ఊర్లోనే దవాఖానా!

ABN , First Publish Date - 2021-10-25T04:31:38+05:30 IST

ఇంతవరకు పల్లె ప్రజలకు అనారోగ్యం ఏర్పడితే పట్టణానికి వెళ్లి వైద్యం చేసుకోవాల్సి వచ్చేది.. అయితే ఇప్పుడు పల్లెకే డాక్టర్లు వచ్చి వైద్యం చేసే రోజులు రాబోతున్నాయి.

ఊర్లోనే దవాఖానా!

  • పల్లె దవాఖానాలుగా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు
  • మొదటి విడతలో జిల్లాలో 56 పీహెచ్‌సీఎస్‌ల ఎంపిక
  • ప్రతీ దవాఖానాలో అందుబాటులో డాక్టర్‌, స్టాఫ్‌ నర్స్‌, ఏఎన్‌ఎం 
  • గ్రామీణ ప్రజలకు వైద్య సేవలు మరింత విస్తృత పరిచేలా చర్యలు


ఇంతవరకు పల్లె ప్రజలకు అనారోగ్యం ఏర్పడితే పట్టణానికి వెళ్లి వైద్యం చేసుకోవాల్సి వచ్చేది.. అయితే ఇప్పుడు పల్లెకే  డాక్టర్లు వచ్చి వైద్యం చేసే రోజులు రాబోతున్నాయి. జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌ఎం) ఆధ్వర్యంలో పల్లె వైద్య సేవలను జిల్లాలో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు వైద్యఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది.


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి)

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లభించే అన్ని రకాల వైద్య సేవలు పల్లె దవాఖానాలో అందుబాటులోకి రానున్నాయి. ఇంత కాలం సరైన వైద్య సేవలు లభించక ఇబ్బందులు పడిన ప్రజల కష్టాలు త్వరలో తీరనున్నాయి.  ఇప్పటివరకు ఏఎన్‌ఎంలు, స్టాఫ్‌ నర్సుల ద్వారా టీకాలు, మందులకే పరిమితమైన సేవలు ఇక నుంచి మరింత విస్తృతం కానున్నాయి. ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత సాధించిన డాక్టర్ల ద్వారా పల్లె ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సన్నాహాలు చేస్తోంది. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), 154 ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు (సబ్‌ సెంటర్లు) ఉన్నాయి. జిల్లాలో ఇది వరకు 21 ఆరోగ్య ఉప కేంద్రాలు పల్లె ఆసుపత్రులుగా పనిచేస్తుండగా ఇక్కడ ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్సు మాత్రమే సేవలందిస్తున్నారు. ప్రతి ఆరోగ్య ఉప కేంద్రాన్ని పల్లె దవాఖానాగా తీర్చిదిద్ది డాక్టర్‌తో ప్రజలకు అవసరమైన అన్ని రకాల వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తోంది. జిల్లాలో 154 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా, వాటిలో మొదటి విడతలో 56 ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె ఆసుపత్రులుగా తీర్చిదిద్దే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.  గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసే పల్లె ఆసుపత్రుల్లో అవసరమైన డాక్టర్లు, సిబ్బంది నియామకానికి అధికార యంత్రాంగం అవసరమైన కసరత్తు ప్రారంభించింది పల్లె దవాఖానాలో పూర్తిస్థాయి వైద్యాధికారి, స్టాఫ్‌ నర్సు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పల్లె ప్రజలకు సేవలందించేలా చర్యలు చేపట్టింది. 

8 పీహెచ్‌సీల పరిధిలో..

జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా గ్రామాల్లో ఉన్న ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మార్చనున్నారు. జిల్లాలో 154 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా, మొదటి దశలో జిల్లాలో 8 పీహెచ్‌సీల పరిధిలో 56 ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానాలుగా తీర్చిదిద్దనున్నారు. అంగడి రాయిచూర్‌ పీహెచ్‌సీ పరిధిలో 6, బంట్వారం పరిధిలో 6. బషీరాబాద్‌ పరిధిలో 4, బొంరా్‌సపేట్‌ పరిధిలో 9, దౌల్తాబాద్‌ పరిధిలో 7, మోమిన్‌పేట్‌ పరిధిలో 7, పట్లూరు పరిధిలో 9, పెద్దేముల్‌ పరిధిలో 8 ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మార్చనున్నారు. అంగడి రాయ్‌చూర్‌ పీహెచ్‌సీ పరిధిలో చిన్న నందాగామ, హస్నాబాద్‌, కొడంగల్‌-ఏ, కొడంగల్‌-బీ, రావల్‌పల్లి, రుద్రారం, బంట్వారం పీహెచ్‌సీ పరిధిలో బార్వాద్‌, ఎన్నారం, మోత్కుపల్లి, రాంపూర్‌, రొంపల్లి, తొరమామిడి, బషీరాబాద్‌ పీహెచ్‌సీ పరిధిలో దామర్‌చెడ్‌, ఎక్మయి, జీవన్గి, మైల్వార్‌, బొంరా్‌సపేట్‌ పీహెచ్‌సీ పరిధిలో చిల్‌ముల్‌ మైల్వార్‌, చౌదర్‌పల్లి, దుద్యాల్‌, ఎర్పుమల్ల, గౌరారం, కొత్తూర్‌, రేగడి మైల్వార్‌, తుంకిమెట్ల, దౌల్తాబాద్‌ పీహెచ్‌సీ పరిధిలో బాలంపేట్‌, చంద్రకల్‌, దేవరఫస్లాబాద్‌, దౌల్తాబాద్‌-బీ, ఈర్లపల్లి, కుదురుమల్ల, మాటూరు, మోమిన్‌పేట్‌ పీహెచ్‌సీ పరిధిలో అమ్రాది కలాన్‌, దేవరంపల్లి, ఏన్కతల, కేసారం, మొరంగపల్లి, టేకులపల్లి, వెల్చాల్‌, పట్లూర్‌ పీహెచ్‌సీ పరిఽధిలో బూచన్‌పల్లి, ఘనాపూర్‌, కల్కోడ, కొంశెట్‌పల్లి, కొత్లాపూర్‌, కోట్‌మర్పల్లి, సిరిపురం, తుమ్మలపల్లి, పెద్దేముల్‌ పీహెచ్‌సీ పరిధిలో అడికిచర్ల, గాజీపూర్‌, ఇందూర్‌, కోట్‌పల్లి, మంబాపూర్‌, మారేపల్లి, నాగులపల్లి, తట్టేపల్లి ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానాలుగా అప్‌గ్రేడ్‌ చేయనున్నారు. ప్రభుత్వం దశల వారీగా జిల్లాలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానాలుగా మార్చనుంది. 

అందుబాటులో ఉండే సేవలు ..

గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న పల్లె దవాఖానాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) సేవలు అందించనున్నారు. ప్రాథమిక చికిత్స, మాతా శిశు సంరక్షణ సేవలు, టీకాల పంపిణీతో పాటు హైపర్‌ టెన్షన్‌ (హైబీపీ), మధుమేహం (షుగర్‌) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య సేవలు అందించనున్నారు. అంతే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇక్కడే అవసరమైన మందులు పంపిణీ చేయనున్నారు. పల్లె దవాఖానాలకు వైద్యం కోసం వచ్చే వారి నుంచి రక్త, మల, మూత్ర నమూనాలు సేకరించి 20 రకాల వరకు పరీక్షలు చేయనున్నారు. స్థానికంగా అందుబాటులో లేని పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని టీ-డయాగ్నస్టిక్‌ హబ్‌కు పంపించి రోగ నిర్ధారణ పరీక్షలు చేయించనున్నారు. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా రోగులు ఏ వ్యాధితో బాధపడుతున్నారు, ఏ విధమైన చికిత్స అందించాలనేది డాక్టర్లు నిర్ణయం తీసుకోనున్నారు. వ్యాధి తీవ్రత ఆధారంగా సీహెచ్‌సీ లేదా జిల్లా ఆసుపత్రికి సిఫారసు చేయనున్నారు. 

Updated Date - 2021-10-25T04:31:38+05:30 IST