నత్తనడక

ABN , First Publish Date - 2021-04-17T06:08:55+05:30 IST

వైఎస్సార్‌ జలకళ పథకం నత్తనడకన సాగుతోంది. జిల్లాలో చిన్న, సన్నకారు రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వైఎస్సార్‌ జలకళ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కో బోరు యూనిట్‌కు ప్రభుత్వం రూ.3లక్షల వరకు వెచ్చిస్తోంది. ఓ రైతు కానీ, రైతులు బృందాలుగా ఏర్పడి కానీ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించింది. జిల్లాలో మార్చి నాటికి వెయ్యి బోర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యం విధించింది. ఈ మేరకు 5,777 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఇప్పటివరకు అధికారులు 173 బోర్లు మాత్రమే వేశారు.

నత్తనడక
ఇచ్ఛాపురం మండలంలో పరిశీలన చేస్తున్న జియాలజిస్టులు

- నీరుగారుతున్న ‘వైఎస్సార్‌ జలకళ’ లక్ష్యం

- జిల్లాలో కేవలం 173 బోర్లు ఏర్పాటు

(ఇచ్ఛాపురం రూరల్‌)

వైఎస్సార్‌ జలకళ పథకం నత్తనడకన సాగుతోంది. జిల్లాలో చిన్న, సన్నకారు రైతులు సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వైఎస్సార్‌ జలకళ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కో బోరు యూనిట్‌కు ప్రభుత్వం రూ.3లక్షల వరకు వెచ్చిస్తోంది.  ఓ రైతు కానీ, రైతులు బృందాలుగా ఏర్పడి కానీ ఈ పథకాన్ని వినియోగించుకోవాలని సూచించింది. జిల్లాలో మార్చి నాటికి వెయ్యి బోర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యం విధించింది. ఈ మేరకు 5,777 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా, ఇప్పటివరకు అధికారులు 173 బోర్లు మాత్రమే వేశారు. ఇందుకోసం రూ.80 లక్షలు వ్యయం చేశారు. మిగతా దరఖాస్తులు ఇంకా వివిధ దశల్లోనే ఉన్నాయి. లక్ష్యం గడువు పూర్తయిందని.. బోర్లు ఇంకా ఎప్పుడు ఏర్పాటు చేస్తారో తెలియని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ప్రస్తుతం ఖరీఫ్‌ పంటలకైనా బోర్లు వేయాలని కోరుతున్నారు. 


దరఖాస్తుల పరిశీలనలోనే.. 

వైఎస్సార్‌ జలకళ పథకం కోసం రైతులు సచివాలయంలో కానీ, నేరుగా ఆన్‌లైన్‌లో కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను వీఆర్వోలు, ఉపాధిహామీ అధికారులు పరిశీలిస్తారు. అనంతరం బోరు ఏజెన్సీకి పంపుతారు. రైతుల పొలంలో బోరు తీయాల్సిన ప్రదేశాన్ని జియాలజిస్టు పరిశీలిస్తారు. జియాలజిస్టు ఆమోదిస్తే.. మళ్లీ ఉపాధిహామీ పీడీకి సిఫారసు చేస్తారు. ఆయన కలెక్టర్‌ అనుమతి కోసం నివేదిస్తారు. కలెక్టర్‌ నుంచి అనుమతి వస్తేనే బోర్లు వేస్తారు. భూగర్భ జలాల స్థాయిని అనుసరించి గరిష్టంగా 400 అడుగులు వరకు తీసేందుకు వీలుంది. ఇందుకు ఒక్కో అడుగుకు ప్రభుత్వం రూ.138 చెల్లిస్తోంది. కాగా, ఈ ప్రక్రియ జిల్లాలో మందకొడిగా సాగుతోంది. అధికారులు ఇంకా దరఖాస్తులు పరిశీలిస్తుండగా.. లక్ష్యం ఎప్పటికి నెరవేరుతుందనేది ప్రశ్నార్థకమవుతోంది. 


లక్ష్యం చేరుకుంటాం 

అందిన దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు 173 బోర్లు వేయించాం. దరఖాస్తులు చేసుకున్న రైతుల భూముల్లో జియాలజిస్టులు సర్వేలు చేస్తున్నారు. మే నెలాఖరు నాటికి అర్హులైన రైతులందరికీ  బోర్లు వేయిస్తాం.

- కూర్మారావు, డ్వామా, పీడీ.

Updated Date - 2021-04-17T06:08:55+05:30 IST