ఎందుకీ ఎత్తిపోతల!?

ABN , First Publish Date - 2021-05-06T09:06:00+05:30 IST

సీమాంధ్రుల జల జీవ నాడిలా భావించిన పోలవరం భవిష్యత్తు అయోమయంలో పడిందని రాష్ట్ర సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్‌ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు

ఎందుకీ ఎత్తిపోతల!?

పోలవరం దుస్థితికి ఇదే నిదర్శనం

నిధులు ఇవ్వకుండా కేంద్ర సర్కార్‌...

అక్కర్లేని ఎత్తిపోతలతో రాష్ట్ర ప్రభుత్వం...

పోలవరం భవిష్యత్‌ అయోమయం

రాష్ట్ర సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక ధ్వజం


అమరావతి, మే 5 (ఆంధ్రజ్యోతి): సీమాంధ్రుల జల జీవ నాడిలా భావించిన పోలవరం భవిష్యత్తు అయోమయంలో పడిందని రాష్ట్ర సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక కన్వీనర్‌ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలుపకుండా మోదీ ప్రభుత్వం మోకాలడ్డితే.. డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని ఎత్తిపోసే పథకానికి ముఖ్యమంత్రి జగన్‌ సర్కారు ప్రభుత్వం తెరలేపిందని ఆగ్రహించారు. డెడ్‌స్టోరేజీ నుంచి గోదావరి జలాల ఎత్తిపోతకు సిద్ధమై.. ఈ ప్రాజెక్టు దుస్థితి ఏమిటో సీఎం చెప్పకనే చెప్పారని బుధవారం ఓ ప్రకటనలో వ్యాఖ్యానించారు. గోదావరి ఎత్తిపోతలకు రూ.912 కోట్లతో జల వనరుల శాఖ పాలనామోదం ఇస్తే.. కేబినెట్‌ ఆమోదించడం ప్రజాస్వామ్య విధానమేనా అని ప్రశ్నించారు. ‘పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్‌ చేస్తుంటే.. మధ్యలో ఈ ఎత్తిపోతల ఎందుకు తెరపైకి వచ్చింది? కేంద్రం నుంచి పోలవరం డీపీఆర్‌-2కు ఆమోదం పొందే శక్తి జగన్‌కు లేదా? పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలశక్తి శాఖ పరిధిలోని  సాంకేతిక సలహా కమిటీ  ఆమోదించిన రూ.55,548.87 కోట్ల అంచనాకు కేంద్ర ఆర్థిక శాఖ మోకాలడ్డింది. ఈ నిధులు రాబట్టుకునేందుకు కేంద్రంతో పోరాడాల్సిన జగన్‌.. ఎత్తిపోతలకు ఎందుకు వెళ్తున్నారు? ప్రజాధనం వృథా చేయడానికి ఎందుకు పూనుకున్నారు’ అని జగన్‌ను నిలదీశారు. పోలవరం పూర్తిచేసి మొత్తం 322 టీఎంసీలు వినియోగించుకుని.. 7.20 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టును కల్పించవచ్చని.. 540 గ్రామాలకు తాగునీరు అందించవచ్చని, విశాఖ పారిశ్రామిక, మంచినీటి అవసరాలకు ఎడమ కాలువ ద్వారా 80 టీఎంసీలను వినియోగించే వీలుందని తెలిపారు. ఇదంతా వదిలేసి .. డెడ్‌స్టోరేజీ నుంచి ఎత్తిపోతలకు సిద్ధం కావడం చూస్తుంటే పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు అగమ్యగోచరంలో పడిపోయిందన్న ఆందోళన కలుగుతోందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

Updated Date - 2021-05-06T09:06:00+05:30 IST