Abn logo
May 5 2021 @ 03:27AM

శ్మశానాల్లో లెక్కలు తీస్తే తల ఎత్తుకోలేరు

సీఎం అసమర్థతకు ఇంకెంతమంది బలికావాలి? : గోరంట్ల 


అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): కరోనా వల్ల ఎంత మంది చనిపోయారో శ్మశానాల్లో లెక్కలు తీస్తే జగన్‌ సర్కారు తల ఎత్తుకోలేదని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉప నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధ్వజమెత్తారు. అర్థం లేని కక్ష సాధింపు వ్యవహారాల్లో మునిగి తేలుతున్న ముఖ్యమంత్రి తన అసమర్థతకు ఎంత మందిని బలి తీసుకొంటారోనని మంగళవారం వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికలు, టీవీల్లో తన ప్రచారానికి వేల కోట్లు ఖర్చు చేస్తున్న సీఎం కరోనా వ్యాక్సిన్‌ కొనడానికి డబ్బులు లేవని చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ‘కరోనా పరీక్షల కిట్లు చాలినన్ని లేవు. ఆస్పత్రుల్లో పడకలు లేవు. వ్యాక్సిన్లు లేవు. మొదటి డోస్‌ వేయించుకొన్న వారికి రెండో డోస్‌ ఎప్పుడు దొరుకుతుందో తెలియదు శ్మశానాల్లో స్థలం సరిపోవడం లేదు కాబట్టి, జగనన్న శ్మశానాలను కూడా ఏర్పాటు చేసే ఆలోచన చేయాలి’ అన్నారు. అలాగే, ప్రధాని మోదీ నిర్లక్ష్యంతోనే కరోనాతో దేశం అతలాకుతలం అవుతోందని విమర్శించారు. తన వైఫల్యానికి ప్రధాని ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
Advertisement