సమ్మె ఆలోచన విరమించుకోవాలి

ABN , First Publish Date - 2021-12-04T05:56:21+05:30 IST

సింగరేణిలో కార్మికసంఘాలు తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని, సమ్మెతో సింగరేణి ప్రగతికి వి ఘాతమని సింగరేణి యాజమాన్యం పేర్కొన్నది.

సమ్మె ఆలోచన విరమించుకోవాలి
కార్మిక సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతున్న డైరెక్టర్లు

- కార్మిక సంఘాలతో యాజమాన్యం చర్చలు

గోదావరిఖని, డిసెంబరు 3: సింగరేణిలో కార్మికసంఘాలు తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని, సమ్మెతో సింగరేణి ప్రగతికి వి ఘాతమని సింగరేణి యాజమాన్యం పేర్కొన్నది. సింగరేణి గుర్తింపు కార్మికసంఘం టీబీజీకేఎస్‌తో పాటు జాతీయ కార్మిక సంఘాలు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, బీఎంఎస్‌, సీఐటీయూ సంఘాలు ఈ నెల 9, 10, 11 తేదీల్లో మూడు రోజుల పాటు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం యాజమాన్యం అన్నీ కార్మిక సంఘాలతో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో చర్చలు జరిపింది. ఇందులో యాజమాన్యం తరపున డైరెక్టర్లు ఎస్‌ చంద్రశేఖర్‌, ఎన్‌ బలరాం, డీ సత్యనారాయణలు పాల్గొని కార్మిక ప్రతినిధులతో మాట్లాడారు. సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకుల వేలం కేంద్రం పరిధిలోనిదని, బొగ్గు బ్లాకుల కోసం చివరి వరకు చేసిన ప్రయత్నాలను యాజమాన్యం వివరించింది. సమ్మె చేస్తే సంస్థకు, కార్మికులకు జరిగే నష్టంపై వివరించింది. కాగా స్పందించిన కార్మిక సంఘాల ప్రతినిధులు బొగ్గు బాక్లుల కేవలం సింగరేణి మనుగడకే ప్రమాదమని, రానున్న రోజుల్లో తెలంగాణలో ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాటాలతోనే బొగ్గు బ్లాకులను కాపాడుకుంటామన్నారు. వేలంలో ఎవరు దక్కించుకోవాలని చూసినా అడ్డుకుంటామని, సింగరేణి ప్రాంతంలో ఇతర సంస్థలు మైనింగ్‌కు రాకుండా సమష్టి పోరాటం చేసి సింగరేణి అస్తిత్వాన్ని కాపాడుకుంటామన్నారు. ఇప్పుడు సమ్మె చేయలేకపోతే భవిష్యత్‌లో బాధపడాల్సి వస్తుందని కార్మిక సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. కాగా బొగ్గు బ్లాకులను కాపాడేందుకు సమ్మె కాకుండా ఇతర మార్గాల్లో కార్మిక సంఘాలు చేసే పోరాటానికి ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందని సింగరేణి యాజమాన్యం పేర్కొం ది. ఈ సమావేశంలో కార్మిక సంఘాల ప్రతినిధులు టీబీజీకేఎస్‌ నాయకులు బీ వెంకట్రావ్‌ కే మల్లయ్య, ఏఐటీయూసీ నాయకులు సీతారామ య్య, ఐఎన్‌టీయూసీ నాయకులు జనక్‌ ప్రసాద్‌, ఎస్‌ నర్సింహారెడ్డి, హెచ్‌ఎంఎస్‌ నాయకులు రియాజ్‌ అహ్మద్‌, జక్కుల నారాయణ, సీఐటీయూ నాయకులు రాజిరెడ్డి, మధు, బీఎంఎస్‌ నాయకులు యాదగిరి సత్తయ్య, మాధవ్‌నాయక్‌, యాజమాన్యం నుంచి అధికారులు కే సూర్యనారాయణ, ఏ ఆనందరావు, కే నాగభూషణ్‌రెడ్డి, పీ సత్తయ్య, హన్మంతరావు, ఎల్‌ తిరుపతి పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-04T05:56:21+05:30 IST