Advertisement
Advertisement
Abn logo
Advertisement

మీ అక్కను కిడ్నాప్ చేశామంటూ వాట్సప్‌లో ఫొటోతోపాటు వాయిస్ మెసేజ్.. పోలీసులు సీసీ కెమెరాలను చెక్ చేస్తే..

ఇంటర్నెట్ డెస్క్: ఆ రోజు ఎప్పటిలాగే తన పనిలో నిమగ్నమై ఉన్న ఆకాశ్‌కు వాట్సాప్‌లో ఓ మెసేజ్ వచ్చింది. ‘‘మీ అక్కను కిడ్నాప్ చేశాం. ఆమె బతికుండాలని కోరుకుంటే వెంటనే మేం చెప్పిన చోటుకి రూ. 20 లక్షలు పంపించు.. పోలీసులకు చెప్పావో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది..’’ అంటూ కిడ్నాపర్లు  సీని ఫక్కీలో ఓ వాయిస్ మెసేజ్ పంపించారు. దీన్ని చదివిన యువకుడి కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్టు అనిపించింది. కిడ్నాపైన యువతి‌ ఆకాశ్‌కు వరుసకు అక్క అవుతుంది. ఆమె కుటుంబానిది సాధారణ నేపథ్యమే. కిడ్నాప్‌ దాకా వెళ్లేంత వివాదాలు లేదా ఆస్తిపాస్తులు వారికి లేవు. కానీ..ఫోన్‌లోని ఫొటో మాత్రం అతడి అక్కదే! దీంతో ఆకాశ్ వెంటనే పోలీసులను సంప్రదించాడు.

విషయం పోలీసులకు తెలిసిన కొద్ది సేపటికే మరో మెసేజ్ అతడికి వచ్చింది. ‘‘నువ్వు పోలీసులకు ఈ విషయం చెప్పినట్టు మాకు తెలిసిపోయింది.. ఇక రాబోయే పరిణామాలను నువ్వు అనుభివించకతప్పదు..’’ అంటూ కిడ్నాపర్లు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో..పెను ప్రమాదం జరిగిపోతోందని అతడు కంగారు పడిపోయాడు. సీన్ కట్ చేస్తే.. కిడ్నాపైన యువతినే పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. బీహార్ రాష్ట్రం ఝాన్సీ నగరంలోని నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది. 

కిడ్నాప్ ఉదంతంలో అసలు ట్విస్ట్ ఇదే..

అకాశ్ నుంచి ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. యువతి చివరిసారిగా కనిపించిన ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను తెప్పించి క్షుణ్ణంగా పరిశీలించారు. ఆమె ప్రయాణించిన ఆటోల వివరాల ఆధారంగా పలువురు ఆటో డ్రైవర్లను విచారించగా.. యువతి ఆచూకీకి సంబంధించి పలు కీలక వివరాలు లభించాయి. స్థానికంగా ఉన్న ఎలీట్ క్రాస్ రోడ్స్‌లో ఉన్న ఓ హోటల్‌ సమీపంలో ఆమె పలు మార్లు కనిపించినట్టు నిర్ధారించుకున్న పోలీసుల ఆ హోటల్‌లో తనిఖీలు చేపట్టగా ఆమె అక్కడే ఓ గదిలో ఉన్నట్టు వెలుగులోకి వచ్చింది. 

పోలీసులకు విషయం తెలిసిపోవడంతో కంగారు పడిపోయిన యువతి తన ప్రియుడితో కలిసి కిటికీలోంచి కిందకు దూకేసింది. పోలీసులు వారిని వెంబడించారు. వారి నుంచి ప్రియుడు తప్పించుకోగలిగినప్పటికీ... యువతి మాత్రం దొరికిపోయింది. చివరికి చేసిన నేరాన్ని అంగీకరించింది.  ప్రియుడుతో పెళ్లి చేసుకోవాలనుకున్న తాను అతడితో కలిసి ఈ కిడ్నాప్ డ్రామాకు తెరతీశానని,  కుటుంబసభ్యుల నుంచి రూ. 20 లక్షలు డిమాండ్ చేశానని చెప్పింది. దీంతో..పోలీసులు ఆమెను జైలుకు తరలించారు. స్థానికంగా కలకలం రేపిన ఈ కేసును పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించారు. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement