నేటి నుంచి పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం

ABN , First Publish Date - 2021-04-14T05:58:01+05:30 IST

ముస్లింలు ఆచరించే ఉపవాస దీక్ష (రోజా)ల పవిత్ర రంజాన్‌ మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది.మంగళవారం రాత్రి నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలు బుధవారం ఉదయం నుంచి ఉపవాసాలు ఉంటారు.

నేటి నుంచి పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం

ముస్లింల ఉపవాస దీక్షలు 

కరీంనగర్‌ కల్చరల్‌, ఏప్రిల్‌13: ముస్లింలు ఆచరించే ఉపవాస దీక్ష (రోజా)ల పవిత్ర రంజాన్‌ మాసం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మంగళవారం రాత్రి నెలవంక దర్శనమివ్వడంతో ముస్లింలు బుధవారం ఉదయం నుంచి ఉపవాసాలు ఉంటారు. మంగళవారం మజీదుల్లో మతపెద్దలు సైర న్‌లు మోగించారు. ఐదుసార్లు నమాజ్‌ చేసుకునేందుకు ఆయా మసీదుల్లో ఏర్పాట్లు చేశారు. ఉపవాసానికి సంబంధించిన వస్తువులను కొనుగోలు చేశారు. దీంతో మార్కెట్‌లో సందడి నెలకొంది. రంజాన్‌ మాసంలో కఠిన ఉపవాసంతో పాటు ఐదు సార్లు నమాజ్‌ చేసి దివ్య ఖురాన్‌ను పఠిస్తారు. దానధర్మాలు చేస్తారు. ఈ మాసంలోనే పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ ఆవిర్భవించింది. జీవన మార్గదర్శక సూత్రాలను ఖురాన్‌ రూపంలో మానవాళికి మహమ్మద్‌ ప్రవక్త ద్వారా పంపబడ్డాయి. 


రోజా ప్రాముఖ్యత..


సూర్యోదయానికి ముందు తీసుకొనే భోజన పానీయాల్ని సహర్‌ అంటారు. సూర్యాస్తమయం అయిన వెంటనే ఉపవాసం విరమించేందుకు తినడాన్ని ఇఫ్తార్‌ అంటారు. కోరికలను జయించడం, ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడం రోజాలో భాగం. అందుకే ఖురాన్‌ ఉపవాసాన్ని సహనంగా అభివర్ణించింది. రోజా ఉండే వారు ఉపవాసాలతో పాటు ప్రతి దినం ఐదు పూటల నమాజ్‌ తప్పకుండా చేస్తారు. ఇషా నమాజు వేళలో ఫర్జ్‌ తర్వాత అదనంగా 20 రకాల తరావీహ్‌ నమాజ్‌ కూడా చేయాలి. తరావీహ్‌ నమాజ్‌ ద్వారా లోగడ చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ముస్లింలవిశ్వాసం. ఈ నమాజ్‌తోనే దివ్య ఖురాన్‌ పఠనం పూర్తి అవుతుంది. రంజాన్‌ నెలలో ఒక ఫర్జ్‌ ఆచరిస్తే అది 70 ఫర్జ్‌లతో సమానం.


కరోనా నిబంధనలు పాటించాలంటున్న నిపుణులు


ఈయేడు కూడా రంజాన్‌ మాసంలో కేసులు విజృంభిస్తుండడం, సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉంటుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రభుత్వం సామూహికంగా వేడుకలు, ఉత్సవాలు జరుపరాదని ఆదేశాలు జారీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది మాదిరిగా రంజాన్‌ వేడుకలు నిరాడంబరంగా జరుపుకోవాలని, సామూహిక ప్రార్థనల విషయంలో జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. అందరూ మాస్కులు తప్పనిసరిగా ధరించి భౌతిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. 


హరీస్‌ స్టాళ్లు ప్రారంభం

 రంజాన్‌ మాసం సందర్భంగా జిల్లా కేంద్రంలో హరీస్‌ స్టాళ్లు వెలిశాయి. రంజాన్‌ మాసం ప్రారంభమవడంతో నిర్వాహకులు విభిన్న రీతుల్లో స్టాళ్లను ఏర్పాటు చేశారు.  హైదరాబాదీ, అరబ్‌ వంటకాలను కూడా అందజేయనున్నట్లు స్టాళ్ల నిర్వాహకులు పేర్కొంటున్నారు. రాజీవ్‌చౌక్‌, కార్ఖానగడ్డ, ముకరంపుర, మార్కెట్‌ వంటి ప్రాంతాల్లో అమ్మకాలకు సిద్ధమయ్యారు.  స్టాళ్లలోనే తినేందుకు వీలు కల్పించడంతో పాటు ప్యాకేజీల రూపంలో పదార్థాలను పంపిణీ చేయనున్నారు. ఆయా హరీస్‌ స్టాళ్లను అందంగా ముస్తాబు చేశారు.

Updated Date - 2021-04-14T05:58:01+05:30 IST