మహావృక్షమే మృత్యువైంది

ABN , First Publish Date - 2022-01-19T05:11:30+05:30 IST

మహావృక్షమే మృత్యువైంది

మహావృక్షమే మృత్యువైంది
చెట్టు కొమ్మలు, గోడ శిథిలాల కింద చిక్కుకున్న చిన్నారులు

క్రికెట్‌ ఆడుకుంటున్న చిన్నారులపై విరిగిపడిన రావి చెట్టు, శిథిల గోడ

ఇద్దరు చిన్నారుల మృతి.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు

అందరూ పదేళ్లలోపు వారే

ఖమ్మం, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : వారికేం తెలుసు.. అక్కడ ఉన్న మహావృక్షమే.. మృత్యువు రూపంలో కాపుకాసిందని. విధే అలా నడిపించిందేమో అన్నట్టుగా ఆటలాడుకోవడానికి ఎన్నడూ వెళ్లని ఆ చోటుకు వెళ్లారు అభం శుభం తెలియని ఆ చిన్నారులు. అంతే ఎంతో ఉత్సాహంగా కికెట్‌ ఆడటం ప్రారంభించిన కాసేపటికే అక్కడ చిన్నారుల ఏడుపులు, కేకలు వినిపించాయి. ఒక్కసారిగా అక్కడ భీకర వాతావరణం కనిపించింది. ఆడుకోవడానికి వెళ్లిన చిన్నారులపై చెట్టు, పక్కనే ఉన్న శిథిలమైన గోడ విరిగిపడి ఇద్దరు చిన్నారులు అసువులు బాసారని తెలియడంతో ఆ ప్రాంతమంతా రోదనలు మిన్నంటాయి. ఈ విషాదకర సంఘటన ఖమ్మం నగరం నడిబొడ్డున మంగళవారం సాయంత్రం జరిగింది. ఖమ్మం నగరంలోని బ్రాహ్మణబజార్‌లో నివాసం ఉంటున్న పలు కుటుంబాలకు చెందిన చిన్నారులు రాజ్‌పుత్‌ ఆయుష్‌(5), మల్వాడి దిగాంత్‌ శెట్టి(11), కంచర్ల సాయి ఆర్యన్‌, కొల్లపల్లి సాకేత్‌, రాజ్‌పుత్‌ అనుమోలు, చరణ్‌సాయి కలిసి రోజూ ఆటలాడుకుంటారు. రోజూలాగానే మంగళవారం కూడా ఆ చిన్నారులు క్రికెట్‌ ఆడుకునేందుకు ఇళ్లనుంచి బయటకు వచ్చి ఒక్కచోట చేరారు. కానీ రోజూ ఇళ్ల సమీపంలో రోడ్డుపైనే ఆడుకునే ఆ చిన్నారులకు మంగళవారం వారి ఇంటి పరిసరాల్లో శుభ్రం చేసిన ఓ ఖాళీస్థలం కనిపించడంతో అక్కడికి పరుగుతీశారు. తమ ఆటకు అదే అనువైన స్థలంగా భావించి చిన్నారులంతా అక్కడికి వెళ్లారు. సరదా క్రికెట్‌ ఆడటం ప్రారంభించగా.. బాల్‌ అప్పటికే శిథిలమైన గోడలో ఉన్న రావి చెట్టుకు దగ్గరలోని ఓ గుంతలో పడింది. దాన్ని తీసేందుకు గుంత దగ్గరకు వెళ్లిన చిన్నారులు బాల్‌ను తీసేందుకు ప్రయత్నించగా.. ఒక్కసారిగా రావిచెట్టు సహా శిథిలమై ఉన్న గోడ వారిపై విరిగి పడింది. దీంతో ఐదుగురు చిన్నారులు చెట్టుకింద పడ్డారు. అయితే సాయి ఆర్యన్‌ మాత్రం చెట్టుతో పాటు గోడ విరిగిపడటాన్ని గమనించి భయంతో పక్కకి జరగడంతో స్వల్పగాయాలతో బయటపడ్డాడు. చెట్టు కొమ్మల మధ్య ఇరుక్కున చిన్నారుల కేకలను విన్న స్థానికులు అక్కడకు వెళ్లి వాటిని తొలగించి వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ లోపు విషయం తెలుసుకున్న నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, మునిసిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, అడిషనల్‌ డీసీపీ గౌస్‌ ఆలం అక్కడికి చేరుకున్నారు. పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది గోడశిథిలాలు, చెట్టు కొమ్మలను తొలగించారు. అప్పటికే ఆయుష్‌, దిగాంత్‌శెట్ట్టి మృతి చెందగా మిగిలిన వారికి తీవ్రగాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే సంఘటన జరిగిన వెంటనే స్థానికులు సమాచారం ఇచ్చినా సుమారు గంట సేపటివరకు అక్కడ అధికారులు ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదని కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. సదరు ఖాళీ స్థలం కొద్ది రోజులుగా పిచ్చిమొక్కలు మొలిచి ఉండగా... ఇటీవల దాన్ని ఓ షాపింగ్‌ మాల్‌ వారు వ్యాలెట్‌ పార్కింగ్‌ కోసం లీజుకు తీసుకుని నాలుగు రోజుల క్రితమే శుభ్రం చేయించారు.  

గంట వరకు అందని సహాయక చర్యలు 

సంఘటన జరిగిన తర్వాత చిన్నారుల కేకలు విని స్థానికులు పరుగులు తీయడం.. తమకు వీలైనంత వరకు శిథిలాలను తొలగించడం చేస్తున్న క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడారు. అక్కడకు వచ్చిన వారు అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవరూ స్పందించలేదంటూ కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. కేవలం ఒక్కరే పోలీసు సంఘటన స్థలానికి వచ్చి చూసివెళ్లారని చెబుతున్నారు. సుమారు గంట తర్వాత పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది అక్కడకు చేరుకుని ఎక్స్‌కవేటర్‌ సాయంతో శిథిలాలను తొలగించినట్టుగా కొందరు చెబుతున్నారు. కాగా మునిసిపల్‌ కమిషనర్‌ ఆదర్శ్‌ సురభి, అడిషనల్‌ డీసీపీ గౌస్‌ ఆలం ఆధ్వర్యంలో త్రీటౌన్‌ సీఐ సర్వయ్య, ఎస్‌ఐ సూరజ్‌ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 




Updated Date - 2022-01-19T05:11:30+05:30 IST