మెగా సంస్కరన్!

ABN , First Publish Date - 2020-05-17T07:18:33+05:30 IST

రూ.20 లక్షల కోట్ల మెగా ప్యాకేజీలో భాగంగా నాలుగో విడత ఉద్దీపన చర్యలను ప్రకటించింది ప్రభుత్వం. ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేందుకు ఈసారి సంస్కరణలపై

మెగా సంస్కరన్!

రక్షణ రంగంలో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కు ఊతం.. 

ఎఫ్‌డీఐ పరిమితి 49 శాతం నుంచి 74 శాతానికి పెంపు

త్వరలో కొన్ని ఆయుధాల దిగుమతిపై నిషేధం..

ఇకపై దేశీయంగా కొనుగోలు 

ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ కార్పొరేటీకరణ..

తర్వాత దశలో స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ 

బొగ్గు రంగంలో ఇక కమర్షియల్‌ మైనింగ్‌

ఆదాయ పంపిణీ పద్ధతిన గనుల కేటాయింపు 

బొగ్గు ఉత్పత్తిలో ప్రభుత్వ గుత్తాధిపత్యానికి చెల్లు 

పీపీపీ పద్ధతిలో ఖనిజాల అన్వేషణ, మైనింగ్‌, ఉత్పత్తి

మరో 6 ఎయిర్‌పోర్టుల ప్రైవేటీకరణ 

ఎయిర్‌ స్పేస్‌పై ఆంక్షల సడలింపులు 

సామాజిక మౌలిక వసతుల ప్రాజెక్టుల వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ పెంపు 

మెడికల్‌ ఐసోటోపుల ఉత్పత్తి కోసం పీపీపీ పద్ధతిలో  రీసెర్చ్‌ రియాక్టర్‌ 


రూ.20 లక్షల కోట్ల మెగా ప్యాకేజీలో భాగంగా నాలుగో విడత ఉద్దీపన చర్యలను ప్రకటించింది ప్రభుత్వం. ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల కల్పనకు ఊతమిచ్చేందుకు ఈసారి సంస్కరణలపై ప్రధానంగా దృష్టిపెట్టింది. బొగ్గు, ఖనిజాలు, రక్షణ, విమానం, అంతరిక్షం, విద్యుత్‌ సరఫరా, అణు శక్తి రంగాలకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం పలు కీలక ప్రకటనలు చేశారు. ఆ వివరాలు.. 


సోషల్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు 

సామాజిక మౌలిక సదుపాయాల (సోషల్‌ ఇన్‌ఫ్రా) ప్రాజెక్టుల అభివృద్ధికి వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ (వీజీఎఫ్‌) పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి సీతారామన్‌ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల లోటు భర్తీ కోసం రూ.8,100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆమె తెలిపారు. దాంతో ప్రభుత్వం భరించనున్న వీజీఎఫ్‌ పరిమితి ప్రాజెక్టు వ్యయంలో 20 శాతం నుంచి 30 శాతానికి పెరగనుంది. ఇతర రంగాల్లో మాత్రం వీజీఎఫ్‌ పరిమితి 20 శాతంగానే కొనసాగనుంది. 


ఖనిజాల తవ్వకం

ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిన ఖనిజాల మైనింగ్‌ జరపనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సంయుక్తంగా ఖనిజాల అన్వేషణ- మైనింగ్‌- ఉత్పత్తి చేపట్టనుంది. ఇందుకోసం 500 క్షేత్రాలను వేలం వేయనుంది. అల్యూమినియం ఉత్పత్తి రంగంలో పోటీతత్వాన్ని పెంచేందుకు బాక్సైట్‌, బొగ్గు గనులను సంయుక్తంగా వేలం వేయనున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, క్యాప్టివ్‌, నాన్‌-క్యాప్టివ్‌ మైనింగ్‌ల మధ్య భేధాన్ని కూడా తొలగించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. తద్వారా మైనింగ్‌ లీజుల బదిలీకి, నిరుపయోగంగా ఉన్న అదనపు ఖనిజ నిల్వల విక్రయానికి వెసులుబాటు లభించనుంది. 


గగనతలం 

ఎయిర్‌ స్పేస్‌ (గగనతలం) వినియోగంపై ఆంక్షలను సడలిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. తద్వారా పౌర విమానయాన రంగానికి ఏటా రూ.1,000 కోట్ల మేర ప్రయోజనం సమకూరనుందని ప్రభుత్వం అంటోంది. భారత గగనతలం లో ప్రస్తుతం 60 శాతమే ఉచితంగా అందుబాటులో ఉంది. మరింత గగనతలాన్ని ఉచితంగా అందుబాటులోకి తేవడం ద్వారా విమాన ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఎయిర్‌లైన్స్‌కు ఇంధన వ్యయ భారం కూడా తగ్గనుంది.     


విమానాశ్రయాలు 

మరో ఆరు విమానాశ్రయాలను ప్రైవేటీకరించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిన ఈ ఎయిర్‌పోర్టుల అభివృద్ధికి త్వరలోనే బిడ్లను ఆహ్వానించనున్నట్లు సీతారామన్‌ తెలిపారు. ఈ రంగానికి సంబంధించి మరిన్ని నిర్ణయాలు.. 

  1. 12 ఎయిర్‌పోర్టుల్లో అదనంగా రూ. 13,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ప్రైవేట్‌ భాగస్వామ్య సంస్థలు
  2. గత ఏడాది బిడ్డింగ్‌ నిర్వహించిన 6 విమానాశ్రయాల్లో మూడింటిని ఇప్పటికే కేటాయించడం జరిగింది. ఈ ఆరు ఎయిర్‌పోర్టుల వార్షికాదాయం దాదాపు రూ.1,000 కోట్లు కాగా, లాభం రూ.540 కోట్లు. పైగా ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ)కు డౌన్‌ పేమెంట్‌ కింద రూ. 2,300 కోట్లు సమకూరనున్నాయి
  3. త్వరలో బిడ్డింగ్‌ నిర్వహించనున్న విమానాశ్రయాల జాబితాలో అమృత్‌సర్‌, వరణాసి, భువనేశ్వర్‌, ఇండోర్‌, రాయ్‌పూర్‌, తిరుచ్చి ఉన్నాయి
  4. గత ఏడాదిలో ప్రభుత్వం లక్‌నవూ, అహ్మదాబాద్‌, జైపూ ర్‌, మంగళూరు, తిరువనంతపురం, గువాహటి విమానా శ్రయాలను ప్రైవేటీకరించింది. 

ఎంఆర్‌ఓ

భారత్‌ను విమానాల మెయింటెనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్‌ (ఎంఆర్‌ఓ) సేవల హబ్‌గా మార్చేందుకు త్వరలోనే చర్యలు చేపట్టనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. కేవలం పౌర విమానాలకే కాకుండా రక్షణ రంగ ఎయిర్‌క్రా్‌ఫ్టల ఎంఆర్‌ఓ సర్వీసులకూ భారత్‌ను వేదిక చేస్తామన్నారు. తద్వారా ఎయిర్‌లైన్స్‌కు ఎంఆర్‌ఓ సేవల భారం తగ్గుతుందని, సంస్థలు ఆ ప్రయోజనాన్ని  ప్రయాణీకులకు అందించగలిగితే విమాన టికెట్‌ చార్జీలు తగ్గుతాయన్నారు. ఎంఆర్‌ఓ ఇండస్ట్రీకి ఇప్పటికే పన్నులను తగ్గించింది ప్రభుత్వం. దేశంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ కాంపొనెంట్‌ రిపేర్స్‌, ఎయిర్‌ఫ్రేమ్‌ మెయింటెనెన్స్‌ సేవల విభాగం వచ్చే మూడేళ్లలో రూ.2,000 కోట్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా. ప్రస్తుతం రూ.800 కోట్ల స్థాయిలో ఉంది. 


అణు శక్తి

మెడికల్‌ ఐసోటోపుల తయారీ కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిన రీసెర్చ్‌ రియాక్టర్‌ ఏర్పాటు చేయనున్నారు. తద్వారా అందుబాటులోకి వచ్చే ఐసోటోపులతో కేన్స ర్‌ తదితర వ్యాధుల చికిత్స మరింత చౌకగా మారే అవకాశం ఉంటుంది. 

  1. అణు శక్తి రంగంలోకి స్టార్ట్‌పలకు ప్రవేశం. ఈ రంగంలో స్టార్ట్‌పల అనుసంధానం. పరిశోధన కేంద్రాలు, టెక్నాలజీ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మధ్య సమన్వ యం కోసం టెక్నాలజీ డెవల్‌పమెంట్‌ కమ్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్ల ఏర్పాటు. 
  2. కిరణీకరణ సాంకేతికత (ఇర్రేడియేషన్‌ టెక్నాలజీ) ద్వారా ఆహార నిల్వ చేసే వసతులు పీపీపీ పద్ధతిన ఏర్పాటు. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు దోహదపడటంతోపాటు రైతులకు సాయపడటమే ఈ నిర్ణయం ప్రధానోద్దేశం. 

బొగ్గు

బొగ్గు ఉత్పత్తి రంగంలో ప్రభుత్వ రంగ సంస్థల గుత్తాధిపత్యానికి తెరదించేందుకు ప్రభుత్వం భారీగా సంస్కరణలు చేపట్టింది. ఆదాయం పంపిణీ పద్ధతిన బొగ్గు కమర్షియల్‌ మైనింగ్‌కు అనుమతించింది. ఇప్పటివరకు వాణిజ్య అవసరాల కోసం కేటాయించే బొగ్గు గనుల విషయంలో గుత్తేదారు నుంచి కేంద్రం టన్నుకు ఇంతని రుసుము వసూలు చేసేది. 

  1. రెవెన్యూ షేరింగ్‌ పద్ధతిన బొగ్గు మైనింగ్‌ కోసం త్వరలో దాదాపు 50 గనుల వేలం 
  2. బొగ్గు ఉత్పత్తిలో స్వావలంబన కోసం ఈ రంగంలో సంస్కరణలు 
  3. వెలికితీసిన బొగ్గు తరలింపు కోసం మౌలిక వసతుల నిర్మాణానికి రూ.50,000 కోట్ల పెట్టుబడులు 
  4. కోల్‌ బెడ్‌ మీథేన్‌ (సీబీఎం) ఉత్పత్తికి ప్రోత్సా హం. కోల్‌ ఇండియా గనుల నుంచి సీబీఎం వెలికితీత కోసం హక్కుల వేలం
  5. రెవెన్యూ షేరింగ్‌లో రిబేటు ఇవ్వడం ద్వారా బొగ్గు బాష్పీభవనం, ద్రవీకరణకు ప్రోత్సాహం

డిఫెన్స్‌ 

రక్షణ రంగ ఉత్పత్తుల్లో ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిఫెన్స్‌ మాన్యుఫాక్చరింగ్‌లో నేరుగా అనుమతించే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎ్‌ఫడీఐ) పరిమితిని 49 శాతం నుంచి 74 శాతానికి పెంచింది. అంతేకాదు, కొన్ని ఆయుధాలు, ప్లాట్‌ఫామ్‌ల దిగుమతిపై నిషేధం విధించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. దిగుమతులను నిషేధించిన ఆయుధాలను దేశీయంగానే కొనుగోలు చేయనున్నట్లు ఆమె చెప్పారు. మరిన్ని ముఖ్యాంశాలు.. 


  1. విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న కొన్ని రక్షణ రంగ విడిభాగాలను ఇకపై దేశీయంగానే తయారు. దేశీయంగా సేకరణకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయింపులు. తద్వారా తగ్గనున్న రక్షణ రంగ దిగుమతుల భారం. 
  2. మెరుగైన నిర్వహణ కోసం ఆర్డ్‌నెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డులకు కార్పొరేట్‌ హంగులు. తర్వాత స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌. కార్పొరేటీకరణ మాత్రమే.. ప్రైవేటీకరణ కాదని స్పష్టీకరణ. 
  3. నిర్దేశిత కాలానుగుణంగా రక్షణ ఉత్పత్తుల సేకరణ, వేగవంత నిర్ణయాల కోసం కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌కు మద్దతుగా ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ యూనిట్ల (పీఎంయూ) ఏర్పాటు. 

నాలుగో విడత ఆర్థిక ఉద్దీపన చర్యలు దేశంలో పలు వ్యాపార అవకాశాలను సృష్టించడంతో పాటు ఆర్థిక పురోగతికి దోహదపడనున్నాయి. 


ప్రధాని నరేంద్ర మోదీ 


తాజా సంస్కరణలు దేశీయంగా ఉత్పత్తికి ఊతమివ్వడంతోపాటు రక్షణ, విమానయానం, అణు శక్తి వంటి రంగాల్లో ఆధునిక సాంకేతిక వినియోగాన్ని ప్రోత్సహించనుంది. 

అనురాగ్‌ ఠాకూర్‌, 

ఆర్థిక శాఖ సహాయ మంత్రి 


గగనతలాన్ని సమర్థవంతంగా వినియోగించుకోగలగడం ద్వారా విమాన ప్రయాణ సమయం, ఇంధన వ్యయం ఆదా కావడంతో పాటు ఎయిర్‌ టికెట్‌ చార్జీలూ తగ్గుతాయి.                   

 అర్వింద్‌ సింగ్‌, 

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ 


ప్రభుత్వ సంస్కరణలు రక్షణ రంగంలో ఉత్పత్తిని పెంచడంతోపాటు దేశ స్వావలంబన, మేక్‌ ఇన్‌ ఇండియాకు దోహదపడనున్నాయి. 

రాజీవ్‌ కుమార్‌,

నీతి ఆయోగ్‌  వైస్‌ చైర్మన్‌

Updated Date - 2020-05-17T07:18:33+05:30 IST