పూర్వ వైభవమప్పా!

ABN , First Publish Date - 2021-07-29T09:25:07+05:30 IST

రామప్ప ఆలయ అభివృద్ధి పనుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2019లో రూ.10 కోట్లు మంజూరు చేశాయి. యునెస్కో గుర్తింపుతో ఆ పనులన్నీ పరుగులు పెట్టనున్నాయి. రామప్ప ఆలయంచుట్టూ గోడలపై ఉన్న నాట్యకారిణులు, ఏనుగులు, మదనికల విగ్రహాలు

పూర్వ వైభవమప్పా!

రామప్పకు ఇక కాకతీయ కాలంనాటి వైభవం..

శిథిల గోపురం, శిల్పాలు, ఒరిగిన స్తంభాలకు మరమ్మతులు

రామప్ప చెరువు కట్టపై కాకతీయుల శిల్పాలు

శిల్పారామం పనుల్లో వేగం

మరిన్ని కాటేజీలు.. జెట్టి బోటింగ్‌కు ఏర్పాట్లు

పాలంపేట నుంచి రామప్పకు, ఆలయం నుంచి చెరువుదాకా డబుల్‌ రోడ్డు

కామేశ్వరాలయ పనులకూ మోక్షం?  


భూపాలపల్లి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రామప్ప ఆలయ అభివృద్ధి పనుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2019లో రూ.10 కోట్లు మంజూరు చేశాయి. యునెస్కో గుర్తింపుతో ఆ పనులన్నీ పరుగులు పెట్టనున్నాయి. రామప్ప ఆలయంచుట్టూ గోడలపై ఉన్న నాట్యకారిణులు, ఏనుగులు, మదనికల విగ్రహాలు పలు చోట్ల దెబ్బతిన్నాయి. వినాయక విగ్రహానికి తొండం, తలపై భాగం విరిగిపోయింది. ఆలయం ముందున్న ఏనుగు శిల్పాల తలలు ధ్వంసమయ్యాయి. వరుసగా రెండుమూడు రోజుల పాటు వర్షం పడితే  ఆలయ గోపురం పైభాగం నుంచి గర్భగుడిలోకి నీరు కురుస్తుంది. ఆలయ ప్రధాన ప్రాంగణంలో కొన్ని స్తంభాలు ఒరిగి ఉన్నాయి. వీటన్నింటికీ మరమ్మతులు చేసే అవకాశం ఉందని సీనియర్‌ ఆర్కియాలజిస్ట్‌ ఒకరు తెలిపారు. పర్యాటకుల తాకిడి పెరగనున్న దృష్ట్యా సంబంధిత శాఖ ప్రత్యేక చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రామప్ప చెరువు గట్టుపైన పలు పాత కాటేజీలతో పాటు కొత్తగా నిర్మించిన ఆరు కాటేజీలున్నాయి.


ఇదే ప్రాంతంలో మరో 20 కాటేజీలు నిర్మించాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారు. చెరువు గట్టుపైనే ఓ హోటల్‌ కూడా నిర్మించాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే ఓ జెట్టి బోట్‌ను రామప్ప చెరువు వద్ద నిలిపారు. శిక్షణ పొందిన పైలట్‌ లేకపోవడంతో జెట్టి బోటులో ప్రయాణం సాగటం లేదు. జెట్టి బోటులో 150 మంది వరకు ప్రయాణించే ఇలాంటివి మరో ఐదారు బోట్లను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో పర్యాటక శాఖ అధికారులు ఉన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు వస్తుందని అంచనా వేసి 2019లో శిల్పారామం నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రామప్ప చెరువు కట్టపైన కాకతీయు చక్రవర్తులు, రాజుల విగ్రహాలు ప్రతిష్టించాలని నిర్ణయించారు. కాకతీయుల చరిత్ర, పోరాటాలు తదితర అంశాలను తెలియజేసేలా చెరువు గట్టుపైన ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేయాల్సి ఉంది. రామప్ప చెరువులో ఉన్న ఐలాండ్‌లో ధ్యాన మందిరం, కోటి లింగాలను నిర్మించనున్నారు. చెరువు గట్టు నుంచి ఐలాండ్‌ వరకు రూఫ్‌వే నిర్మించనున్నారు. వీటితో పాటు ఆలయం సమీపంలో భారీ సమావేశ మందిర నిర్మాణం చేపట్టారు.


ఇప్పటికే శిల్పారామం పనులు జరుగుతుండగా కొన్ని విగ్రహాల తయారీ పూర్తి అయినట్లు సమాచారం. యునెస్కో గుర్తింపు రావటంతో శిల్పారామం పనుల్లో వేగం పెంచుతున్నారు. పాలంపేట నుంచి రామప్ప ఆలయం వరకు, అలాగే ఆలయం నుంచి చెరువు గట్టు వరకు డబుల్‌ రోడ్డు, సెంట్రల్‌ లైటింగ్‌ సిస్టం కోసం రూ.40లక్షలు అప్పటి ఎంపీ సీతారాంనాయక్‌ కేటాయించారు. ఈ పనులు కొద్ది వరకు జరిగి బ్రేక్‌ పడ్డాయి. ప్రస్తుతం యునెస్కో గుర్తింపు రావటంతో ఈ పనులు మొదలయ్యే అవకాశం ఉంది.  


రామప్పకు వెళితే ఆలయ శిల్ప సంపద మదిని పులకరింపజేస్తుంది. అదే మనసు.. 

శిథిలమైన కొన్ని శిల్పాలను చూసి గాయపడుతుంది. గర్భాలయంలోకి ప్రవేశిస్తే శివలింగం వద్ద చేతులు ముకుళితమవుతాయి. తోయమాలికలతో లింగాన్ని అభిషేకించాలని మనసు ఉప్పొంగుతుంది. ఆ అవకాశం ఆలయ పూజారులకే తప్ప సాధారణ భక్తులకు ఉండదని తెలిసి భృకుటి ముడిపడుతుంది. ఆ సమయంలో వర్షం పడితే గనక శిథిలమైన గోపురం నుంచి నీళ్లు తలపై పడతాయి. ఆలయం నుంచి బయటొచ్చి చూస్తే ఎదురుగా ఏవేవో శిలలు, స్తంభాలు కనిపిస్తాయి. రామప్పకు దీటుగా అక్కడ మరో ఆలయం ఉండేదా అన్న అనుమానం కలుగుతుంది. సమీపంలోని రామప్ప చెరువును చూసేందుకని వేగంగా పడుతున్న అడుగులకు మోకాలొడ్డినట్లుగా కంకర తేలిన రోడ్డు, గుంతలు ఉంటాయి! అయితే ఇవన్నీ ఇక గతం అని, యునెస్కో గుర్తింపుతో రామప్ప ఆలయ రూపురేఖలే మారిపోతాయని, అచ్చంగా కాకతీయుల నాటి తరహాలో పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందన్న ఆశలు భక్తులు, పర్యాటకుల్లో చిగురిస్తున్నాయి! 


సోమసూత్రం తెరుచుకునేనా! 

రామప్ప ఆలయంలో అభిషేక ప్రియుడైన శివుడికి నిండా అభిషేకాలు ఉండవు అంటే నమ్మకతప్పదు! శివ లింగంపై నీటి చిలకరింపే అక్కడ అభిషేకం! అదీ పూజారులే చేస్తారు.  ఇది సంప్రదాయం కాదు.. అభిషేక జలం ఆలయం బయటకు వెళ్లే మార్గమైన సోమసూత్రం మూసుకుపోవడంతో ఏర్పడిన పరిస్థితి! గర్భాలయంలోని శివలింగం ఓవైపు ఒరిగిపోతే 2000లో మరమ్మతులు చేశారు. ఆ క్రమంలో సోమసూత్రం మూసుకుపోయింది. కొన్నేళ్లుగా శివరాత్రి రోజున మినహాయిస్తే అభిషేకాలు నిలిచిపోయాయి.   భక్తులకు అభిషేకం చేసే అవకాశం ఉండటం లేదు. అయితే, ఇప్పుడు భక్తుల తాకిడి పెరగనుండటంతో త్వరలోనే సోమసూత్రం తెరుచుకుంటుందని అంటున్నారు.  


కామేశ్వరాలయాన్ని పునర్నిర్మిస్తారా? 

రామప్పకు వెళితే ఆలయానికి ఎదురుగా పదుల సంఖ్యల్లో స్తంభాలు, రాళ్లు, ఓ భారీ పునాది కనిపిస్తుంది. వాస్తవానికి అది కూడా ఒకప్పుడు రామప్ప స్థాయి ఆలయమే! కామేశ్వరాలయం అని దాని పేరు. రామప్ప నిర్మాణంలో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞాన్నే కామేశ్వరాలయానికి ఉపయోగించారు! రామప్ప నిర్మాణానికి ముందు ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని కామేశ్వరాలయ నిర్మాణంపై ప్రయోగించినట్లు చరిత్రకారులు చెబుతారు. ఈ ఆలయ పునాదులను శాండ్‌బాక్స్‌ టెక్నాలజీతో నిర్మించారు. గోపురంపై నీళ్లలో తేలియాడే ఇటుకలను వాడారు. ముస్లిం రాజుల దాడులు, భూకంపాలతో కామరేశ్వరాలయం కొంత వరకు దెబ్బతింది. మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది. 2012లో ఈ ఆలయాన్ని తొలగించారు. 42 స్తంభాలను, శిలలను రామప్ప ప్రాంగణంలో ఓ మూలన పడేశారు.


పునాదులు అలాగే ఉన్నాయి. ఆలయ పునర్నిర్మాణానికి 2017లో ప్రభుత్వ అనుమతులు లభించాయి. కానీ, అధికారుల నిర్లక్ష్యంతో డీపీఆర్‌ తయారు చేయలేదు. రామప్పకు  గుర్తింపు రావటంతో కామేశ్వరాలయ పునర్నిర్మాణంపై ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రిగా ఉండటంతో ఆ శాఖ నుంచి కామేశ్వరాలయంలో పాటు 12 ఉప ఆలయాల పునర్నిర్మాణానికి నిధులు మంజూరవుతాయని ఆశిస్తున్నారు. 

Updated Date - 2021-07-29T09:25:07+05:30 IST