలు చెబుతారు. 

- పుష్య నవరాత్రుల ప్రస్తావన ‘దేవీ భాగవతం’లో లేదు. అయితే కొన్ని ప్రాంతాల్లో పుష్య పాడ్యమి నుంచి నవమి వరకూ దేవీ ఆరాధన చేసే సంప్రదాయం ఉంది.

Updated Date - 2020-10-23T05:30:00+05:30 IST