Abn logo
Sep 23 2021 @ 01:37AM

యువత చేతుల్లోనే దేశ భవిత

శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ సభలో మాట్లాడుతున్న సీపీఐ జాతీయ కార్యదర్శి బినయ్‌ విశ్వం

 ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

 సీపీఐ జాతీయ కార్యదర్శి బినయ్‌ విశ్వం

కొత్తపట్నంలో ఘనంగా ప్రారంభమైన శిక్షణ తరగతులు

కొత్తపట్నం (ఒంగోలు నగరం)సెప్టెంబరు 22 : ‘దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు దాటినా ఇంకా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు కార్పొరేట్‌ శక్తులకు ఊడిగం చేస్తూ సంపదను వారికి కట్టబెడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యువత చైతన్యవంతమైన దేశాన్ని కాపాడుకునేందుకు ముందుకు రావాలి. దేశ భవిష్యత్‌ యువతపైనే ఆధారపడి ఉంది’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు బినయ్‌ విశ్వం అన్నారు. స్థానిక నల్లూరి గార్డెన్స్‌లో ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ ఆధ్వర్యంలో ఆరురోజులపాటు జరిగే విద్య, వైజ్ఞానికి శిక్షణ తరగతుల ప్రారంభోత్సవ సభలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. యువకులు దేశంలోని రుగ్మతలను రూపుమాపేందుకు కృషిచేయాలన్నారు. విద్యార్థులకు రాజకీయాలు ఎందుకు అనే భావన తప్పని, తాను ఏఐఎస్‌ఎఫ్‌లో పనిచేసినందునే ఈనాడు ఈస్థాయిలో ఉన్నానన్నారు. మోదీ పాలనలో ధరలు ఆకాన్నంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలు, ప్రభుత్వరంగ సంస్థలు, జాతిసంపద అంతా కార్పొరేట్‌ శక్తుల పరం చేయబోతున్నారని విమర్శించారు. ఏటా కోట్లాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మోదీ ఉన్న ఉద్యోగాలను కూడా ఊడబెరికే విధానాలను అవలంబిస్తున్నారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ట మాట్లాడుతూ  విదేశాల్లో ఉన్న నల్లడబ్బును వెనక్కి తెస్తానంటూ గొప్పలు చెప్పుకొచ్చిన మోదీ దేశంలో బ్యాంకుల సొమ్మును కొల్లగొట్టిన వారు విదేశాలకు పారిపోయేందుకు సహకరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర అధ్యక్షతన జరిగిన సభలో మాజీ ఎమ్మెల్సీ పిజె.చంద్రశేఖరరావు, సీపీఐ రాష్ట్ర నాయకుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, ఏపీయూడబ్ల్ల్యూజె రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, సినీనటుడు మాదాల రవి, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌నారాయణ, ఆర్‌.వెంకటరావు పాల్గొన్నారు. 


ఘనంగా ప్రారంభమైన తరగతులు

కొత్తపట్నంలో ఆరు రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమాలు బుధవారం స్థానిక నల్లూరి గార్డెన్స్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏఐఎస్‌ఎఫ్‌ జెండాను మాజీ జాతీయ కార్యదర్శి జి.ఈశ్వరయ్య, ఏఐవైఎఫ్‌ జెండాను సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు చంద్రనాయక్‌, రామకృష్ట, గని తదితరులు విప్లవ గేయాలు ఆలపించారు.