బుద్ధుడి విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-06-19T05:25:04+05:30 IST

మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె సమీపంలోని బుద్ధుడి కొండపై బుద్ధవిహార్‌లో వరుసగా జరుగుతున్న విగ్రహాల ధ్వసంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బుద్ధఅంబేద్కర్‌ సమాజ్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు పీటీఎం శివప్రసాద్‌ డిమాండ్‌ చేశారు.

బుద్ధుడి విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
ప్రెస్‌క్లబ్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న బుద్దఅంబేద్కర్‌ సమాజ్‌ ట్రస్ట్‌ వ్యవస్ధాపకుడు పీటీఎం శివప్రసాద్‌

మదనపల్లె అర్బన్‌, జూన్‌ 18: మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లె సమీపంలోని బుద్ధుడి కొండపై బుద్ధవిహార్‌లో వరుసగా జరుగుతున్న విగ్రహాల ధ్వసంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బుద్ధఅంబేద్కర్‌ సమాజ్‌ ట్రస్టు వ్యవస్థాపకుడు పీటీఎం శివప్రసాద్‌ డిమాండ్‌ చేశారు. ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రపంచానికి శాంతి కపోతాన్ని అందించి, సమ సమాజాన్ని కాంక్షించిన గొప్ప మార్గదర్శకుడు గౌతమ బుద్ధుడన్నారు. రెండు దశాబ్దలుగా బుద్ధుడికొండలో బౌద్ధధర్మ ప్రచారాలు, ప్రబోధాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నట్లు చెప్పారు. యేటా బుద్ధపున్నమికి జరిగే ఉత్సవాల్లో పలు రాష్ట్రాలకు చెందిన బౌద్ధ భిక్షువులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారని తెలిపారు. గత ఏడాది ఆగస్టు 25న కొందరు దుండగలు రెండు బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేశారని దీనిపై మదనపల్లె తాలుకా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐదు అడుగుల బుద్ధుడి విగ్రహంతోపాటు 108 అడుగుల పెద్ద విగ్రహం ఏర్పాటు కోసం రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి ఆవిష్కరించిన శిలాఫలకం, పక్కనే ఉన్న పంచశీల జెండాను దుండగులు ధ్వంసం చేయడంపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. అయితే పోలీసులు ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేదన్నారు. ఈ సంఘటనలపై ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు.  బాస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీచందు, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కోనేటి దివాకర్‌, వీసీకే నాయకుడు ఆనంద్‌, బాస్‌ నాయకులు రవిశంకర్‌, రెడ్డిప్రసాద్‌, సయ్యద్‌, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.  


విగ్రహాల ధ్వంసం కేసు దర్యాప్తు వేగవంతం


మదనపల్లె క్రైం: బుద్ధుడి విగ్రహాల ధ్వంసం కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్లు డీఎస్పీ రవిమనోహరాచారి పేర్కొన్నారు. తాలూకా పోలీస్‌స్టేషన్‌లో ఆయన మీడియాతో  మాట్లాడుతూ బుద్ధుడికొండలో గత ఏడాది ఆగస్టులో ఓ బుద్ధ విగ్రహం తల తెగిపడిందన్నారు. ఈక్రమంలో బాస్‌ నాయకుడు చాట్ల బయన్న ఫిర్యాదు మేరకు అంకిశెట్టిపల్లె, తుమ్మలతాండాకు చెందిన 10 మందిని అరెస్టు చేసి కోర్టులో చార్జిషీట్‌  దాఖలు చేశామన్నారు.  ఒకటిన్నర నెలకిందట మరో విగ్రహ ధ్వంసం కేసు కూడా  దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.  ఇటీవల ఓ విగ్రహం పెయింటింగ్‌ తొలగించి బొమ్మపై గీతలు పెట్టి ఉండడంపై శనివారం తమకు ఫిర్యాదు అందిందన్నారు. ఈక్రమంలో సిబ్బందితో కలసి బుద్ధుడి కొండకు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించామన్నారు.  బుద్ధవిహార్‌ చుట్టూ రక్షణకంచె లేకపోవడంతో వరుస ఘటనలు జరుగుతున్నట్లు చెప్పారు. అంకిశెట్టిపల్లె పంచాయతీకి చెందిన కొందరు వ్యక్తులు విగ్రహాల ధ్వంసానికి పాల్పడుతున్నట్లు తెలిసిందన్నారు. దీనిపై ప్రస్తుతం సుమోటోగా కేసు నమోదు చేసి క్షేత్రస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఘటనకు పాల్పడిన దుండగులను త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.


సమాచారమిస్తే రూ.10వేల రివార్డు


మదనపల్లె టౌన్‌:  బుద్ధవిహార్‌లో విగ్రహాల ధ్వంసంపై కేసు నమోదు చేశామని, ఈ కేసులో ప్రజలకు ఎటువంటి సమాచారం తెలిసినా తన ఫోన్‌ నెం.9440796738 కాల్‌ చేయాలని డీఎస్పీ రవిమనోహరాచారి కోరారు. శుక్రవారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ బుద్ధవిహార్‌లో విగ్రహాల ధ్వంసం ఘటనపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఈ కేసులో దోషుల గురించి తెలిసిన వారు తమకు సమాచారమిస్తే రూ.10 వేల రివార్డు ఇస్తామన్నారు. దీంతో పాటు బుద్ధవిహార్‌లో నేటి నుంచి రాత్రి, పగలు పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశామని డీఎస్పీ చెప్పారు.

Updated Date - 2021-06-19T05:25:04+05:30 IST