లక్ష్యం..10 లక్షలు

ABN , First Publish Date - 2021-01-21T07:39:25+05:30 IST

రాష్ట్రంలో ఒకే రోజుకు 10 లక్షల మందికి టీకాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. బుధవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో

లక్ష్యం..10 లక్షలు

రోజూ మిలియన్‌ టీకాలు వేయాలని ప్రణాళిక సిద్ధం చేసిన సర్కారు

తొలివిడతలో 1.90 లక్షల మందికి 

వ్యాక్సినేషనే టార్గెట్‌

కొవాగ్జిన్‌ సురక్షితమైంది: ఈటల

22వేల మంది వ్యాక్సినేషన్‌కు దూరం

సరైన కారణం లేకుండా టీకాను 

తిరస్కరిస్తే.. మళ్లీ వేయడం కష్టమే

నేడు 35 వేలమందికి వ్యాక్సిన్లు

మరో ఇద్దరికి కొత్త స్ట్రెయిన్‌


హైదరాబాద్‌/హుజూరాబాద్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో ఒకే రోజుకు 10 లక్షల మందికి టీకాలు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. బుధవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలో వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తొలి విడతలో రాష్ట్రంలో 1,210 కేంద్రాల్లో 1.90 లక్షల మందికి టీకాను వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. నాలుగైదు రోజుల్లో ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ సురక్షితమైందని ఆయన తెలిపారు. తొలి విడత వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో టీకా తీసుకోవాల్సిన ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తల్లో సగటున 20 శాతం మంది అందుకు దూరంగా ఉండిపోయారు. గర్భిణులు, బాలింతలు, అవయవ మార్పిడి చేసుకున్నవారు, రోగ నిరోధకత తక్కువగా ఉన్నవారికి వ్యాక్సిన్‌ వేయొద్దన్న నిబంధనలే ఇందుకు ముఖ్య కారణాలని వైద్యవర్గాలు చెబుతున్నాయి.


ప్రస్తుతం టీకాల కార్యక్రమంలో మొత్తం 1.50 లక్షల మంది వైద్య సిబ్బంది కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది 50వేల మంది వరకు ఉంటే, ఒక్క అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలే లక్ష మంది దాకా ఉన్నారు. వీరిలో 98 శాతం మంది మహిళలే. ఇందులో పలువురు గర్భిణులు, బాలింతలు ఉన్నారు. ఈ విభాగాల వారిపై వ్యాక్సిన్‌ ప్రయోగ పరీక్షలు జరగనందున, వారికి టీకాలు ఇవ్వొద్దని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. సైడ్‌ ఎఫెక్ట్స్‌ భయంతో ఇంకొందరు టీకా వేయించుకునేందుకు మొగ్గుచూపడం లేదు. ఈవిధంగా వివిధ కారణాలతో మంగళవారం నాటికి దాదాపు 22వేల మంది వ్యాక్సినేషన్‌కు దూరమయ్యారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు తెలిపారు. వీరి కోసం ఒక రోజు (జనవరి 24న) ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు.


వైద్య సిబ్బంది అంతా విధిగా టీకా తీసుకోవాలని, ఎవ్వరూ తిరస్కరించవద్దని ఆయన కోరారు. సరైన కారణం లేకుండా టీకా వేయించుకోవడానికి నిరాకరించే వారికి ఇక టీకా దొరకడం కష్టమని స్పష్టంచేశారు. బుధవారం టీకా కార్యక్రమానికి విరామం ఇవ్వడంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ అన్ని కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్‌ జరగనుంది. నేడు 35వేల మందికి టీకాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. శుక్రవారం నాటికి వైద్య సిబ్బంది అందరికీ టీకాలివ్వాలని వైద్య ఆరోగ్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. గురువారం కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా పూర్తిగా ఆన్‌లైన్‌లోనే టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షించనున్నారు. తొలి రెండు రోజులు సాఫ్ట్‌వేర్‌ సహకరించకున్నా... మ్యానువల్‌గా లబ్ధిదారుల జాబితాను చెక్‌ చేసి టీకాలు వేశారు.   


లా సెక్రెటరీకి పాజిటివ్‌

తెలంగాణలో మరో ఇద్దరికి కొత్త రకం కరోనా స్ట్రెయిన్‌ నిర్ధారణ అయింది. దీంతో ఆ రకం వైర్‌సతో ప్రబలిన కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. కొత్త స్ట్రెయిన్‌ బారినపడిన వారిద్దరూ హైదరాబాద్‌ వాసులేనని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వారు ఇటీవలే బ్రిటన్‌ నుంచి వచ్చారని తెలిపింది. ఆ దేశం నుంచి వచ్చిన వరంగల్‌ వాసి, రంగారెడ్డి జిల్లా మహిళకు కొత్త స్ట్రెయిన్‌ సోకినట్లు తొలుత గుర్తించారు. ఇక రాష్ట్రంలో మరో 267 మందికి కరోనా సోకింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకూ 27,471 మందికి పరీక్షలు చేయగా, హైదరాబాద్‌లో 55 మందికి, జిల్లాల్లో 212 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,92,395కి చేరింది. ఇందులో 2,86,893 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మరో 2,270 మంది హోం ఐసొలేషన్‌లో ఉండగా, 1,649 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  మంగళవారం కరోనాతో మరో ఇద్దరు చనిపోగా, మొత్తం మృతుల సంఖ్య 1583కు పెరిగింది. లా సెక్రెటరీ సంతో్‌షరెడ్డికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఆయన పీఏకు కరోనా సోకడంతో అనుమానం వచ్చి లా సెక్రెటరీ కూడా టెస్టు చేయించుకోవడంతో పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆయన పేషీలో పనిచేస్తున్న 40 మందికి బుధవారం పరీక్షలు నిర్వహించారు. 


వ్యాక్సిన్‌ టెస్టింగ్‌ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలి..కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు కేటీఆర్‌ లేఖ 

హైదరాబాద్‌ జీనోమ్‌ వ్యాలీలో వ్యాక్సిన్‌ టెస్టింగ్‌, సర్టిఫికేషన్‌ లేబొరేటరీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌ నగరం ప్రపంచ వ్యాక్సిన్‌ రాజధానిగా గుర్తింపు పొందిందని, ఏటా ఇక్కడి నుంచి ఆరు బిలియన్ల డోసుల వ్యాక్సిన్లను బయోటెక్‌ కంపెనీలు తయారు చేస్తున్నాయని తెలిపారు. ప్రపంచం మొత్తంలోని వాక్సిన్లలో సుమారు మూడో వంతు వ్యాక్సిన్లు హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలోనే తయారవుతున్నాయని పేర్కొన్నారు.   ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ తయారీకి సంబంధించి మరింత వేగంగా కార్యకలాపాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో వ్యాక్సిన్‌ల తయారీకి సంబంధించి సెంట్రల్‌ డ్రగ్‌ లేబొరేటరీ ప్రస్తుతం హిమాచల్‌ ప్రదేశ్‌లోని కసౌలిలో ఉందని, ప్రతిసారీ అక్కడికి తమ వ్యాక్సిన్లను పంపి పరీక్షించడం, సర్టిఫికేషన్‌ పొందడంలో హైదరాబాద్‌ బయోటెక్‌ కంపెనీలు సమయాభావాన్ని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. 


ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద నేషనల్‌ యానిమల్‌ రిసోర్స్‌ ఫెసిలిటీ ఫర్‌ బయో మెడికల్‌ రీసెర్చ్‌ సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందన్నారు. ఈ సంస్థకు స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా సమకూర్చిందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ సంస్థకు ప్రత్యేకంగా వ్యాక్సిన్లు, మెడికల్‌ డివైస్‌ టెస్టింగ్‌, సర్టిఫికేషన్‌ల బాధ్యత ఉందని, భారత ప్రభుత్వం తరఫున ఈ విధులను సంస్థ నిర్వహించాల్సి ఉందని వివరించారు. ఈ నేపథ్యంలో, అటు పరిశ్రమలకు, ఈ సం స్థకు ఉభయ తారకంగా ఉండేలా నేషనల్‌ డ్రగ్‌ లేబొరేటరీ జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాటు చేయాలని కోరారు. ఇక ప్రస్తుతం కోల్‌కతా, ముంబై, చెన్నై, కర్నాల్‌లలో మాత్రమే ఉన్న గవర్నమెంట్‌ మెడికల్‌ స్టోర్‌ డిపోను కూడా జీనోమ్‌ వ్యాలీలో ఏర్పాటు చేయాలన్నారు. 


కొవిన్‌ సాఫ్ట్‌వేర్‌లో నమోదైన ఆరోగ్య కార్యకర్తల వివరాలు

అంగన్వాడీ టీచర్స్‌  31,711

అంగన్వాడీ హెల్పర్స్‌ 31,711

ఆశా కార్యకర్తలు27,300

ఏఎన్‌ఎంలు 11,000

మిగిలిన వారంతా వైద్య సిబ్బంది

Updated Date - 2021-01-21T07:39:25+05:30 IST