నకిలీ విత్తన మాయగాళ్ల ఎత్తులు

ABN , First Publish Date - 2021-06-16T09:51:55+05:30 IST

నకిలీ విత్తన దందాలో ఆరితేరిన ఓ వ్యక్తి.. హైదరాబాద్‌లో ఉంటూ కొంతకాలం లావాదేవీలు సాగించాడు.

నకిలీ విత్తన మాయగాళ్ల ఎత్తులు

  • ఒకచోట పట్టుబడితే మరోచోటకు మకాం మార్పు
  • వేరే పేరుతో లైసెన్సు.. యథేచ్ఛగా లావాదేవీలు
  • గోదాముల్లో కాకుండా.. అపార్ట్‌మెంట్‌లలో నిల్వ

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 15(ఆంధ్రజ్యోతి): నకిలీ విత్తన దందాలో ఆరితేరిన ఓ వ్యక్తి.. హైదరాబాద్‌లో ఉంటూ కొంతకాలం లావాదేవీలు సాగించాడు. కర్నూలు జిల్లా, కర్ణాటక రాష్ట్రాల నుంచి నకిలీ పత్తి, మిర్చి విత్తనాలు తీసుకొచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు అమ్ముతూ బాగా సంపాదించాడు. ఈ క్రమంలో 2017లో రాచకొండ పోలీసులకు చిక్కాడు. అతడిపై సీపీ మహేష్‌ భగవత్‌ పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే, ఏడాది తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన ఆ వ్యక్తి మకాం ను సూర్యాపేట జిల్లాకు మార్చాడు. వేరే పేరుతో విత్తన లైసెన్స్‌ పొందా డు. హైదరాబాద్‌ అడ్డాగా సాగించిన నకిలీ దందాను సూర్యాపేట జిల్లా నుంచి చేయడం ప్రారంభించాడు. సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మం జిల్లా ల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తూ వారం క్రితం సూర్యాపేట జిల్లా పోలీసులకు చిక్కాడు. ఆరా తీయగా.. 2017లో రాచకొండ పోలీసులకు చిక్కిన వ్యక్తి.. ఇతడు ఒక్కరేనని తేలింది. ఏడాది జైలు శిక్ష అనుభవించి వచ్చినా.. అతడి తీరు మారలేదని విచారణలో తేలింది. పైగా మరింత విస్తృతంగా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు స్పష్టమైంది.


గోదాముల్లో అయితే దొరికిపోతామని..

నకిలీ విత్తన దందారాయుళ్లు ఇదివరకు ఇతర రాష్ట్రాల నుంచి అక్రమం గా తరలించిన నాసిరకం విత్తనాలను శివారు ప్రాంతాల్లో ఉన్న గోదాముల్లో నిల్వ ఉంచేవారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తుండటం, పోలీసులు, వ్యవసాయ అధికారులు తరచూ దాడు లు చేస్తుండటంతో పంథా మార్చారు. ఏడాది వరకు బయటకు వచ్చే వీలులేని పీడీ చట్టం కింద కేసు నమోదు చేస్తుండటంతో.. తెలివిగా వ్యవహస్తున్నా రు. నకిలీ విత్తనాలను ఇళ్లలోనే నిల్వ ఉంచుతున్నారు. ఇందుకు అపార్టుమెంట్లలో ఫ్లాట్లు అద్దెకు తీసుకుంటున్నారు. ఇటీవల హయత్‌నగర్‌లో పట్టుబడిన నిందితుడు నిల్వలను ముసారాంబాగ్‌లోని ఫ్లాట్‌లో ఉంచిన టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇకపై ప్రత్యేక దృష్టిసారిస్తామని నకిలీల ఆటకట్టిస్తామని సీపీ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు.


అనధికారిక విత్తన గోదాంపై దాడులు

అనధికారికంగా విత్తనాలు విక్రయిస్తున్న వ్యాపారిని నార్త్‌జోన్‌ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా నూతనకల్లు గ్రామంలోని ఓ గోదాంలో పి.శ్రీనివాసరావు అనే వ్యక్తి ఫార్చూన్‌ అగ్రి సీడ్స్‌ పేరిట దందా సాగిస్తున్నాడు. దీనిపై సికింద్రాబాద్‌కు చెందిన వంజరపు ఆంజనేయులు (49) ఫిర్యాదు చేశాడు. అమాయకు రైతులను మోసం చేస్తూ అనధికారిక విత్తనాలు విక్రయిస్తున్నాడని పేర్కొన్నాడు.  అతడి ఫిర్యాదు మేరకు వ్యవసాయ అధికారులతో కలిసి పోలీసులు దాడులు నిర్వహించారు. తనిఖీలు చేసి రూ.24 లక్షల విలువైన విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - 2021-06-16T09:51:55+05:30 IST