అమెరికాలో వింత పరిణామాలు..! ఇక ఉద్యోగాలు చేయలేమంటున్న అమెరికన్లు

ABN , First Publish Date - 2021-10-19T01:07:55+05:30 IST

అమెరికాలో వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం.. ఆగస్టు నెలలో ఏకంగా 43 లక్షల మంది తమ ఉద్యోగాలను వదిలిపెట్టేశారు. అక్కడి కార్మిక శక్తిలో ఇది దాదాపు మూడు శాతానికి సమానం.

అమెరికాలో వింత పరిణామాలు..! ఇక ఉద్యోగాలు చేయలేమంటున్న అమెరికన్లు

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో వింత పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తున్నారు. బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ లెక్కల ప్రకారం.. ఆగస్టు నెలలో ఏకంగా 43 లక్షల మంది తమ ఉద్యోగాలను వదిలిపెట్టేశారు. అక్కడి కార్మిక శక్తిలో ఇది దాదాపు మూడు శాతానికి సమానం. 2020 తరువాత ఉద్యోగులు ఈ స్థాయిలో ఉద్యోగాలను వదులుకోవడం ఇదే తొలిసారి. అన్ని రంగాల్లో ఈ ట్రెండ్ స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ..వైద్య, ఆతిథ్య రంగాలలో పరిస్థితి తీవ్రత అధికంగా ఉంది. కరోనాకు పూర్వం ఉద్యోగాల కోసం ఎగబడ్డ ప్రజలు సంక్షోభం అదుపులోకి వస్తున్న తరుణంలో ఉద్యోగాలను వదులుకుంటున్నారు. ఈ పరిస్థితిని ‘ది గ్రేట్ రెజిగ్నేషన్స్’ అని పిలుస్తున్నారు.


కరోనా సంక్షోభం తరువాత ఇప్పుడిప్పుడే అమెరికాలో వ్యాపారాలు పట్టాలెక్కుతుంటే..అమెరికన్లు ఇలా ఉద్యోగాలను వదిలేసుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే..అమెరికాలో మెరుగవుతున్న ఆర్థికస్థితికి ఈ రాజీనామాలు అద్దం పడుతున్నాయని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉద్యోగులు తమ కేరీర్‌కు సంబంధించి కొత్త మార్గాల్ని వెతుక్కునేందుకు సంకోచించడం లేదని వారు చెబుతున్నారు. ఇందుకు వారి ఆర్థికస్థితిగతులు కూడా అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు. అయితే..కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కంపెనీలకు ఇది ఇబ్బందికర పరిణామమని మరి కొందరు వాదిస్తున్నారు. ఉద్యోగుల కొరత కారణంగా కంపెనీ ఎదుగుదల మందగించే అవకాశం ఉందంటున్నారు. 


రాజీనామాలకు కారణాలు ఇవే..

అయితే.. ఇలాంటి పరిస్థితికి ప్రధాన కారణమంటూ ఏదీ లేదని తెలుస్తోంది. అనేక కారణాలు కలగలిసి ఉద్యోగులను రాజీనామా చేసేందుకు పురిగొల్పుతున్నాయట. వైద్య, ఆతిథ్య రంగాల్లోని ఉద్యోగులు తాము బాగా అలసిపోయి ఉన్నామంటూ రాజీనామాలకు తెగబడుతున్నారట.కస్టమర్లతో నేరుగా మాట్లాడాల్సిన ఉద్యోగాల్లో ఇటువంటి పరిస్థతి అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.  గత 18 నెలలుగా పెరిగిన పని గంటలు, కరోనా ఆంక్షల నేపథ్యంలో తలెత్తుతున్న వివాదాల కారణంగా అనేక మంది మానసికంగా, శారీరకంగా అలసిపోయామని చెప్పారు. కొంతకాలమైనా పని ఒత్తిడికి దూరంగా సేదతీరాలని వారు కోరుకుంటున్నట్టు తెలిసింది.


ఇంతకాలం వర్క్ ఫ్రం హోం‌కు అలవాటు పడిన వైట్ కాలర్ ఉద్యోగులేమో మళ్లీ కార్యాలయాలకు వెళ్లడం ఇష్టం లేక ఉద్యోగాలు వదులుకుంటున్నారు. కరోనా సంక్షోభం తరువాత అనేక మంది డబ్బుకు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించి జీవితాన్ని ఆస్వాదించేందుకు మొగ్గుచూపుతున్నారు. గత ఏడాదిన్నర కాలంగా ఉద్యోగుల పట్ల కంపెనీలు  అనుసరించిన కఠిన విధానాలతోనూ అనేక మంది విసిగిపోయి వేరే దారులు తొక్కుతున్నారు. అయితే.. ఇవన్నీ ఉద్యోగుల్లో వచ్చిన తాత్కాలిక మార్పులా లేక దీర్ఘకాలికమైనవా అనేదాన్నిబట్టి అమెరికా భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Updated Date - 2021-10-19T01:07:55+05:30 IST