కరోనా లెక్కలు దాస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-01-19T09:10:02+05:30 IST

కరోనా మూడోవేవ్‌ విజృంభిస్తోంది. ప్రతిరోజు వందలాది మంది వైరస్‌ బారినపడుతున్నారు.

కరోనా లెక్కలు దాస్తున్న ప్రభుత్వం

  • జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1206 మందికి 
  • పాజిటివ్‌ వచ్చినట్లు బులెటిన్‌లో వెల్లడి
  • కానీ.. కేవలం 11 ప్రాంతాల్లోనే 1,648 పాజిటివ్‌లు
  • ‘ఆంధ్రజ్యోతి’ బృందం పరిశీలనలో వెలుగులోకి
  • మిగిలిన కేసులన్నీ ఏ లెక్కలో వేయాలో?


హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కరోనా మూడోవేవ్‌ విజృంభిస్తోంది. ప్రతిరోజు వందలాది మంది వైరస్‌ బారినపడుతున్నారు. వైద్యారోగ్య, పోలీసు, మున్సిపల్‌ శాఖలు సహా చాలా ప్రభుత్వ విభాగాల్లో సిబ్బందికి కొవిడ్‌ నిర్ధారణ అవుతోంది. ఈనేపథ్యంలో ప్రభుత్వం కరోనా పరీక్షల సంఖ్యను భారీగా పెంచింది. ప్రతి పీహెచ్‌సీ, యూహెచ్‌సీ, ఏరియా ఆస్పత్రులు, ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద వందలాది మంది పరీక్షలు చేయించుకునేందుకు క్యూ కట్టారు. ప్రతి వైద్య కేంద్రంలో వందలాది మందికి టెస్టులు నిర్వహించారు. కానీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన హెల్త్‌ బులెటిన్‌లో మాత్రం జీహెచ్‌ఎంసీ పరిధిలో 1206 మందికి మాత్రమే పాజిటివ్‌ వచ్చిందని వెల్లడించింది. ఇదే విషయమై హైదరాబాద్‌ నగరంలోని పలు హెల్త్‌ సెంటర్లలో కొవిడ్‌ పరీక్షలు, పాజిటివ్‌ల నిర్ధారణకు సంబంధించిన గణాంకాలను ‘ఆంధ్రజ్యోతి’ బృందం మంగళవారం స్వయంగా పరిశీలించింది. 


పరిశీలనలో ఏం తేలిందంటే.. 

కరోనా కేసుల గణాంకాల్లోని నిజానిజాలను గుర్తించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ బృందం క్షేత్రస్థాయికి వెళ్లింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 11 వైద్య కేంద్రాల్లో 5,198 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 1,648 మందికి పాజిటివ్‌ వచ్చిందని గుర్తించింది. అలాంటప్పుడు గ్రేటర్‌ పరిధిలో ప్రభుత్వం నిర్వహిస్తున్న 239 ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షా కేంద్రాలు, 11 ఆర్టీ-పీసీఆర్‌ కేంద్రాలతో పాటు ప్రైవేటు పరిధిలోని 54 ఆర్టీ-పీసీఆర్‌ కేంద్రాల్లో ఇంకా ఎన్ని పరీక్షలు జరిగి ఉంటాయో ? వాటిలో మరెంత మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయి ఉంటుందో ? అంచనా వేసుకోవచ్చు. ఈలెక్కన ‘ఆంధ్రజ్యోతి’ బృందం గుర్తించిన 1,648 కేసుల కంటే ఇంకా ఎన్నోరెట్లు ఎక్కువ స్థాయిలో మంగళవారం రోజున పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయన్నది విస్పష్టం. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని బాహాటంగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వమే.. కేసుల లెక్కలను గోప్యంగా ఉంచడంలో ఆంతర్యమేమిటో తెలియాల్సి ఉంది. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన ప్రభుత్వమే ఇలా.. కేసులను తక్కువ చేసి చూపించడం సరికాదని పరిశీలకులు అంటున్నారు. 

Updated Date - 2022-01-19T09:10:02+05:30 IST