ధరల అదుపులో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-07-23T05:32:54+05:30 IST

నిత్యావసర వస్తువుల ధరలు ఇష్టారాజ్యంగా పెరుగుతున్నా అదుపు చేయలేక జగన ప్రభుత్వం చేతులెత్తేసిందని కడప పార్లమెంటు టీడీపీ మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతశ్రీరెడ్డి, కడప ఇనఛార్జ్‌ అమీర్‌బాబు ఆరోపించారు.

ధరల అదుపులో ప్రభుత్వం విఫలం
గ్యాస్‌ సిలిండర్లకు పూలమాల వేసి నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం

ఖజానా నింపుకునేందుకు జనంపై బాదుడు

టీడీపీ మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతశ్రీరెడ్డి

కడప, జూలై 22 (ఆంధ్రజ్యోతి): నిత్యావసర వస్తువుల ధరలు ఇష్టారాజ్యంగా పెరుగుతున్నా అదుపు చేయలేక జగన ప్రభుత్వం చేతులెత్తేసిందని కడప పార్లమెంటు టీడీపీ మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతశ్రీరెడ్డి, కడప ఇనఛార్జ్‌ అమీర్‌బాబు ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెలుగు మహిళా ఆధ్వర్యంలో గురువారం టీడీపీ కార్యాలయం వద్ద పెరిగిన గ్యాస్‌, నిత్యావసర ధరలపై నిరసన వ్యక్తం చేశారు. గ్యాస్‌ సిలిండరును తలపై పెట్టుకుని, పూలదండ వేసి వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యావసర సరుకులైన నూనె, ఇతర పప్పుధాన్యాల ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ధరల నియంత్రణలో విఫలమైందన్నారు. కరోనా కారణంగా ఉపాధి లేక సామాన్య పేదలు ఇబ్బంది పడుతుంటే ఒక పక్క ధరల మోత పేదలకు శాపంగా మారిందన్నారు. ఖజానా నింపుకునేందుకు పెట్రోలు, డీజలుపై పన్నులు వేయడంతో వాటి రేట్లు ఆకాశాన్నంటాయన్నారు. జగన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంటు ఛార్జీలు పెంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ధరలు అందుబాటులో ఉండేవన్నారు. గ్యాస్‌ ధరలు పెరిగిపోవడంతో మళ్లీ పేదలు కట్టెల పొయ్యిల వైపు అడుగులు వేస్తున్నారన్నారు. ధరలు తగ్గించకుంటే జనం తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధనరెడ్డి, కడప పార్లమెంటు ప్రధాన కార్యదర్శి శ్రీదేవి, మీనాక్షి, విజయలక్ష్మి, భారతి, కవిత, నగర అధ్యక్షుడు శివకొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి జయకుమార్‌, పార్లమెంటు ఉపాధ్యక్షుడు శివరాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-23T05:32:54+05:30 IST