వేలం పాటకు విశేష స్పందన

ABN , First Publish Date - 2022-03-15T05:54:45+05:30 IST

రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల వేలానికి విశేష స్పందన లభించింది.

వేలం పాటకు విశేష స్పందన
వేలంలో ప్లాటు దక్కించుకున్న వ్యక్తికి ధ్రువపత్రాన్ని అందిస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ యాస్మిన్‌బాషా

- పాల్గొన్న 350 మంది  

- అత్యధికంగా గజానికి రూ.13,500 ధర 

- ముఖ్యఅతిథిగా ఇన్‌చార్జి కలెక్టర్‌ యాస్మిన్‌బాషా

గద్వాల క్రైం, మార్చి 14 : రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల వేలానికి విశేష స్పందన లభించింది. జిల్లాకేంద్రంలోని బృందావన్‌ గార్డెన్‌ ఫంక్షన్‌ హాలులో మొదటి రోజు సోమవారం నిర్వహించిన వేలం పాటకు 350 మంది వచ్చారు. ప్రభుత్వం గజానికి రూ. 5,500గా ధర నిర్ణయించింది. వేలంలో ప్లాట్లను దక్కించుకునేందుకు ప్రజలు పోటీ పడ్డారు. తొలిరోజు 58 ప్లాట్లకు వేలం నిర్వహించారు. టోకెన్‌ నెంబర్‌ 260కి సంబంధించిన వ్యక్తి గజానికి రూ.13,500 వేలం పాడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. వేలంలో ప్లాట్లను దక్కించుకున్న వారికి అధికారులు ధ్రువపత్రాలను అందించారు. 


రాజీవ్‌ స్వగృహ ప్లాట్లు ప్రజలకు అనుకూలం

రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ (అంబర్‌ టౌన్‌షిప్‌) ప్లాట్లు అనుకూలంగా ఉన్నాయని ఇన్‌చార్జి కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల వేలం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేలం మూడు రోజుల పాటు కొనసాగుతుందన్నారు. సోమవారం 58 ప్లాట్లకు వేలం నిర్వహించగా, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు వరకు 28 ప్లాట్లు, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 30 ప్లాట్లను విక్రయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ శ్రీహర్ష, ఆర్‌డీవో రాములు, మునిసిపల్‌ కమిషనర్‌ జానకి రామ్‌సాగర్‌, అఽధికారులు పాల్గొన్నారు.


ఆంగ్ల మాధ్యమంపై పట్టు సాధించాలి

ఉపాధ్యాయులందరూ ఆంగ్లమాధ్యమంపై పట్టు సాధించాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ యాస్మిన్‌బాష అన్నారు. మన ఊరు మన బడి - మన బస్తీ మన బడి కార్యక్రమంపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్‌ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాభోదనను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి ఇన్‌చార్జి కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా మాట్లాడుతూ ఆంగ్ల మాధ్యమంపై మొదటి విడతలో 1,015 మంది ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు గద్వాలలోని ప్రభుత్వ ప్రాక్టిసింగ్‌ హైస్కూల్‌లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. మన ఊరు మన బడి- మన బస్తీ మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 161 పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు త్వరలో బ్యాంక్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయించాలని, శిక్షణకు సంబంధించిన కరపత్రాలను అందించాలని అధికారులను కోరారు. కాన్ఫరెన్స్‌లో ఇన్‌చార్జి డీఈవో రామకృష్ణ, సెక్టోరియల్‌ అధికారి హంపయ్య, కేఆర్పీలు సౌమ్య, సుమలత, మైకేల్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-15T05:54:45+05:30 IST