వృద్ధి రేటు 7.9 శాతమే!

ABN , First Publish Date - 2021-06-02T10:05:29+05:30 IST

దేశంలో కరోనా 2.0 కల్లోలం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో వృద్ధి రేటు 7.9 శాతానికే పరిమితమవుతుందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు తాజాగా అంచనా వేశారు

వృద్ధి రేటు 7.9 శాతమే!

  • ఎస్‌బీఐ ఆర్థికవేత్తల తాజా నివేదిక
  • 9.3 శాతానికి మూడీస్‌ కుదింపు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా 2.0 కల్లోలం కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో వృద్ధి రేటు 7.9 శాతానికే పరిమితమవుతుందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు తాజాగా అంచనా వేశారు. గతంలో వారు ప్రకటించిన అంచనా 10.4 శాతం. దేశ, విదేశాలకు చెందిన వివిధ సంస్థల అంచనాల్లో ఇదే అతి తక్కువ స్థాయి. అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ కూడా తన అంచనాను 13.7 శాతం నుంచి 9.3 శాతానికి కుదించింది. దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగం పెంచాలని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా జూలై మధ్య నాటికి కోటి వ్యాక్సిన్లు ఇవ్వగలిగితే వృద్ధి రేటును ఎగువకు సవరించే ఆస్కారం తోసిపుచ్చలేమని కూడా వారన్నారు. రెండో విడత కొవిడ్‌ కట్టడికి విధించిన స్థానిక లాక్‌డౌన్లను కొనసాగిస్తూ ఉండడం కూడా వృద్ధికి విఘాతమేన్నారు. 


రూ.4.3 లక్షల కోట్లు నష్టపోతాం..

జూలై నాటికల్లా ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించకపోతే మరో రూ.4.3 లక్షల కోట్లు నష్టపోవడానికి మనం సిద్ధపడాలని తేల్చిచెప్పారు. రెండో విడతలో కరోనా గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాలకు విస్తరించడం జీడీపీని కుంగదీస్తోందని, నగర ప్రాంతాలతో పోల్చితే అవి రికవరీలో ముందువరుసలో నిలవలేకపోతున్నాయన్నారు.. రికవరీకి ప్రధానంగా హోటళ్లు, వాణిజ్యం, రవాణా, కమ్యూనికేషన్‌, బ్రాడ్‌కాస్టింగ్‌ సేవల రంగాలే ఆలంబనగా నిలుస్తాయన్నారు. ఈ పరిస్థితిలో దేశంలో ‘డబ్ల్యూ’ అక్షరం తరహాలో రికవరీ ఉంటుందని (తగ్గుదల, పెరుగుదల+ తగ్గుదల, పెరుగుదల) అంచనా వేశారు. గతంలో ప్రకటించిన ‘వి’ షేప్‌ రికవరీకి (ఎంతగా పడిందో అంతే వేగంగా పునరుజ్జీవం) ఇది పూర్తిగా భిన్నమైన అంచనా. ఆర్‌బీఐ మాత్రం ఇప్పటికీ 10.5 శాతం వృద్ధి రేటు సాధ్యమేనని అంచనా వేస్తోంది. 


వృద్ధికి రిస్క్‌లివే...

  • స్థానిక లాక్‌డౌన్ల పొడిగింపు
  • అంతర్జాతీయంగా పెరుగుతున్న క్రూడాయిల్‌ ధరలు
  • రికవరీ ‘వి’ షేప్‌ నుంచి ‘డబ్ల్యూ’ పాటర్న్‌కు మారడం
  • పునరుజ్జీవంలో గ్రామీణ ప్రాంతాల వెనుకబాటు


భారత రేటింగ్‌కు ముప్పు...?

కరోనా 2.0 భారత రేటింగ్‌కు ముప్పు తెచ్చి పెడుతున్నదని మూడీస్‌ హెచ్చరించింది. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థకు మూడీస్‌ ‘బీఏఏ3’ రేటింగ్‌ ఉంది. ఇది పరిస్థితిలో ప్రతికూలతను ప్రతిబింబిస్తోంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ఆర్థిక కార్యకలాపాలు క్షీణించాయని పేర్కొంటూ ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని జీడీపీ అంచనాను గతంలో ప్రకటించిన 13.7 శాతం నుంచి 9.3 శాతానికి కుదించాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. కరోనా 2.0 ప్రభావం గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం, అధిక జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ చేపట్టడానికి వ్యాక్సిన్ల కొరత, లాజిస్టిక్‌ సమస్యలు వేధిస్తూ ఉండడం కూడా రిస్క్‌ను పెంచిందని తాజా నివేదికలో హెచ్చరించింది. జూన్‌ తర్వాత కూడా లాక్‌డౌన్లు పొడిగించే పరిస్థితి ఏర్పడితే వ్యాపారాల మూసివేతలు, ఉద్యోగ నష్టాలు అధికంగా ఉంటాయని తెలిపింది. ఆర్‌బీఐ తీసుకున్న లిక్విడిటీ చర్యలు, ప్రభుత్వం ఒత్తిడి రుణాల కోసం ఆస్తుల పునర్నిర్మాణ కమిటీ ఏర్పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఒక మోస్తరు స్థాయిలో వనరుల కల్పన వంటివి సెక్టార్ల వారీ రిస్క్‌ను తగ్గించగలవు తప్పితే.. నిర్మూలించలేవని తేల్చిచెప్పింది. 

Updated Date - 2021-06-02T10:05:29+05:30 IST