Abn logo
Mar 16 2020 @ 05:07AM

నా చే తాకిన గొప్పవాళ్ళు

నా చే తాకిన గొప్పవాళ్ళు 

ఏడుకొండల వెంకటేసుడు యముని పాయం పట్టలేక

మొగినాలీ పొందుకై పాకులాటను పాటగా పాడిన

మా నాగవ్వ పాటే మా కింపైన బాస


నడిజామన పానం అగ తప్పితే చెట్టోరు మందు పొంగ పోసి ఇస్తే

కాంచేడికి జుట్టు పట్టి పైకి లేపినట్లు చేసే

మా మల్లయ్య చేతి వైద్యమే మా బతుకు


మొన్ను కూడా పెరక్క తినే కటన్న కరువులో 

   గొట్టి గడ్డలు అనప బేడలు బెల్లం వేసి

చింతకట్లుతో రేయంత ఉడకబెట్టి పంచె వన్నె పదార్తాన్ని మా నోటికందించిన

మా లచ్చమ్మ చెయ్యివాటం మా బతుకు తీపి


ఏడు పొగుళ్ళు ఏడు రేత్రులు తెరపెరగని వాన గాలి ఎత్తుకుంటే

ఊరందరి పైకప్పులు పైకి లేస్తే మా ఇంటి కప్పు చెక్కుచెదరకుండ కప్పిన

మా బోయకొండ తాత పనితనమే మా నెత్తి గొడుగు


కుదుట్లో నిండు నీళ్ళకడవపై బూతద్దం వేసి వెతికినా

ఎల్సని కుండ చేసిన కుమ్మరి వెంకటప్ప చేతుల్లో ఉన్న

ఉన్నరి తనమే మా నోటి కూడు

పెండ్లి, పుట్టుక, పండగ, ఆట, పాట, రంపు, చావుల్ల పెద్ద తలకాయగా నిలబడి

అంతు ఇడసకుండా అందరినీ ఒకే గాటీ కట్టేసే మల్లెతనం ఉన్న

మా రామయ్య కొండమ్మలే మా మేలుకొలుపు


ఏడేండ్లు వెతికిన పురుగుకి దారి దొరకనీయకుండా దాసిన విత్తనాల కోసం

పోవిడి దొరికిన వాల్నంతా ఒంటికాలి మింద నిలబెట్టేలా చేసిన

మా ఈరమ్మ ముందుచూపే మా బతుకు నిలుపు


పగోనిపై చెయ్యి కర్ర వాడకుండా

నీ బుర్ర దొల్లాడా నీ దటం యాలాడ అని నోటితోనే అల్లి పెట్టె

మా అనసూయ తిట్టే మా నోటి గెలుపు


నూరేండ్లు అయినా నేల పోయే నల్ల జీమను కనిపెడుతూ

పొప్పేమకలు పలపల కొరుకుతూ వంగకుండ 

  అందురు అసోద్దె పోయేటట్లు బతికిన

పాపుల పెద్దమ్మ బతికిన బతుకే మా పానతీపి!


తరాలు మారినా యుగాలు మారినా మనతో బతికేది మన బాస

మనకు సొంతమైన బాసే మన బతుకు కిటుకు

కిటుకు లేని మనిషి కీటకముతో సమానం

ఎండపల్లి భారతి

93908 03436


Advertisement
Advertisement
Advertisement