పేదల ఆశలు ఆవిరి

ABN , First Publish Date - 2022-06-25T05:51:59+05:30 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకంపై పేదల ఆశలు ఆవిరి అవుతున్నాయ.

పేదల ఆశలు ఆవిరి

 - ‘డబుల్‌’ ఇళ్లు కట్టేదెన్నడు.. పంచేదెన్నడు?

- మంజూరైనవి 6,256 ఇళ్లు

- పూర్తయిన ఇళ్లు 1,029

- పనులు ప్రారంభం కానివి 3,757 ఇళ్లు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పథకంపై పేదల ఆశలు ఆవిరి అవుతున్నాయ. ప్రభుత్వం ఏర్పడి ఎనిమిదేళ్లు గడుస్తున్నా తొలి విడతలో చేపట్టిన ఇళ్ల నిర్మాణ పనులు కూడా పూర్తికాక ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో ప్రజలు వాటిపై ఆశలు వదులుకుంటున్నారు. జిల్లాలో 6,256 ఇళ్లు నిర్మించి పేదలకు పంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 41,424 లక్షల 46 వేల రూపాయల అంచనా వ్యయంతో వీటిని పూర్తి చేయాలని భావించినా ఈ పథకానికి పురిటిలోనే గ్రహణం పట్టినట్లయింది. నియోజకవర్గాల వారీగా కేటాయింపులు చేసి ఎక్కడికక్కడ వేగవంతంగా వీటిని నిర్మాణం చేసి పేదలకు పంచాలని భావించినా ఇప్పటి వరకు కేవలం 1,029 ఇళ్ల నిర్మాణాలు మాత్రమే పూర్తయ్యాయి. మరో 1,710 ఇళ్ల నిర్మాణ పనులు ప్రగతిలో ఉండగా 3,757 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమే కాలేదు. 60 శాతం ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమే కాకపోవడంతో ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అవి ముందుకు సాగే విషయం ప్రశ్నార్థకంగానే భావిస్తున్నారు. మరో ఏడాది, ఏడాదిన్నర కాలంలో ఎన్నికలు రాబోతున్న తరుణంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పంచి ప్రజల్లో కొంత పట్టు పెంచుకుందామని భావిస్తున్న ఎమ్మెల్యేల ఆశలు కూడా సన్నగిల్లిపోతున్నాయి. ఈ ఇళ్ల నిర్మాణ పథకం వచ్చే ఎన్నికల్లో ప్రతిబంధకంగా మారే అవకాశం లేకపోలేదని టీఆర్‌ఎస్‌ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. 

 కలగానే సొంతిళ్లు

జిల్లాలోని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 3000 ఇళ్లు, కరీంనగర్‌ నియోజకవర్గంలో 1,400 ఇళ్లు, మానకొండూర్‌ నియోజకవర్గంలో 890, చొప్పదండి నియోజకవర్గంలో 469, హుస్నాబాద్‌ నియోజకవర్గంలో 497 డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత తీసుకున్న హుస్నాబాద్‌ నియోజకవర్గం చిన్నముల్కనూరు గ్రామంలో 242 ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టి 240 ఇళ్లను నిర్మించారు. వాటిలో ప్రజలు నివాసం కూడా ఉంటున్నారు. మరో రెండు ఇళ్ల వ్యవహారం కోర్టులో ఉండడంతో పెండింగ్‌లో ఉన్నది. ఇప్పటి వరకు హుజూరాబాద్‌ అర్బన్‌లో 500 ఇళ్లు, జమ్మికుంట అర్బన్‌లో 152 ఇళ్లు,  కరీంనగర్‌ రూరల్‌లో 207 ఇళ్లు, మానకొండూర్‌ నియోజకవర్గంలో 75 ఇళ్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. కరీంనగర్‌ అర్బన్‌లో 660 ఇళ్ల నిర్మాణ పనులు 80 శాతానికి పైగా పూర్తయ్యాయి.  నియోజకవర్గాల వారీగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 1,819 ఇళ్లు, కరీంనగర్‌ నియోజకవర్గంలో 553, మానకొండూర్‌ నియోజకవర్గంలో 723, హుస్నాబాద్‌ నియోజకవర్గంలో 236, చొప్పదండి నియోజకవర్గంలో 449 ఇళ్ల నిర్మాణ పనులు ఇప్పటి వరకు ప్రారంభమే కాలేదు. దీంతో డబుల్‌బెడ్‌రూం ఇళ్లు పొందవచ్చని భావించిన పేద వర్గాల ప్రజలు క్రమేపి వాటిపై ఆశలు వదులుకుంటున్నారు. సొంతిళ్లు కలగానే మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

అంతులేని జాప్యం

ఇళ్లు మంజూరు చేసిన తొలినాళ్లలో టెండర్లు పిలిచేందుకే చాలా జాప్యం జరిగింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర లాభసాటిగా లేకపోగా నష్టాలకు గురి చేసేదిగా ఉందని కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ప్రభుత్వం ఇసుక, తదితర వినియోగ వస్తువులపై రాయితీ ప్రకటించడంతో కొందరు ముందుకువచ్చి పనులు చేపట్టినా ఆ తర్వాత అవి నత్తనడకన సాగుతున్నాయి. నిధుల లేమి ఇందుకు కారణంగా కాంట్రాక్టర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం బిల్లుల మంజూరులో ఆలస్యం చేస్తున్నందున పెట్టుబడులకు అప్పులు తెచ్చి తాము నష్టపోవాల్సి వస్తున్నదని వారు అంటున్నారు. ఈ కారణంగానే డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణ పనులు జాప్యం కావడానికి స్థల సేకరణ కూడా సమస్యగా మారింది. చాలా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి కాంట్రాక్టర్లకు అప్పగించడంలో జరిగిన జాప్యం కూడా నిర్మాణ పనులకు ఆటంకంగా మారింది. పలు ప్రాంతాల్లో రెండేళ్ల క్రితం వరకు కూడా స్థలాలను అప్పగించలేదు. దీంతో కాంట్రాక్టర్లు ముందుకు వచ్చినా పనులు చేపట్టడంలో ఆలస్యం జరిగింది. ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయిన వాటిని కూడా పంచడానికి ఎమ్మెల్యేలు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అరకొర ఇళ్లు మాత్రమే పూర్తికావడంతో వాటిని పంచి మిగతావారితో ఇబ్బంది ఎదుర్కొనేకంటే పూర్తిస్థాయిలో ఇళ్లు తయారైన తర్వాత ఒకేసారి పంచితే ప్రజలనుంచి అంతగా నిరసన ఎదురుకాకపోవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు ముంచుకొస్తున్న వాతావరణం కనిపించడంతో ఎమ్మెల్యేలు డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలపై దృష్టిసారిస్తున్నారు. వీలైనంత త్వరగా వాటి పనులు పూర్తిచేసి ప్రజలకు పంపిణీ చేస్తే సానుకూల వాతావరణం ఏర్పడుతుందనే ఆశాభావంతో వారు ఉన్నారు. అయితే నిధుల కొరత పనులను ముందుకు సాగనిచ్చేలా లేదని ఆందోళన వ్యక్తమవుతున్నది. 

Updated Date - 2022-06-25T05:51:59+05:30 IST