Abn logo
Mar 20 2020 @ 03:00AM

అబద్ధాల వేట

తర్కంలోని నిష్కర్ష, సత్యంలోని కాఠిన్యం, ఏకాగ్రతలోని నిశ్చలత్వం శ్రీ రాయ్ వ్యక్తిత్వంలో ప్రస్ఫుటమౌతూ ఉండేవి. ఆలోచనకు ఆయనెంత ప్రాధాన్యమిచ్చినా, దాని వెనుక ‘తక్కిన జంతుకోటి నుంచి తమను వేరు చేస్తున్న మెదడు తమకు ఉండి కూడా మానవులు దాన్ని వినియోగించరేం?’ అనే తీవ్రావేదన దాగి వుండేది.


మానవ జీవిత సాఫల్య వైఫల్యాలకు మానదండాలేవి? ఆర్జించిన సిరిసంపత్తులా? అనుభవించిన సుఖ సం తోషాలా? అధిష్టించిన పదవులా? సాధించిన ప్రాబల్యమా? పొం దిన ప్రశంసలా? ఇట్టి మానదండాలను వర్తింపజేస్తే శ్రీ ఎం.ఎన్. రాయ్ జీవితాన్ని నిరర్థకమైనదిగానే పరిగణించవలసి వస్తుంది. ఇంచుమించు ఆరు దశాబ్దాలకు నాలుగు ఖండాలకు విస్తరించిన ఆయన జీవితంలో సామాన్య దృష్టికి కానవచ్చేవి జారవిడిచిన మహదావకాశాలే, కాలదన్నిన కీలక పదవులే, చేజేతుల మంటగలుపుకున్న పేరు ప్రఖ్యాతులే! అద్భుత మేధా సంపత్తి ఉండి కూడా అసాధారణ ప్రజ్ఞా ప్రాభవాలుండి కూడా ఈ విధంగా ఆయన వర్తించడం సామాన్య జనులకు విపరీతంగా తోస్తుంది. ఉన్మాదుల పట్టికలో ఆయన పేరును కూడా వారు చేర్చుతారు.


ఆ పట్టికలో చార్వాకుని సరసను, మక్ఖలి గోశాలుడి సరసను, సంజయ వేళట్టి పుత్రుని సరసను, అజితకేశ కంబళుని సరసను, డెమోక్రటీజ్ సరసను, టి.హెచ్. హక్సీలీ సరసను, కార్ల్ మార్క్స్ సరసను తన పేరు కనబడినందుకు శ్రీరాయ్ మాత్రం ఎంతో సంతోషించే వాడని ప్రత్యేకించి చెప్పనక్కర లేదు. వారివలె ఈయన కూడా ‘అబద్ధాల వేట’నే తన వృత్తిగా పెట్టుకున్నాడు; అప్రియ సత్యాలను పలకడమే తన పరమ ధర్మంగా భావించుకున్నాడు; అనాదృత సిద్ధాంతాల ప్రతిపాదననే తన విశిష్ట లక్ష్యంగా ఎంచుకున్నాడు. అపజయం వాటి ముఖాన స్పష్టంగా వ్రాసిపెట్టబడి వున్న యుద్ధాలలో దూకడానికే తన జీవితాన్ని అంకితం చేశాడు. ఇతరుల ఆమోద ప్రమోదాలను లెక్క చేయక, ప్రాపంచిక దృష్టి నుంచి జయాపజయాలను సరకు గొనక, సత్యపథం వెంట నిత్యపథికులుగా నిలవడాన్ని మాత్రమే ఈ కోవకు చెందిన ఉన్మాదులు కాంక్షిస్తారు. 


తర్కంలోని నిష్కర్ష, సత్యంలోని కాఠిన్యం, ఏకాగ్రతలోని నిశ్చలత్వం శ్రీ రాయ్ వ్యక్తిత్వంలో ప్రస్ఫుటమౌతూ ఉండేవి. అందువల్లనే పెక్కుమంది ఆయనను మెదడు తప్ప హృదయం లేనివానిగా అపార్థం చేసుకునే వారు; ఔదార్యానికి, ప్రేమకు, క్షమకు ఆయన అపరిచితుడని భ్రమపడేవారు. ఆయనను కేవలం ఒక ‘థింకింగ్ మెషీన్’గా పరిగణించేవారు. ఆలోచనకు ఆయనెంత ప్రాధాన్యమిచ్చినా, దాని వెనుక ‘తక్కిన జంతుకోటి నుంచి తమను వేరు చేస్తున్న మెదడు తమకు ఉండి కూడా మానవులు దాన్ని వినియోగించరేం?’ అనే తీవ్రావేదన దాగి వుం డేది. సత్యపరిశోధన కోసం ఎంత దీక్షతో తపస్సు చేసినా, అది కేవలం సత్యసాక్షాత్కారాన్ని పొందగలిగానన్న వ్యక్తిగత సంతృప్తి కోసం కాదు, మత మౌఢ్యాల నుంచి, నీచ స్వార్థాల నుంచి, ఆత్మ విధ్వంసక విధానాల నుంచి మానవజాతిని సముద్ధరించవలెనన్న గాఢ తపనతోనే! జాతి, మత, వర్ణ, కుల, వర్గాది విభేదాలనెరుగని ఆయన విశ్వమానవప్రేమే ఆయనను మానవతావాదిని చేసింది. 


1965 సెప్టెంబర్ 5 ఆంధ్రజ్యోతిలో 

‘మానవతావాది: శ్రీ మానవేంద్రనాథ్ రాయ్’ వ్యాసం నుంచి

Advertisement
Advertisement
Advertisement