కరోనా కాటుకు 97 మంది బలి

ABN , First Publish Date - 2020-08-09T09:16:00+05:30 IST

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతి జిల్లాలోనూ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 2లక్షలు దాటగా... మరణాలు

కరోనా కాటుకు 97 మంది బలి

  • ఒక్కరోజులో అత్యధిక మరణాలు
  • 13 జిల్లాల్లోనూ మృత్యుఘోష.. రికార్డు స్థాయిలో కరోనా కల్లోలం 
  • రాష్ట్రంలో 1939కి చేరిన మృతులు.. కొత్త కేసులు 10,080 నమోదు 
  • మొత్తం పాజిటివ్‌లు 2,17,040.. 30 వేల మార్కు దాటిన ‘తూర్పు’ 
  • ‘అన్నవరం’లో 39 మందికి వైరస్‌.. 14 వరకు దర్శనాలు బంద్‌


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌) 

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రతి జిల్లాలోనూ బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 2లక్షలు దాటగా... మరణాలు 2వేలకు చేరువయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకూ 24గంటల వ్యవధిలోనే అత్యధికంగా 97మంది మరణించారు. గుంటూరులో 14మంది, అనంతపురంలో 11మంది, కర్నూలు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 10మంది చొప్పున, చిత్తూరు, నెల్లూరుల్లో ఎనిమిది మంది చొప్పున, ప్రకాశం, శ్రీకాకుళంలలో ఏడుగురు చొప్పున, తూర్పుగోదావరిలో ఆరుగురు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఐదుగురు చొప్పున, కృష్ణాజిల్లాలో నలుగురు, కడపలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.


రాష్ట్రంలో ఇప్పటి వరకూ 1,939కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజాగా మరో 10,080మంది కొవిడ్‌ బారిన పడినట్లు ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో మొత్తం పాజిటివ్‌లు 2,17,040కు చేరాయి. తాజాగా మరో 9,151మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 1,29,615 మంది డిశ్చార్జి అయ్యారు. శనివారం కర్నూలులో 1,353, పశ్చిమ గోదావరి జిల్లాలో 1,213, అనంతలో 976, చిత్తూరులో 943, నెల్లూరులో 878, గుంటూరులో 601, కడపలో 525, శ్రీకాకుళంలో 442, కృష్ణా జిల్లాలో 391 చొప్పున కొత్త కేసులు వెలుగు చూశాయి. 


అన్నవరం దేవస్థానంలో కలకలం 

తూర్పుగోదావరి జిల్లాలో మరో 1,310మంది కరోనా బారిన పడ్డారు. దీంతో జిల్లాలో మొత్తం కేసులు 30,160కి చేరాయి. అన్నవరం పుణ్యక్షేత్రంలో పనిచేస్తున్న 300మంది ఉద్యోగులకు శనివారం పరీక్షలు నిర్వహించగా 39మంది సిబ్బందికి కొవిడ్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఈ నెల 14వరకు దర్శనాలు నిలుపుదల చేయనున్నట్లు ఈవో త్రినాథరావు వెల్లడించారు. స్వామివారికి నిత్య కైంకర్యాలు ఏకాంతంగా నిర్వహిస్తామన్నారు. 


మరణాల్లో మరో రికార్డు

రాష్ట్రంలో కొవిడ్‌ వ్యాప్తి ప్రారంభమైన నాటినుంచి ఒక్కరోజులోనే ఈ స్థాయిలో మరణాలు నమోదైన దాఖలాలు లేవు. శుక్రవారం 89మంది మృతిచెందడమే అత్యధికం అనుకుంటే... ఇప్పుడు ఆ రికార్డును కూడా కరోనా తుడిచిపెట్టేసింది. రానున్న రోజుల్లో మరణాల సంఖ్య మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చేవారం నుంచి సెంచరీల మోత మోగడం ఖాయమని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. కర్నూలు, గుంటూరులో రోజూ దాదాపు 10మంది వరకూ బలవుతున్నారు. ప్రస్తుతం అత్యధిక మరణాలు(238) నమోదైన జిల్లాగా కర్నూలు మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత గుంటూరు జిల్లా (211) రెండోస్థానంలో, కృష్ణాజిల్లా(208) మూడోస్థానంలో ఉన్నాయి. కడప, నెల్లూరు, విజయనగరం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో మరణాలు వంద మార్కును దాటాయి. కానీ ఈ మూడు జిల్లాల్లో స్థానికంగా విడుదల చేసిన లెక్కల ప్రకారం అక్కడ కూడా వందకు పైగానే కరోనా మరణాలు నమోదయ్యాయి.

Updated Date - 2020-08-09T09:16:00+05:30 IST