ప్రభుత్వమే న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2020-07-01T09:27:16+05:30 IST

ఫార్మా సిటీలోని సాయినార్‌ లైఫ్‌ సైన్స్‌స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన రావి నరేంద్ర స్వస్థలం గుంటూరు జిల్లా

ప్రభుత్వమే న్యాయం చేయాలి

మృతుల కుటుంబ సభ్యుల డిమాండ్‌


మహారాణిపేట, జూన్‌ 30: ఫార్మా సిటీలోని సాయినార్‌ లైఫ్‌ సైన్స్‌స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన రావి నరేంద్ర స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని సింగారపురం గ్రామం. నరేంద్ర ఎమ్మెస్సీ కెమెస్ట్రీ చేశారు. మొదట హైదరాబాద్‌లోని ఒక ఫార్మా కంపెనీలో పనిచేశారు. రెండేళ్ల తరువాత విశాఖలోని సాయినార్‌ ఫార్మా కంపెనీలో షిఫ్ట్‌ ఇన్‌చార్జిగా చేరారు. ఇతడికి తల్లిదండ్రులు, సోదరుడు ఉన్నారు. నరేంద్రకు ఐదేళ్ల కిందట విజయలక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఒక కుమార్తె (శరణ్య) ఉంది. ప్రమాదంలో భర్త మృతి చెందడంతో ప్రభుత్వమే తమ కుటుంబానికి న్యాయం చేయాలని విజయలక్ష్మి కోరుతున్నారు. అప్పటివరకు భర్త మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించవద్దని కోరుతూ, పంచనామా జరిపేందుకు కూడా ఆమె అంగీకరించలేదు. 


ఆదుకుంటాడనుకుంటే...

ఈ ప్రమాదంలో అశువులు బాసిన మరో వ్యక్తి గౌరీశంకర్‌ది విజయనగరం జిల్లా పుసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామం. రెండేళ్ల కిందటే ఈ కంపెనీలో కెమిస్ట్‌గా చేరాడు. కుమారుడి అకాల మృతిని అతడి తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా గౌరీ శంకర్‌కు ఈ ఏడాది మూడు నెలల క్రితం ఏప్రిల్‌లో వెంకటలక్ష్మితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె గర్భవతిగా కూడా నిర్ధారణ అయింది. దీంతో వీరి కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. 


విషమ స్థితిలో....

ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎల్‌వీ చంద్రశేఖర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా వున్నట్టు ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. వెంటిలేటర్‌పై వుంచి చికిత్స అందిస్తున్నామని, మరో 48 గంటలు గడిస్తే కానీ పరిస్థితి చెప్పలేమని వైద్యులు వివరించారు. అవివాహితుడైన చంద్రశేఖర్‌ కంపెనీలో డైలీ వేజ్‌ హెల్పర్‌గా పనిచేస్తున్నాడు.

Updated Date - 2020-07-01T09:27:16+05:30 IST