ఆవిరైన నిరుద్యోగుల ఆశలు

ABN , First Publish Date - 2021-01-19T09:37:39+05:30 IST

తెలంగాణలో తాజాగా యాభైవేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఇది ఆచరణలో అమలవుతుందో...

ఆవిరైన నిరుద్యోగుల ఆశలు

తెలంగాణలో తాజాగా యాభైవేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. ఇది ఆచరణలో అమలవుతుందో లేదో అనేది సందేహమే. ఎప్పుడు లేనిది కేసీఆర్‌కు ఉన్నట్టుండి నిరుద్యోగుల మీద ఇంత ప్రేమ పుట్టుకు రావడానికి కారణం త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎన్నికలు, ముంచుకొస్తున్న ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి జరుగుతున్న తతంగమేమో అనిపిస్తోంది.


రాష్ట్ర విభజన ప్రక్రియలో తెలంగాణకు 5 లక్షలకు పైగా ఉద్యోగులుండాలి. కాని 2.90 లక్షల ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. దీనితో పాటు నెలకు 500 నుంచి వెయ్యి మంది వరకు ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారు. ఇలా ఆరు సంవత్సరాల కాలానికి నలబైవేలకు పైగానే ఖాళీలు ఏర్పడతాయి. పరిపాలన సౌలభ్యం కోసం అంటూ కేసీఆర్ ప్రభుత్వం అదనంగా 23 కొత్త జిల్లాలు, 31 రెవెన్యూ డివిజన్లు, 76 మున్సిపాలిటీలు, 130 మండలాలు, 4383 పంచాయతీలు, వంద కొత్త పోలీసుస్టేషన్లు, ఏడు పోలీస్‌ కమిషనరేట్లు ఏర్పడ్డాయి. వీటిలో వివిధ స్థాయిలలో 40 వేల ఉద్యోగులు అవసరం ఉంటుందని అంచనా. ఇలా అన్ని ఉద్యోగాలు కలుపుకుంటే మూడు లక్షలకు పైగానే రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు ఉంటాయి. ఇవి శాంక్షన్‌ పోస్టులు కాబట్టి ప్రత్యేకంగా నిధులు కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న ఖాళీలు భర్తీ చేయకపోవడంతో ఆయా శాఖలలో పది మంది ఉద్యోగులు ఉండాల్సిన చోట నలుగురు మాత్రమే ఉంటున్నారు. దీనితో పరిపాలనలో జాప్యం జరుగుతోంది. దీనికి తోడు కొత్త ఉద్యోగాల సంగతి ఏమోగానీ ఉన్న ఉద్యోగాలను ఉడగొడుతున్నారు. తెలంగాణలో కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను అందర్నీ పర్మినెంట్‌ చేస్తానని చెప్పి, నేడు వీళ్ళ ఉద్యోగాలకు కోత పెడుతున్నారు. ఇటీవల కాలంలో గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌, మిషన్‌ భగీరథ స్కీమ్ లలో జూనియర్‌ ఇంజనీర్లు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, హార్టికల్చర్‌లో గార్డెనింగ్‌, తదితర ఉద్యోగులను దాదాపుగా 20 వేల వరకు ప్రభుత్వం తగ్గించింది.


కరోనాను సాకుగా చూపి మరిన్ని ఉద్యోగాలకు కోత పెట్టే ప్రయత్నం చేసింది. తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ ఆలోచనను విరమించుకుంది. ఇప్పటికే ప్రైవేటు రంగంలో కరోనా కారణంగా ఐదు లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయినట్లు అంచనా. ఎన్నికల సమయంలో ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ. 3016 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి రెండేళ్లు అవుతున్నా ఆ హామీ నెరవేర్చలేదు.


ఇప్పటికైనా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నింటినీ వెంటనే భర్తీ చేయాలి. ప్రయివేటు రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలి. లేకపోతే నిరుద్యోగుల నుంచి పెద్దఎత్తున నిరసన సెగ తగలక తప్పదు.

ఆర్‌.ఎల్‌. మూర్తి

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు

Updated Date - 2021-01-19T09:37:39+05:30 IST