గుండె మండుతోంది

ABN , First Publish Date - 2021-12-06T07:23:10+05:30 IST

గుండె మండుతోంది

గుండె మండుతోంది

ఉద్యోగులమా? యాచకులమా?

జీతాలివ్వకపోతే బతికేదెలా?.. అద్దెలు, ఈఎంఐలు కట్టేదెవరు?

మెడికల్‌ బిల్లులు ఇవ్వడం లేదు

పీఎఫ్‌ డబ్బులకూ దిక్కులేదు

ఉద్యోగుల పరువు పోతోంది

ఈ ప్రభుత్వం తెగేదాకా లాగుతోంది 

మేం కన్నెర్ర చేస్తే ఏమవుతారు? 

సర్కారుపై ఉద్యోగ నేతల మండిపాటు 


ఈ ప్రభుత్వం తీరు చూస్తుంటే గుండె మండిపోతోంది. ఉద్యోగులం అనుకుంటున్నారా? యాచకులమనుకుంటున్నారా? ప్రభుత్వ పథకాలు అమలు చేసే మాకు ప్రతినెలా ఏ తేదీన జీతాలిస్తారో కూడా తెలియని అయోమయ స్థితిలోకి నెట్టేస్తారా? మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్‌ అధికారులు జీతాలు తీసుకోవడం లేదా? తమ విలాసాలకు ప్రభుత్వ సొమ్ము ఠంచనుగా డ్రా చేసుకోవడం లేదా? ఉద్యోగులకే ఇలాంటి పరిస్థితి కల్పించడమేంటి?.. అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

ప్రభుత్వ పెద్దల కన్నెర్రకు గురవుతామని ఇప్పటి వరకూ తప్పించుకు తిరిగిన ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. బహిరంగంగానే ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. ఇన్నాళ్లుగా ప్రభుత్వంతో అంటకాగిన ఉద్యోగ సంఘాలు సైతం ఇప్పుడు ప్రశ్నించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అలాంటి ఉద్యోగ సంఘ నేతలు బాహాటంగా కాకపోయినా ప్రైవేటు సంభాషణల్లో తమ అశక్తతను ఉద్యోగులతో పంచుకుంటున్నారు. పలు అంతర్గత సమావేశాల్లో కట్టుదాటి మాట్లాడుతున్నారు. పీఆర్సీ ప్రకటించకుండా మూడేళ్ల పాటు తాత్సారం చేసి, ఇవ్వాల్సిన డీఏలు ఇవ్వకుండా, ఉద్యోగుల హక్కులు అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నారని ఉద్యోగులు మండిపడుతున్నారు. పీఆర్సీపై పిల్లిమొగ్గలు వేస్తున్నారని, మూడేళ్లయినా నివేదిక వెల్లడి చేయడంలేదని విమర్శిస్తున్నారు. పీఆర్సీ కమిషన్‌ ఇచ్చిన సిఫారసుల నివేదికను బహిర్గతం చేసేందుకు ఉన్న అభ్యంతరమేంటని, ప్రభుత్వానికి ఉద్యోగులంటే చిన్నచూపు అనడానికి ఇదే ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. చివరకు ఒకటో తేదీకి జీతాలొస్తే చాలన్న భావనకు ఉద్యోగులను తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో జీతాలివ్వకపోవడంతో బ్యాంకుల్లో ఈఎంఐలకు జరిమానాలు చెల్లించాల్సి వస్తోందని, అద్దెలు సకాలంలో చెల్లించలేక పలువురు ఉద్యోగులు వడ్డీలకు అప్పులు చేయాల్సి వస్తోందంటున్నారు. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు దక్కాల్సిన మెడికల్‌ బిల్లులు మంజూరు చేయకుండా అడ్డుకుంటున్నారని, చివరకు బిల్లును సీఎ్‌ఫఎంఎ్‌సలో పెట్టి తిప్పుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. తమకు రావాల్సిన పీఎఫ్‌ డబ్బులు సైతం ఇవ్వకుండా తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఉద్యోగులూ ఓటర్లే...  

ఎందరో సీఎంలను, ఎన్నో ప్రభుత్వాలను చూశామని... రాష్ట్రంలో ఇంత అథోగతి ఎప్పుడైనా ఏర్పడిందా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు కన్నెర్ర చేస్తే ప్రభుత్వాలు ఏమవుతాయంటూ నిలదీస్తున్నారు. రిటైర్‌ అయినవారికి ప్రయోజనాలు ఇవ్వడంలో మితిమీరిన జాప్యం వల్ల వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారంటున్నారు. పిల్లల పెళ్లిళ్లు, ఇళ్లు నిర్మించుకోవడానికి దాచుకున్న సొమ్ము కూడా ఇవ్వకుండా నెలల పాటు జాప్యం చేసి ఉద్యోగుల ఓపికను పరీక్షిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు కూడా ఓటర్లేనని... 13 లక్షల ఉద్యోగుల కుటుంబాల ఆగ్రహాలకు గురైన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని హెచ్చరిస్తున్నారు. సంక్షేమ పథకాల పేరిట ప్రజల అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ చేస్తున్న ప్రభుత్వానికి... ఉద్యోగుల బాధలు పట్టవా అని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ముందు సీఎం జగన్‌ ఉద్యోగులకిచ్చిన హామీలను ఒక్కసారి పునఃసమీక్షించాలని కోరుతున్నారు. ఉద్యోగుల విశ్వాసాన్ని పొగొట్టుకున్న ప్రభుత్వాలు ప్రజల విశ్వాసాన్నీ పొందలేవని, ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగమని గుర్తుంచుకోవాలని పేర్కొంటున్నా రు. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులంటే పరువు, ప్రతిష్ఠ, పరపతి ఉండేవని, ఇప్పుడు పచారీ కొట్టు దగ్గర నుంచి పాల వ్యాపారుల వరకు తమను జాలిగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ సలహాదారులకు మాత్రం లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నారని, ఉద్యోగులు మాత్రం జీతాల కోసం నెలంతా ఎదురుచూడాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. విధి లేని పరిస్థితిలోనే తాము రోడ్డెకాల్సి వచ్చిందని, ఈ ప్రభుత్వం తెగేదాకా లాగుతోందని మండిపడుతున్నారు.

Updated Date - 2021-12-06T07:23:10+05:30 IST