సాధారణ రోగుల నడుమ కరోనా బాధితుడికి వైద్యం

ABN , First Publish Date - 2020-03-30T10:56:27+05:30 IST

కరోనా వ్యాప్తితో సాధారణ ప్రజల్లో ప్రాణ భయం కనిపిస్తోంది. కానీ ఆ వైరస్‌ గురించి కాస్త ఎక్కువ పరిజ్ఞానం ఉన్న అధికారులు, వైద్యుల్లో మాత్రం నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది.

సాధారణ రోగుల నడుమ కరోనా బాధితుడికి వైద్యం

కనీస భద్రత పాటించని వైద్యులు, సిబ్బంది

వ్యాధి నిర్ధారణ అయ్యాక అందరిలో గుబులు

హోం క్వారంటైన్‌కి వైద్యులు, పీజీలు


కర్నూలు, మార్చి 29(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తితో సాధారణ ప్రజల్లో ప్రాణ భయం కనిపిస్తోంది. కానీ ఆ వైరస్‌ గురించి కాస్త ఎక్కువ పరిజ్ఞానం ఉన్న అధికారులు, వైద్యుల్లో మాత్రం నిర్లక్ష్యం పరాకాష్టకు చేరింది. కరోనా అనుమానితులతో వారు వ్యవహరిస్తున్న తీరు ఇందుకు అద్దం పడుతోంది. తొలి పాజిటివ్‌ కేసుగా మారిన వ్యక్తికి వైద్యం అందించడంలో పూర్తిస్థాయి నిర్లక్ష్యం నివ్వెరపరుస్తోంది. కలెక్టర్‌ వీరపాండియన్‌ ఒత్తిడి తెచ్చేదాకా బాధితుడికి కరోనా పరీక్షలు చేయించ లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో బాధితుడిని కర్నూలు పెద్దాసుపత్రిలోని ఎమ్‌ఎమ్‌ 3 వార్డులో చేర్చారు. మూడు రోజులు అక్కడే ఉంచి చికిత్స చేశారు. పాజిటివ్‌ అని తేలడంతో చికిత్స చేసిన వైద్యుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఇద్దరు సీనియర్‌ వైద్యులు, ఇద్దరు పీజీలకు సెలవు మంజూరు చేశారు. ఈ వార్డులో ఓ మహిళా ఉద్యోగి బాధితుడికి సేవలు అందించారు. కొందరు నర్సింగ్‌ విద్యార్థులు రోజువారీ సేవల్లో పాల్గొన్నారు.


తప్పెవరిది..?

కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి పట్ల ముందు నుంచి వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో సహా ఆసుపత్రి వర్గాలను కలెక్టర్‌ ఆదేశించారు. అప్పటికిగానీ కదలిక రాలేదు. ఆ తరువాత జరిగిన వ్యవహారంపైన ఉన్నతాధికారులను వైద్యులు నిలదీసినట్లు తెలిసింది. దీంతో కనీస భద్రత పాటించాల్సిన బాధ్యత మీదేనని ఓ ఉన్నతాధికారి తేలిపోయినట్లు సమాచారం. ఆ తరువాతే వైద్యులు, పీజీలకు సెలవులు ఇచ్చారు. అందరూ హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వారితోపాటు సిబ్బంది, నర్సింగ్‌ విద్యార్థులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పాజిటివ్‌ కేసుకు సేవలు అందించిన మహిళా ఉద్యోగి సైతం తన పరిస్థితి ఏమిటని ఉన్నతాధికారులను అడిగినట్లు తెలిసింది.


ఇంత నిర్లక్ష్యమా..?

జిల్లాలో తొలి పాజిటివ్‌ కేసుగా నమోదైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి ఈ నెల 5న తన సొంత రాష్ట్రం రాజస్థాన్‌కు, అక్కడి నుంచి ఆగ్రాకు వెళ్లి ఈ నెల 19న తిరిగి వచ్చాడు. కరోనా లక్షణాలు కనిపించడంతో స్థానికులు సమాచారం ఇచ్చారు. ఈ నెల 24న పెద్దాసుపత్రికి తరలించారు. పాజిటివ్‌గా కేసు నిర్ధారణ అయ్యేంత వరకు (27వ తేదీ) ఎంఎం 3 వార్డులో ఉంచారు. ఊపిరితిత్తుల రోగులనూ అక్కడే ఉంచి వైద్యం చేశారు.


బాధితుడు చేరాక ఆరుగురు సాధారణ రోగులు ఆ వార్డులో అడ్మిట్‌ అయినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. సాధారణ రోగుల మధ్య, ఆ వార్డుకు కేటాయించిన వైద్యులతోనే కరోనా బాధితుడికి చికిత్స చేయించారు. ఆ మూడు రోజులు మూడు షిఫ్టుల్లో మొత్తం 23 మంది వైద్యులు, సిబ్బంది వార్డులో విధులు నిర్వహించారు. కరోనా అనుమానితుడు ఉన్నా వైద్యశాఖ ఉన్నతాధికారులు కనీస భద్రతా చర్యలు తీసుకోలేదు. వైద్యులకు తగిన సూచనలు ఇవ్వలేదు. వార్డు సిబ్బంది కూడా సాధారణ రోగికే సేవలందించినట్లే వ్యవహరించారు. ఆ వ్యక్తికి పాజిటివ్‌ రావడంతో వీరందరి పరిస్థితిపై ఆందోళన వ్యక్తమౌతోంది. 


Updated Date - 2020-03-30T10:56:27+05:30 IST