పంట పండింది

ABN , First Publish Date - 2021-01-16T05:45:32+05:30 IST

జిల్లాలో గత ఏడాది ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పటికీ ధాన్యం దిగుబడి ఆశాజనకంగా ఉంది.

పంట పండింది
మాకవరపాలెం మండలం సుభద్రయ్యపాలెంలో పంట కోత ప్రయోగం

వరి దిగుబడులు ఆశాజనకం

హెక్టారు సగటు 3416.256 కిలోలు

4,855 కిలోలతో మొదటి స్థానంలో మాకవరపాలెం

అత్యల్పంగా రాంబిల్లి మండలంలో 2144.014 కిలోలు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గత ఏడాది ఖరీఫ్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పటికీ ధాన్యం దిగుబడి ఆశాజనకంగా ఉంది. హెక్టారుకు సగటున 3416.256 కిలోల దిగుబడి వచ్చింది. ఎకరాల పరంగా చూస్తే 1,382.54 కిలోల ధాన్యం పండింది. అంతకు ముందు సీజన్‌ (2019)తో పోలిస్తే హెక్టారుకు 63.256 కిలోల ధాన్యం అధికంగా పండింది. జిల్లాలో అత్యధికంగా మాకవరపాలెం మండలంలో 4,855.795 కిలోల దిగుబడి రాగా, అత్యల్పంగా రాంబిల్లి మండలంలో 2144.014 కిలోలు మాత్రమే వచ్చింది. 


656 యూనిట్లలో పంటకోత ప్రయోగాలు

జిల్లాలో పంటకోత ప్రయోగాల కోసం వరి సాగు చేసే ప్రాంతాలను 656 యూనిట్లుగా విభజించారు. ఒక్కో యూనిట్‌లో 100 హెక్టార్లను పరిగణనలోకి తీసుకుంటారు.  యూనిట్‌లో కనీసం నాలుగు పంట కోత ప్రయోగాలు చేపడతారు. నాలుగు అంతకంటే ఎక్కువ గ్రామాల్లో కలిపి 100 హెక్టార్ల విస్తీర్ణం వుంటే అక్కడ పది పంట కోత ప్రయోగాలు చేస్తారు. ఏజెన్సీలో చిన్నకమతాలు అధికంగా వుండడంతో ఎక్కువచోట్ల వరి పంటకోత ప్రయోగాలు చేపట్టారు. నాట్లు వేసే సమయంలోనే పంటకోత ప్రయోగం చేపట్టనున్న పొలాన్ని ఎంపిక చేసి రైతుకు తెలియజేస్తారు. కోత సమయంలో రైతు ఇచ్చిన సమాచారం మేరకు వ్యవసాయ శాఖ సిబ్బంది వెళ్లి 25 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పంట కోసి అక్కడికక్కడే నూర్చి తూకం వేస్తారు. దీనిలో నుంచి నిర్ణీత తేమ శాతాన్ని తీసివేసి, నికర దిగుబడిని లెక్కిస్తారు.


పంట కోత ప్రయోగాలు 90 శాతానికిపైగా పూర్తి

జిల్లాలో గత ఖరీఫ్‌లో వరి సాగుచేసిన ప్రాంతాల్లో నిర్వహించిన పంట కోత ప్రయోగాల ప్రక్రియను 90 శాతానికిపైగా పూర్తిచేశారు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం గత ఏడాది మొత్తం 1.02 లక్షల హెక్టార్లలో వరి పంట వేశారు. మొత్తం 3,800 పంట కోత ప్రయోగాలకు ఎంపిక చేయగా, ఇప్పటివరకు 3,500 క్షేత్రాల్లో కోతలు పూర్తిచేశారు. 


మొదటి స్థానంలో ‘మాకవరపాలెం’ 

జిల్లాలో మండలాల వారీగా వరి దిగుబడులను పరిశీలిస్తే మాకవరపాలెం మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ హెక్టారుకు 4855.795 కిలోల ధాన్యం దిగుబడి వచ్చింది. అయితే గత ఏడాదితో పోలిస్తే జిల్లా సగటు వరి దిగుబడి పెరగ్గా, మాకవరపాలెంలో (2019 ఖరీఫ్‌లో 5,651 కిలోలు) తగ్గింది. రెండో స్థానంలో కోటవురట్ల...4733.535 కిలోలు, మూడో స్థానంలో నర్సీపట్నం...4638.110 కిలోలు, ఆ తరువాత  దేవరాపల్లి 4545.216, అచ్యుతాపురం 4485.592, పద్మ నాభంలో 4478.537 కిలోల ధాన్యం దిగుబడి వచ్చింది. ఏజెన్సీ లోని జీకే వీధి మండలంలో హెక్టారుకి 4341.645 కిలోలు, జి.మాడుగుల మండలంలో 4275.591 కిలోల దిగు బడి వచ్చింది. తుఫాన్‌, భారీవర్షాలు, వరదల ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన రాంబిల్లిలో మండలంలో హెక్టారుకి 2144.014 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. కాగా అక్టోబరులో భారీ వర్షాలు, నవంబరులో తుఫాన్‌ వల్ల వరి సాగు తీవ్ర ఒడిదుడుకులకు లోనైందని, లేకుంటే వరి దిగుబడి పెరిగేదని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

Updated Date - 2021-01-16T05:45:32+05:30 IST