ఇక గోల్ఫ్‌ కోర్స్‌ వంతు!

ABN , First Publish Date - 2021-06-18T07:39:46+05:30 IST

రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి విజయసాయిరెడ్డి దృష్టి ఇప్పుడు నగరంలోని ముడసర్లోవ రిజర్వాయర్‌ను ఆనుకుని ఉన్న ఈస్ట్‌పాయింట్‌ గోల్ఫ్‌ కోర్సుపై పడింది. ఆ కోర్సుకు భూముల కేటాయింపులకు

ఇక గోల్ఫ్‌ కోర్స్‌ వంతు!

ఆ భూముల వివరాలు ఇవ్వండి 

లీజు సక్రమంగా కడుతున్నారా? లేదా?

కేటాయింపులో అవకతవకలు ఉన్నాయా?

వాటిని రద్దుచేసి, ఇంకెవరికైనా ఇవ్వొచ్చా?

వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వండి

విశాఖ అధికారులకు సాయిరెడ్డి ఆదేశం


విశాఖపట్నం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రాజ్యసభ సభ్యుడు, వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి విజయసాయిరెడ్డి దృష్టి ఇప్పుడు నగరంలోని ముడసర్లోవ రిజర్వాయర్‌ను ఆనుకుని ఉన్న ఈస్ట్‌పాయింట్‌ గోల్ఫ్‌ కోర్సుపై పడింది. ఆ కోర్సుకు భూముల కేటాయింపులకు సంబంధించిన వివరాలతో సమగ్ర నివేదికను తయారుచేసి తనకు అందించాలని జీవీఎంసీ అధికారులను ఆయన ఆదేశించారు. జీవీఎంసీ పాత సమావేశ భవనంలో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో ముడసర్లోవ పార్కు అభివృద్ధిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన మాట్లాడుతూ సుమారు 850 ఎకరాల్లో ముడసర్లోవ రిజర్వాయర్‌, పరీవాహక ప్రాంతం ఉందన్నారు. అందులో 112 ఎకరాల్లో గోల్ఫ్‌ కోర్సు, 150 ఎకరాల్లో రిజర్వాయర్‌ ఉన్నాయన్నారు. రైల్వే, పోర్టు, నేవీ వంటి ప్రభుత్వ శాఖలకు కొంత భూమిని కేటాయించగా మిగిలిన 500 ఎకరాల్లో అమ్యూజ్‌మెంట్‌ పార్కును అభివృద్ధి చేస్తే బాగుంటుందని సూచించారు. ఇంతలో విజయసాయిరెడ్డి జోక్యం చేసుకుని గోల్ఫ్‌కోర్సుకు భూమిని ఎప్పుడు, ఏ ప్రాతిపదికన కేటాయించారని అడిగారు. చాలాకాలం కిందట వంద ఎకరాలు లీజు ప్రాతిపదికన కేటాయించారని, కొన్నేళ్ల కిందట మరో 12 ఎకరాలు ఇచ్చారని కమిషనర్‌ చెప్పారు. ఎకరాకు నెలకు రూ.5వేల చొప్పున లీజు కింద చెల్లించాల్సి ఉంటుందని సీసీపీ వివరించారు.


లీజు కడుతున్నారా? లేదా? అని సాయిరెడ్డి ప్రశ్నించగా రికార్డులు చూడాలనిని ఆమె సమాధానం ఇచ్చారు. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సాయిరెడ్డి గోల్ఫ్‌ కోర్సుకు మొదట ఎప్పుడు భూమి కేటాయించారు? నిబంధనలు ఏమిటి? పూర్తి వివరాలతో పాటు గోల్ఫ్‌ కోర్సు మ్యాప్‌ వంటి ప్రతిపాయింట్‌ తనకు కావాలని స్పష్టంగా చెప్పారు. ‘ఇది చాలా ముఖ్యమైంది. కాబట్టి వీలైనంత త్వరగా సమగ్ర నివేదిక అందించాలి’ అని కమిషనర్‌ను ఆదేశించారు. వీలైతే కేటాయింపులను రద్దు చేసి, అంతకంటే ఎక్కువ ఆదాయం ఇస్తామన్నవారికి ఇచ్చేందుకు గల అవకాశాలను కూడా నివేదికలో పొందుపరచాలని సూచించారు.

Updated Date - 2021-06-18T07:39:46+05:30 IST