గాడిన పడుతున్న ప్రగతి చక్రం

ABN , First Publish Date - 2021-07-30T05:55:34+05:30 IST

ప్రజారవాణాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆర్టీసీని కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బతీసింది. అసలే నష్టాల్లో నడుస్తున్న సంస్థ, మరింత నష్టాల్లోకి వెళ్లింది.

గాడిన పడుతున్న ప్రగతి చక్రం

 కరోనా తగ్గుముఖంతో బస్సు ప్రయాణం వైపు ప్రయాణికులు 

 క్రమంగా పెరుగుతున్న ఆర్టీసీ ఆదాయం 

 నేటి నుంచి రోడ్లపైకి అద్దె బస్సులు

నల్లగొండ, జూలై 29 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రజారవాణాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఆర్టీసీని కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బతీసింది. అసలే నష్టాల్లో నడుస్తున్న సంస్థ, మరింత నష్టాల్లోకి వెళ్లింది.  లాక్‌డౌన్‌ సమయంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఆ తరువాత కూడా ప్రయాణికులు గతంలా బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపలేదు. తొలి విడత లాక్‌డౌన్‌ నుంచి ఆర్టీసీకి కష్టకాలం మొదలవ్వగా, దీని నుంచి కోలుకుంటున్న క్రమంలో రెండో విడత లాక్‌డౌన్‌ వచ్చింది. సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు ఓవైపు అధికారులు కృషి చేస్తుండగా, కరోనా కారణంగా అంచనాలు తలకిందులయ్యాయి. ప్రభుత్వం నుంచి కూడా ఆశించిన మేర సహకారం అందకపోవడంతో కార్మికులు, సంస్థ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఉద్యోగులకు వేతనాలు సరైన సమయంలో చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో ఏడు ఆర్టీసీ డిపోలున్నాయి. సుమారు 3వేల పైచిలుకు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.  

క్రమంగా పెరుగుతున్న ఆదాయం

కరోనా రెండో దశ తగ్గుముఖం పట్టడంతో బస్సుల్లో ప్రయాణించేవారి సంఖ్య పెరుగుతోంది. కరోనా రెండో దశ లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించినా 60 మంది ప్రయాణించాల్సిన బస్సులో 20 మంది కూడా లేకపోవడంతో సంస్థకు ఆదాయం తగ్గిపోయింది. 76శాతం ఉండాల్సిన ఓఆర్‌(ఆక్యుపెన్సీ రేషియో) 50శాతానికి పడిపోయింది. అయితే క్రమంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య, మరణాల రేటు తగ్గడంతో ప్రజలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం ప్రారంభమైంది. కరోనాకు ముందు ఉమ్మడి జిల్లాని ఏడు డిపోల్లో సుమారు 3లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణించే వారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య రెండు లక్షలకు చేరింది. దీంతో ఆదాయం గాడిన పడుతోంది. గతంలో ఏడు డిపోల్లో రోజువారీ ఆదాయం రూ.90లక్షల నుంచి రూ.కోటి వరకు ఉండేది. ప్రస్తుతం రూ.60లక్షల నుంచి రూ.65లక్షల్లోపు వస్తోంది.

నేటి నుంచి రోడ్లపైకి అద్దె బస్సులు

లాక్‌డౌన్‌ సమయంలో ఉమ్మడి జిల్లాలో ఏడు డిపోల పరిధిలో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. లాక్‌డౌన్‌ అనంతరం ప్రయాణికుల సంఖ్య పెద్దగా లేకపోవడంతో సంస్థ బస్సులే నడిచాయి. ప్రధాన రూట్లు మొదలు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, ఇంటర్‌ స్టేట్‌ బస్సులను నిలిపివేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో బస్సులన్నింటినీ తిప్పేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏడు డిపోల పరిధిలో సంస్థ బస్సులు 448, అద్దె బస్సులు 287 మొత్తం 735 ఉన్నాయి. రెండవ విడత లాక్‌డౌన్‌ నుంచి అనంతరం 448బస్సులే నడిచాయి. అద్దె బస్సులు రోడ్డెక్కలేదు. శుక్రవారం నుంచి అద్దె బస్సులను సైతం నడిపేందుకు అధికారులు సన్నాహాలు పూర్తిచేశారు. దీంతో ప్రయాణికులకు ఇబ్బ ందులు తొలగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల్లో తొలిదశలో 90బస్సులను తిప్పనున్నారు. బస్సులన్నీ రోడ్డెక్కితే ప్రయాణికుల సంఖ్య పెరిగి ఆదాయం కూడా పూర్వస్థితికి చేరే అవకాశం ఉంది. 

Updated Date - 2021-07-30T05:55:34+05:30 IST