Abn logo
Sep 24 2021 @ 00:20AM

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

ఆదిలాబాద్‌టౌన్‌, సెప్టెంబరు 23: అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభ్యులు తన దృష్టికి తీసుకొచ్చిన అన్ని సమస్యలను సీఎం కేసీఆర్‌కు నివేదిస్తానని తెలిపారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులు, ప్రజలు భాగస్వాములై సహకారం అందించాలని కోరారు. అంతకు ముందు సభ్యులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, డబుల్‌బెడ్‌రూంలు, పోడుభూములు, మిషన్‌ భగీరథ, ఫసల్‌బీమా, వైద్య సౌకర్యం కల్పనకు చర్యలు తీసుకుంటామన్నారు. సభాదృష్టికి తీసుకొచ్చిన సమస్యలను పరిశీలించి సౌకర్యాలను మెరుగు పరుస్తామని కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ అన్నారు. పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, పేదలకు డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మెరుగు పరుస్తామన్నారు. అదే విధంగా రిమ్స్‌లో వైద్య సౌకర్యాలు మెరుగు పరిచి పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటామని  పేర్కొన్నారు. మిషన్‌ భగీరథ నీళ్లు ఎప్పటికప్పుడు క్లోరినేషన్‌ చేయాల్సినఅవసరం ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. సమావేశం ప్రారంభమైన వెంటనే మిషన్‌ భగీరథ పై చర్చించిన జీవన్‌రెడ్డి క్లోరినేషన్‌ పై ఎప్పటికప్పుడు కలెక్టర్‌ స్వయంగా పరిశీలన చేయాలని కోరారు. ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌బాపురావ్‌లు మాట్లాడుతూ జిల్లాలో కొన్ని సమస్యలు పరిష్కారించాల్సి ఉందని వాటిని పరిష్కరించడంలో కొంత ఆలస్యం జరుగుతుందన్నారు. అయితే ఇప్పటికే జిల్లాలో  రాష్ట్ర ప్రభుత్వంలోనే అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందని అనేక గ్రామాలకు రవాణా సౌకర్యంతో పాటు రోడ్డు, మంచినీరు, విద్యా వైద్యం వంటివి అందిస్తున్న ఘనత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కాగా ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వానికి చెడ్డపేరు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.

రిమ్స్‌లో అందని వైద్యం..

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకే తలమానికంగా నిలిచేలా జిల్లా కేంద్రంలో కోట్ల రూపాయలతో నిర్మించిన రిమ్స్‌లో ప్రజలకు వైద్యం అందడం లేదని, రూ.లక్షల జీతం తీసుకుంటున్న వైద్యులు సమయపాలన పాటించక పోగా ప్రైవేట్‌ ఆసుపత్రులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పలువురు సభ్యులు ధ్వజమెత్తారు.

పరిష్కారం కాని సమస్యలు..

2005 సంవత్సరం నుంచి పోడు రైతులను సమస్య వెంటాడుతున్నా ప్రభుత్వం, అధికారులు ఇంత వరకు సమస్యను పరిష్కరించ లేదని సభ్యులు మండపడ్డారు. ప్రభుత్వం రైతులకు రైతుబంధు ఆశచూపి నేడు విస్మరించడం సమంజసం కాదన్నారు. ఇప్పటివరకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు అర్హులకు కేటాయించక పోవడం శోచనీయమన్నారు. అలాగే ఫసల్‌బీమా డబ్బులు చెల్లించక పోవడంతో రైతులు అయోమయంలో ఉన్నారని ఈ సమస్యలన్నింటి పై దృష్టి సారించి న్యాయం చేయాలని పలువురు సభ్యులు డిమాండ్‌ చేశారు.