చర్ల ఎన్‌కౌంటర్‌ మృతదేహాలను ఫ్రీజ్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2020-09-24T21:36:12+05:30 IST

చర్ల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు విచారించింది. చనిపోయిన ముగ్గురు మృతదేహాలను ఫ్రీజ్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రఘునాథ్ కోరారు.

చర్ల ఎన్‌కౌంటర్‌ మృతదేహాలను ఫ్రీజ్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: చర్ల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు విచారించింది. చనిపోయిన ముగ్గురు మృతదేహాలను ఫ్రీజ్ చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది రఘునాథ్ కోరారు. ఇప్పటికే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కుటుంబ సభ్యుల నుంచి మృతదేహాలను తీసుకుని, కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రిలో ఫ్రీజ్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఎంజీఎం ఫోరెన్సిక్ నిపుణులతో రీపోస్టుమార్టం చేయించాలని న్యాయస్థానం ఆదేశించింది. పోస్టుమార్టం మొత్తం వీడియో గ్రఫీ చేయించి.. రిపోర్ట్ షీల్డ్ కవర్‌లో సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 5కు హైకోర్టు వాయిదా వేసింది. 


చర్ల ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరిపించాలంటూ పౌర హక్కుల సంఘం ఈ లంచ్ మోషన్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది. ముగ్గురు మృతదేహాలను ఫ్రీజ్ చేయాలని పిటీషనర్ కోరారు. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 కేసు నమోదు చేయాలన్నారు. మృతదేహాలను వరంగల్ ఎంజీఎం, ఉస్మానియా ఆసుపత్రికి తరలించాలని.. మృత దేహాలకు ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేపించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. 


చర్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు  నక్సల్స్‌ చనిపోయారు. ఈ విషయాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ ధ్రువీకరించిన విషయం తెలిసిందే. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలోని గుట్టల వద్ద బుధవారం రాత్రి 7గంటల సమయంలో భద్రాద్రి జిల్లా పోలీసు బలగాలకు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అనంతరం సంఘటనా స్థలం వద్ద తనిఖీ చేయగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభించాయి. చనిపోయినవారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో పోలీసులు ఒక 8ఎంఎం రైఫిల్‌, బ్లాస్టింగ్‌ సామగ్రి, ఒక కిట్‌బ్యాగు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-09-24T21:36:12+05:30 IST