అసలేంటీ ఈ పులిట్జర్‌ పురస్కారం.. ఎందుకింత ప్రాముఖ్యం..

ABN , First Publish Date - 2021-06-12T17:21:07+05:30 IST

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాల్లో ఒకటిగా పులిట్జర్‌ ప్రైజ్‌లను కూడా భావిస్తుంటారు. ఈ పురస్కారాలను గెలుచుకున్న వారికి సమాజంలో గౌరవం కూడా అత్యున్నత స్థాయిలోనే ఉంటుంది.

అసలేంటీ ఈ పులిట్జర్‌ పురస్కారం.. ఎందుకింత ప్రాముఖ్యం..

అమెరికాలో ఓ శ్వేతజాతి పోలీస్ ఉన్నతాధికారి తన మోకాలితో ఓ నల్లజాతీయుడైన జార్జి ఫ్లాయిడ్‌ గొంతుపై నొక్కి చంపిన ఘటన గుర్తుందా..? ‘ప్లీజ్.. ఊపిరి ఆడటం లేదు’ అంటూ ఆ నల్లజాతీయుడు వేడుకున్నప్పటికీ అతడు కనికరించలేదు. ఈ ఒక్క ఫొటోయే అమెరికాలో అల్లకల్లోలాన్ని రేపింది. నల్లజాతి హక్కులను మరోసారి తెరపైకి తెచ్చింది. యావత్ అమెరికా ఈ ఘటనను ఖండించింది. ఆ ఘటనకు సంబంధించిన ఫొటో తాజాగా మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. 


అతడికి 84 ఏళ్లు.. ఆమెకు 81 ఏళ్లు.. దాదాపు 60 ఏళ్ల సంసార జీవితం వారిది. ఎప్పుడూ రోజుల తరబడి చూసుకోకుండా దూరంగా లేరు. కరోనా కారణంగా వారి మధ్య ఎడబాటు ప్రవేశించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 102 రోజుల పాటు ఇద్దరూ కరోనా కారణంగా క్వారంటైన్‌లో గడిపారు. ప్రతీక్షణం జీవిత భాగస్వామి గురించే వారిద్దరిలో ఆలోచన. అందుకే ఓ ఆలోచన చేశారు. ఓ ప్లాస్టిక్ చాపను మధ్యలో కట్టారు. చెరోవైపు కుర్చీ వేసుకున్నారు. ఇద్దరూ మనస్ఫూర్తిగా హత్తుకున్నారు. ముద్దు పెట్టుకున్నారు. ఎడబాటును తలచుకుని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఫొటోను చూస్తే కట్టుకున్న భార్యాభర్తలను కూడా విడదీసిన కరోనా మహమ్మారిని తిట్టుకోకుండా ఉండలేరు. అందుకే అందరికీ ఈ ఫొటో కూడా కనెక్ట్ అయింది. ది అసోసియేటెడ్‌ ప్రెస్‌(ఏపీ)కి చెందిన ఓ ఫొటో జర్నలిస్ట్ తీసిన ఈ ఫొటో తాజాగా పులిట్జర్ ఫ్రైజ్‌కు ఎంపిక అయింది. ఈ రెండు ఫొటోలను చూసిన తర్వాత, వాటి వెనుక ఉన్న కథేంటో తెలిసిన తర్వాత అసలేంటీ ఈ పులిట్జర్ పురస్కారం అనే అనుమానం రాకుండా ఉండదు. అసలు ఈ పురస్కారాలను ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారు? అన్న విషయాల్లోకి వెళ్తే..


ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాల్లో ఒకటిగా పులిట్జర్‌ ప్రైజ్‌లను కూడా భావిస్తుంటారు. ఈ పురస్కారాలను గెలుచుకున్న వారికి సమాజంలో గౌరవం కూడా అత్యున్నత స్థాయిలోనే ఉంటుంది. జోసెఫ్ పులిట్జర్ అనే వార్తాపత్రిక ప్రచురనకర్త రాసుకున్న వీలునామా వల్ల ఈ పులిట్జర్ ప్రైజ్ అనేది మొదలయింది. ఆయన 1911వ సంవత్సరం అక్టోబర్ 29వ తారీఖున మరణించాడు. ఆయన మరణించిన తర్వాతే ఈ వీలునామా బయటపడింది. ‘కొలంబియా యూనివర్శిటీలో ఓ జర్నలిజం స్కూలును ప్రారంభించాలన్నది నా అభిలాష. జర్నలిజంలో వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి ‘పులిట్జర్ ప్రైజ్’ పేరుతో అవార్డులు ఇచ్చి సత్కరించండి. అందుకుగానూ నా ఆస్తిలో రెండు లక్షల 50వేల డాలర్ల రూపాయలను కేటాయిస్తున్నాను’ అంటూ తన వీలునామాలో పులిట్జర్ పేర్కొన్నాడు. దాదాపు 110 ఏళ్ల క్రితం జరిగిందీ ఈ ఘటన. 


జోసెఫ్ పులిట్జర్ మరణానంతరం మొదటిసారిగా 1917వ సంవత్సరం జూన్ 4వ తారీఖున పులిట్జర్ బహుమతులను ప్రకటించారు. ప్రస్తుతం ప్రతి యేటా 21 కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రకటిస్తున్నారు. అవార్డును గెలుచుకున్న వారికి 15వేల డాలర్ల నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రాన్ని కూడా అందజేస్తారు. పబ్లిక్ సర్వీస్ కేటగిరీలో అవార్డులను గెలుచుకున్న వారిని మాత్రం గోల్డ్ మెడల్‌తో సత్కరిస్తారు. ఈ పులిట్జర్ ప్రైజులను గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. తమ రచనలు, ఫొటోలు వంటి వాటిని ఈ పులిట్జర్ ప్రైజుల కోసం ఎంట్రీలుగా అభ్యర్థులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 75 డాలర్ల ఎంట్రీ ఫీజును కూడా చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు 102 మంది న్యాయమూర్తులు 20 జ్యూరీలుగా ఏర్పడి ఈ అవార్డులకు ఫైనలిస్టులను ఎంపిక చేస్తారు. ఒక్కో జ్యూరీలో ఐదుగురు సభ్యులు ఉంటారు. పబ్లిక్ సర్వీస్, ఇన్వెస్టిగేటివ్ రిపోర్టింగ్, ఫీచర్ రైటింగ్, కామెంటరీ, పుస్తకాలు, లేఖలు, సంగీతం, ఫొటోలు.. వంటి పత్రికా రంగానికి చెందిన 21 విభాగాల్లో విజేతలను ఈ జ్యూరీ సభ్యులు ఎంపిక చేస్తారు. కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఏదైనా విభాగంలో అవార్డుకు అర్హత లేని ఎంట్రీలు కనుక వస్తే అసలు విజేతను ప్రకటించరు కూడా. ప్రతీ అవార్డు విభాగానికి జ్యూరీ మూడు నామినేషన్లను ఫైనలిస్టులుగా ఎంపిక చేస్తారు. మెజార్టీ ఓటు ద్వారా విజేతను ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతీ జ్యూరీ చైర్మన్‌కు 2500 డాలర్లను వేతనంగా ఇస్తారు. జ్యూరీ సభ్యులైన న్యాయమూర్తులకు 2000 డాలర్ల గౌరవ వేతనం అందుకుంటారు.



Updated Date - 2021-06-12T17:21:07+05:30 IST