ఉద్యోగులను దగా చేసిన ప్రభుత్వం

ABN , First Publish Date - 2022-01-20T04:46:55+05:30 IST

పీఆర్‌సీ ప్రకటనలో రెండున్నరేళ్లు కాలయాపన చేసి చివరకు 23.39 శాతం ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులను జగన్‌ సర్కార్‌ దగా చేసిందని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి అన్నారు.

ఉద్యోగులను దగా చేసిన ప్రభుత్వం
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మల్లెల లింగారెడ్డి

టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 19 : పీఆర్‌సీ ప్రకటనలో రెండున్నరేళ్లు కాలయాపన చేసి చివరకు 23.39 శాతం ప్రకటించి ప్రభుత్వ ఉద్యోగులను జగన్‌ సర్కార్‌ దగా చేసిందని టీడీపీ కడప పార్లమెంట్‌ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి అన్నారు. బుధవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన, 18 వేల కోట్లు లోటు ఉన్న సమయంలోనే టీడీపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ 27 శాతం ఇవ్వడంతో పాటు పీఆర్‌సీని 43 శాతం ఇచ్చిందన్నారు. ఇపుడు వైసీపీ ప్రభుత్వం ఐఆర్‌ 27 శాతం ఇస్తూ పీఆర్‌సీని 23.39 శాతానికి కుదించడం వల్ల ఉద్యోగుల జీతాల్లో భారీగా కోత ఏర్పడిందన్నారు. హెచ్‌ఆర్‌ఏ విషయంలోను ఉద్యోగులకు అన్యాయమే జరిగిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగులే కాదు, ఇటు ప్రజలు, అటు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో 2 లక్షల 30 వేలు ఉద్యోగాలు ఖాళీ ఉంటే, 4 వేల పోస్టులకు కూడా నోటిఫికేషన్‌ ఇవ్వలేదన్నారు. సచివాలయ ఉద్యోగుల విషయంలోను సీఎం జగన్‌ మాట తప్పారన్నారు. ఉద్యోగులకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో ఉద్యోగుల తరపున టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. సమావేశంలో టీడీపీ కడప పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి సానా విజయభాస్కర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు సుబ్బరాజు, సీతారామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-20T04:46:55+05:30 IST