పైసలెన్నయినా ఇస్తాం.. జాప్యాన్ని సహించం

ABN , First Publish Date - 2020-05-31T09:56:13+05:30 IST

శ్రీరాంసాగర్‌ వరద కాలువ గౌరవెల్లి రిజర్వాయర్‌ పనుల్లో వేగం పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు

పైసలెన్నయినా ఇస్తాం.. జాప్యాన్ని సహించం

గౌరవెల్లి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ప్రకారం నిర్వాసితులకు పరిహారం

ప్రాజెక్టు పనులపై సమీక్షలో మంత్రి హరీశ్‌రావు వెల్లడి


హుస్నాబాద్‌, మే 30: శ్రీరాంసాగర్‌ వరద కాలువ గౌరవెల్లి రిజర్వాయర్‌ పనుల్లో వేగం పెంచాలని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని అరణ్య భవన్‌లో ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌, ఇరిగేషన్‌ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామారెడ్డితో కలిసి రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులతో ప్రాజెక్టు పనుల పురోగతిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులు త్వరగా పూర్తిచేసి హుస్నాబాద్‌ రైతుల అకాంక్ష తీర్చాలని ఎమ్మెల్యే సతీ్‌షకుమార్‌ మంత్రి దృష్టికి తీసుకవచ్చారు.


అనంతరం మంత్రి మాట్లాడుతూ రిజర్వాయర్‌ పాత, కొత్త పనులను రూ.583.277 కోట్ల అంచనాలతో చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే రూ.493.91 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. రిజర్వాయర్‌కు సంబంధించి 112.65 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 24,281 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని, 1,65,721 క్యూబిక్‌ మీటర్ల రివిట్మెంట్‌ పనులు, 1,34,841క్యూబిక్‌ మీటర్ల రాక్‌టో పనులు పూర్తయినట్లు ఇరిగేషన్‌ అధికారులు మంత్రికి వివరించారు. సర్జిపూల్‌, పంప్‌హౌజ్‌, కాల్వల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన పనులు వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు. పంపుల బిగింపు త్వరితగతిన పూర్తిచేసి రిజర్వాయర్‌లోకి నీళ్లు నింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. వర్షాకాలంలోనూ పనులు ఆగకుండా చూడాలన్నారు. ఎన్ని నిధులు సమకూర్చుతామని, పనుల్లో జాప్యాన్ని మాత్రం సహించమన్నారు. 


ఆర్‌అండ్‌ఆర్‌ ప్రకారం పరిహారం

ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితులకు ప్రభుత్వం నిర్ధేశించిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ప్రకారం పరిహారం చెల్లించాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. పాత ముంపు ప్రాంతం, కొత్తగా చేరిన ముంపు ప్రాంతాల్లో భూ సేకరణలో ఎలాంటి జాప్యం జరుగవద్దన్నారు. భూములు కోల్పోయే రైతులు, స్థానికులు స్వచ్ఛందంగా రిజర్వాయర్‌ పనులకు సహకరించాలని ఆయన కోరారు. హుస్నాబాద్‌ ఆర్డీవో జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2020-05-31T09:56:13+05:30 IST