కొండంత కష్టం

ABN , First Publish Date - 2020-06-02T08:42:16+05:30 IST

ఈకేవైసీ గిరిజనుల పాలిట శాపంగా మారింది. నెట్‌వర్క్‌ సిగ్నల్‌ కోసం పదుల కిలోమీటర్లు అడవులు, కొండలు

కొండంత కష్టం

గిరిజనానికి ఈకేవైసీ ఇబ్బందులు

కొండలు, వాగులు, అడవులు దాటి సిగ్నల్‌ ఉండే ప్రదేశాలకు...

పిల్లాజెల్లాతో కలిసి నడక

పదుల కిలోమీటర్లు వెళ్లి ప్రక్రియ పూర్తి

బియ్యం కార్డులకు తిప్పలు 


కొయ్యూరు, జూన్‌ 1: ఈకేవైసీ గిరిజనుల పాలిట శాపంగా మారింది. నెట్‌వర్క్‌ సిగ్నల్‌ కోసం పదుల కిలోమీటర్లు అడవులు, కొండలు ఎక్కాల్సి వస్తోంది. వలంటీర్లు వీరిని సిగ్నల్‌ వుండే ప్రదేశాలకు తీసుకువెళ్లి ఈకేవైసీ చేయిస్తున్నారు. దీంతో గిరిజనులు పిల్లాజెల్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే...


ప్రభుత్వం నూతనంగా పంపిణీ చేస్తున్న బియ్యం కార్డులు అందినట్టుగా తగిన రశీదు పొందేందుకు ఈకేవైసీ చేయాలి. ఆన్‌లైన్‌లో ఈకేవైసీ చేసేందుకు వలంటీర్లు సిగ్నల్‌ వుండే ప్రదేశాలకు కుటుంబ సభ్యులను తీసుకువెళుతున్నారు. ఇందుకు కొండలు, అడవులు దాటి వెళ్లాల్సి వస్తోంది. కుటుంబంలోని అందరు సభ్యులు ఈకేవైసీ చేయాల్సి వుండడంతో పిల్లాజెల్లలతో కలిసి పదుల కిలోమీటర్లు నడిచి వెళుతూ ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 33 పంచాయతీల పరిధిలో 15,675 రేషన్‌ (బియ్యం) కార్డులు ఉన్నాయి. వీటిని ఆయా పంచాయతీల వలంటీర్లు ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయిస్తున్నారు. కార్డులు లబ్ధిదారులకు అందినట్టు ఆన్‌లైన్‌లో ఈకేవైసీ చేస్తున్నారు. ఇందుకు నెట్‌వర్కు సిగ్నల్‌ ఉండాలి.


అయితే మండలంలో బూదరాళ్లు, మఠంభీమవరం, యు.చీడిపాలెం పంచాయతీలలోని 65 గ్రామాలతోపాటు కొమ్మిక, డౌనూరు, మూలపేట, నల్లగొండ, తదితర మరో ఎనిమిది పంచాయతీలకు చెందిన 40 గ్రామాలకు ఈకేవైసీ చేసేందుకు నెట్‌వర్కు ఉండదు. దీంతో సిగ్నల్‌ వున్న ప్రదేశాలకు అడవులు దాటుకుంటూ గిరిజనులు కుటుంబాలతో సహా కిలోమీటర్లు నడిచి వెళ్లి...గంటల తరబడి నిరీక్షిస్తూ.. ప్రయాసలపావుతూ బియ్యం కార్డులు పొందుతున్నారు. దీంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై తహసీల్దారు శ్రీధర్‌ దృష్టికి తీసుకురాగా.. నిబంధనల మేరకు ఈకేవైసీ తప్పనిసరని, ఇందుకు సిగ్నల్‌ వున్న ప్రాంతాలకు ప్రజలు రాక తప్పదన్నారు.

Updated Date - 2020-06-02T08:42:16+05:30 IST