పొంచి ఉన్న ముప్పు!

ABN , First Publish Date - 2021-06-13T06:20:15+05:30 IST

ఒకవైపు కరోనా మహమ్మారి మరోవైపు సీజనల్‌ వ్యాధులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కరోనా సెకండ్‌వే వ్‌ కొంతవరకు తగ్గుముఖం పట్టినా.. సీజనల్‌ వ్యాధుల ముప్పు పొంచి ఉం దని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతియేటా జిల్లాలో సీజనల్‌ వ్యాధుల బారి

పొంచి ఉన్న ముప్పు!
ఆదిలాబాద్‌లో ఓ కాలనీలో రోడ్డుపై నిలిచిన మురికి నీరు

- జిల్లాలో ముంచుకొస్తున్న సీజనల్‌ వ్యాధుల ముప్పు

- కరోనా తగ్గుముఖం పట్టినా.. వ్యాధులతో సతమతం

- వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు

- పట్టణ, గ్రామాల్లో అధ్వానంగా పారిశుధ్యం నిర్వహణ

- అప్రమత్తత లేకుంటే.. ఇక అంతే సంగతి!!

ఆదిలాబాద్‌, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): ఒకవైపు కరోనా మహమ్మారి మరోవైపు సీజనల్‌ వ్యాధులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కరోనా సెకండ్‌వే వ్‌ కొంతవరకు తగ్గుముఖం పట్టినా.. సీజనల్‌ వ్యాధుల ముప్పు పొంచి ఉం దని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతియేటా జిల్లాలో సీజనల్‌ వ్యాధుల బారినపడి పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. తాజాగా నార్నూర్‌ మండలంలో సీజనల్‌గా లభించే మామిడిపండ్ల రసం తాగి 41 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమైన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్ని మండలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించి సీజనల్‌ వ్యాధుల ముప్పుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. జిల్లాలో 14 హైరిస్క్‌ గ్రామాలతో పాటు, మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిది కాలనీలలో ప్రజలు అప్రమత్తం గా ఉండాలని హెచ్చరికలు చేశారు. జూన్‌ 1నుంచి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ పలు గ్రామాలలో శుద్ధనీరు అందుబాటులో లేకపోవడంతో వ్యవసాయ బావుల పైననే ఆధారపడి దాహం తీర్చుకోవాల్సి వస్తుంది. వేసవి కాలం ముగిసి వానాకాలం ప్రారంభం కావడంతో విష జ్వరాలు, జలుబు, దగ్గులాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. దీంతో కరోనా వైరస్‌ అనే భయం కనిపిస్తోంది. కొందరు అనుమానంతో కరోనా పరీక్షలు చేయించుకుంటున్నా.. నెగెటివ్‌గా నిర్ధారణ అవుతోంది. ఎక్కువ మంది టైఫాయిడ్‌ బారిన పడుతున్నారు. వర్షాకాలం ప్రారంభంలో తాగునీరు కలుషితం కావడంతో  టైఫాయిడ్‌, డయేరియా, వాంతులు, విరేచనాలు లాంటి వ్యాధులు విజృంభించే అవకాశం ఉంటుంది. గతేడు వానాకాల సీజన్‌లో రెండు వేలకు పైగా టైపాయిడ్‌ కేసులు నమోదు కాగా, 208 డెంగ్యూ కేసులు, ఒక్క మలేరియా కేసు, 307 డయేరియా కేసులు, మరో 400 మంది ఫైలేరియా(బోధకాలు) బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం గత కొంత కాలంగా పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం అమలుకు నోచుకోవడం లేదు. అవసరమైన వసతులు నిధులను సమకూర్చినా.. పాలకులు, అధికారుల్లో నిండు నిర్లక్ష్యమే కనిపిస్తోంది. ఇకనైనా అధికార యంత్రాంగం అప్రమత్తంగా లేకుంటే సీజనల్‌ వ్యాధుల ముప్పు తప్పదన్న హెచ్చరికలు వస్తున్నాయి.

మలేరియా మాసంగా జూన్‌

ప్రతియేటా వైద్య ఆరోగ్య శాఖాధికారులు జూన్‌ మాసాన్ని మలేరియా మాసంగా పరిగణిస్తూ అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నెల ముగిసే వరకు విస్త్రృతంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. అలాగే ప్రతీ శుక్రవారాన్ని ఫ్రై డేగా పాటిస్తూ కార్యక్రమాలు నిర్వహించాలి. దోమల బెడద లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జూన్‌ ప్రారంభంలోనే వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తుఫాను ప్రభావం వల్ల జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నా యి. దీంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉష్ణోగ్రతల్లో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితులతో జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. తాగునీరు మారడం, కొత్త నీరుతో పిల్లలు గొంతు, ముక్కు సంబంధిత వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. పెద్దలు జ్వరంతో మంచం పడుతున్నారు. ప్రధానంగా ఏజెన్సీ గిరిజన గ్రామాలలో పరిస్థితులు మరి అధ్వానంగా ఉన్నాయి. ఇప్పటికే వందలాది గ్రామాలకు మిషన్‌ భగీరథ ద్వారా తాగునీరు అందక స్థానికంగా అందుబాటులో ఉన్న నీటితోనే దాహం తీర్చుకోవాల్సిన పరస్థితి నెలకొంది. 

పారిశుధ్య నిర్వహణ గాలికి..

వానాకాలంలో పరిసరాల పరిశుభ్రత ప్రధానంగా చేపట్టాల్సి ఉంటుంది.  ప్రస్తుతం పారిశుధ్య నిర్వహణ సరిగా లేకపోవడంతో పరిసరాలు కంపు కొడుతున్నాయి. ఈగలు, దోమల బెడద పెరిగిపోతోంది. యేటా సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులను ప్రభుత్వం అందిస్తోంది. మున్సిపల్‌ పరిధిలో నిత్యం పారిశుధ్య పనులు కొనసాగుతున్నా.. ఇళ్ల మధ్యలో మురికి గుంటలు ఏర్పడి దోమల బెడదకు కారణమవుతున్నాయి. జిల్లాలో మేజర్‌ గ్రామ పంచాయతీలైనా ఉట్నూర్‌, బోథ్‌, ఇచ్చోడ, తలమడుగు, గుడిహత్నూర్‌, బేల, నేరడిగొండ మండలాల్లో పారిశుధ్య నిర్వహణ మరీ అధ్వానంగా ఉంది. జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పలుచోట్ల ఎక్కడి చెత్త అక్కడే పడి ఉంటోంది. పందులు, కుక్కల స్వైరవిహారంతో పాటు దోమలు, ఈగల సంఖ్య పెరిగిపోయి సీజనల్‌ వ్యాధులకు కారణమవుతోంది. అవసరమైన డంపింగ్‌ యార్డులను నిర్మించిన మెజార్టీ గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల సిబ్బంది వాటిని ఉపయోగంలోకి తేకపోవడంతో రోడ్లకు ఇరువైపులా, ఊరికి పక్కనే చెత్త వేస్తున్నారు. దీంతో  సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇకనైనా అధికారులు యుద్ధప్రాతిపదికన పారిశుధ్య పనులను చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

పారిశుధ్యం అధ్వానంగా తయారైంది

: ఎలుగు ప్రేమేందర్‌, సంజయ్‌నగర్‌ కాలనీ, ఆదిలాబాద్‌

ఆదిలాబాద్‌ మున్సిపాలిటిలో పారిశుధ్యం నిర్వహణ అధ్వానంగా తయారైంది. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఈగలు, దోమల బెడద మరింత పెరిగిపోతో  ంది. కాలనీల్లో మురికినీరు నిలవడంతో కంపు కొడుతున్నాయి. వెంటనే మున్సిపల్‌ అధికారులు పారిశుధ్యం పనులను చేపట్టి ప్రజలు సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. 

నివారణ చర్యలు తీసుకుంటున్నాం

: డా.నరేందర్‌రాథోడ్‌, డీఎంహెచ్‌వో, ఆదిలాబాద్‌

జిల్లాలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో సీజనల్‌ వ్యాధుల ముప్పుపై అవగాహన కల్పిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా 14 గ్రామాలు, మున్సిపాలిటీల పరిదిలోని ఎనిమిది కాలనీలను హైరిస్క్‌ ప్రాంతాలుగా గుర్తించాం.  ఇప్పటికే బేల మండలంలో మలేరియా బారిన పడకుండా దోమ తెరలను పంపిణీ చేయడం జరిగింది. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ అప్రమత్తంగా ఉండాలి.

Updated Date - 2021-06-13T06:20:15+05:30 IST