Abn logo
Dec 5 2020 @ 00:58AM

అనితరసాధ్యులు ఆస్ట్రేలియన్‌ క్రికెటర్లు

‘అసాధ్యం’ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ దాన్ని సుసాధ్యం చేయగలమని నిండుగా విశ్వసించేవారు ఆస్ట్రేలియన్‌ క్రికెటర్లు. వారికి అసాధ్యమనేది ఏమైనా ఉంటుందా అని మనం అబ్బురపడే విధంగా వారు విజయవంతమయ్యారు. చివరి పరుగు చేసేంతవరకు, చివరి వికెట్ పడిపోయేంత వరకు వారు ఏ మ్యాచ్‌లోనూ, ప్రత్యేకించి ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోవడం ఎన్నడూ జరగలేదు’. ఒక ఆంగ్లేయుడు ఏడు దశాబ్దాల నాడు చేసిన ఈ వ్యాఖ్యలలోని సత్యాన్ని త్వరలో ఆస్ట్రేలియాలో ప్రారంభమవనున్న టెస్ట్ సిరీస్ మరోసారి కచ్చితంగా ధ్రువీకరిస్తుంది. 


నేనుఆసాంతంగా చదివిన మొట్టమొదటి పుస్తకం రచయిత ఒక ఆస్ట్రేలియన్. ఆయన పేరు కీత్ మిల్లర్-. ఆస్ట్రేలియా నుంచి ప్రభవించిన గొప్ప ఆల్-రౌండర్ క్రికెటర్. 1956లో క్రికెట్ నుంచి విరమించిన అనంతరం మిల్లర్ ఆత్మకథ ‘క్రికెట్ క్రాస్‌ఫైర్’ వెలువడింది. భారతీయ ప్రచురణకర్త ఒకరు ఆ పుస్తకాన్ని పునర్ముద్రించారు. దాని ప్రతినొకదాన్ని 1960 దశకం ద్వితీయార్ధంలో మా నాన్నగారు డెహ్రాడూన్ రాజ్‌పూర్ రోడ్ ‌లోని ఒక బుక్‌స్టోర్‌లో కొనుగోలు చేసి నాకు ఇచ్చారు. 


మిల్లర్ క్రికెట్ జీవిత ఆత్మకథను నేను ఇంచుమించు పది సంవత్సరాల వయసులో చదివాను. ‘క్రికెట్ క్రాస్‌ఫైర్’ను చదివినప్పుడు రెండు విషయాలు నన్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒకటి– తన కెప్టెన్ డాన్ బ్రాడ్‌మన్‌పై మిల్లర్ అభిప్రాయాలు; రెండు– భారత్ పట్ల, భారతీయుల పట్ల ఆయన గౌరవాభిమానాలు. బ్రాడ్‌మన్ తన కాలపు గొప్ప క్రికెటర్ అని అంగీకరించినప్పటికీ వ్యక్తిగా అతడిపై మిల్లర్‌కు సదభిప్రాయం లేదు. పైగా స్వార్థపరుడు అని కూడా అతణ్ణి ఆక్షేపించాడు. అయితే, భారతీయ క్రికెటర్లను క్రీడాకారులుగానూ, వ్యక్తులుగానూ మిల్లర్ అమితంగా అభిమానించాడు, అపూర్వంగా గౌరవించాడు. మిల్లర్ ఆత్మకథలో మన ముష్టాక్ అలీ, సిఎస్ నాయుడు, వినూ మన్కాడ్, విజయ్ మర్చంట్‌ల గురించిన ఆత్మీయ కథనాలు యాభై సంవత్సరాల అనంతరం ఇప్పటికీ నా స్మృతిపథంలో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. 


1967 లేదా 1968లో నేను ‘క్రికెట్ క్రాస్‌ఫైర్’ను చదివి ఉంటాను. అదేకాలంలో మద్రాసు (నేటి చెన్నై) నుంచి వెలువడే ‘స్పోర్ట్ అండ్ పాస్ట్ టైమ్’లో జాక్ ఫింగెల్టన్ వ్యాసాలనూ చదవడం ప్రారంభించాను. మిల్లర్ టెస్ట్ క్రికెట్‌లోకి రావడానికి దశాబ్దం ముందే డాన్ బ్రాడ్‌మన్ కెప్టెన్సీలో ఫింగెల్టన్ ఆడారు. అనంతరకాలంలో నేను చదివిన ఫింగెల్టన్ పుస్తకాల ద్వారా, ఆయన కూడా బ్రాడ్‌మన్‌ను తన కాలపు గొప్ప క్రికెటర్‌గా గౌరవించినప్పటికీ వ్యక్తిగా ఉత్తమగుణశీలుడు కాదని భావించినట్టు తెలుసుకున్నాను. 


మిల్లర్, ఫింగెల్టన్‌లను మొట్టమొదట చదివిన కాలంలోనే ఆస్ట్రేలియన్ క్రికెట్ వ్యాఖ్యానాలను ప్రప్రథమంగా విన్నాను. 1960 దశకం తుదినాళ్ళలో భారతీయ గృహాలలో టెలివిజన్‌లు లేవు. క్రికెట్ పిచ్చి గల నాలాంటి వాళ్ళు, ఆ అందమైన ఆట గురించి పత్రికల్లో చదివేవారు, రేడియోలో వినేవారు. 1967–-68లో ఆస్ట్రేలియాలో భారత్ క్రికెట్ జట్టు పర్యటన (మన టీమ్ ఓడిపోయింది) సందర్భంగా రేడియో వ్యాఖ్యానాలను విన్నట్టు నాకు లీలగా గుర్తు. ఆ మరుసటి శీతాకాలంలో ఆస్ట్రేలియాలో వెస్టిండీస్ జట్టు పర్యటన సందర్భంగా విన్న రేడియో వ్యాఖ్యానాలు మాత్రం నాకు ఇంకా స్పష్టంగా జ్ఞాపకమున్నాయి. వెస్టిండీస్ జట్టుకు బ్రాడ్‌మన్ కంటే గొప్ప క్రికెటర్ అయిన గార్ఫీల్డ్ సొబెర్స్ సారథ్యం వహించారు. ఆతిథేయుల చేతిలో అతిథులు ఓడిపోవడం నాకు నిరుత్సాహం కలిగించింది. అయితే అలన్ మెక్ గిల్వారే, లిండ్సే హస్సెట్‌ల స్ఫూర్తిదాయక వ్యాఖ్యానాలను అమితాసక్తితో విన్నాను. మంచుకొండల ముంగిటలో ఉన్న డెహ్రాడూన్‌లో శీతాకాల ప్రాతఃవేళల్లో రేడియో ముందు కూర్చుని మెక్ గిల్వారే, హస్సెట్‌ల క్రికెట్ వ్యాఖ్యానాలను వినడం ఒక అనిర్వచనీయమైన అనుభూతి, మరచిపోలేని మధుర జ్ఞాపకం. 


1970 దశాబ్దంలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్, పాకిస్థాన్, భారత్ జట్టులు ఆస్ట్రేలియాలో పర్యటించిన సందర్భాలలో విధిగా ప్రత్యక్ష వ్యాఖ్యానాలు వినేవాణ్ణి; మరుసటిరోజు దినపత్రికలలోనూ, ఇంకా స్పోర్ట్స్ మ్యాగజైన్‌లలోనూ ఆ మ్యాచ్‌ల గురించి తీరిగ్గా చదివేవాణ్ణి. ఇలా ఆ దశకపు శీతాకాలాలన్నీ నాకు ఎంతో ఉల్లాసకరంగా, ఆనందప్రదంగా గడిచాయి. 1970ల తొలినాళ్ళలోనే ‘స్పోర్ట్ అండ్ పాస్ట్ టైమ్’ ప్రచురణ ఆగిపోయింది. ఈ లోటును బొంబాయి నుంచి వెలువడే ‘స్పోర్ట్స్ వీక్’ భర్తీ చేసింది. కళాశాల, విశ్వవిద్యాలయ జీవితంలో ప్రవేశించిన తరువాత నేను సొంతంగా పుస్తకాలు కొనుక్కోవడం ప్రారంభించాను. ఫింగెల్టన్ పుస్తకాలతో పాటు రే రాబిన్సన్ పుస్తకాలను కూడా ఆబగా చదివేవాణ్ణి. రాబిన్సన్ (మిల్లర్ లేదా ఫింగెల్టన్ స్థాయిలో క్రికెట్ ఆడలేదు గానీ) వచనశైలి గొప్పది, అందమైనది, ఆహ్లాదకరమైనది. బాల్యంలోనూ, నవ యవ్వనంలోనూ నా అభిమాన ఆస్ట్రేలియన్లు క్రికెట్ రచయితలు, క్రికెట్ వ్యాఖ్యాతలే. 1979లో బెంగలూరులో ఒక టెస్ట్‌మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్లను నేను మొదటిసారి ప్రత్యక్షంగా చూశాను. నేను నా ఇరవైల్లోకి ప్రవేశించిన కాలమది. 1980 దశకంలో ఆస్ట్రేలియన్ల టెస్ట్‌మ్యాచ్‌లను పెద్దగా చూడలేదు. 1990 దశకం, 2000 శతాబ్ది మొదటి దశకంలో టాప్‌క్లాస్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ల టెస్ట్‌మ్యాచ్‌లు ఎన్నిటినో బెంగలూరులో ప్రత్యక్షంగా చూశాను. పోంటింగ్, వాఫ్ సోదరుల బ్యాటింగ్, మెక్‌గ్రాత్, వార్నేల బౌలింగ్, హీలే, గిల్‌క్రిస్ట్ వికెట్ కీపింగ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాను. 


నా బాల్యం నుంచీ ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడిన మ్యాచ్‌లను వీక్షిస్తున్నాను, ఆ క్రీడాకారుల గురించి చదువుతున్నాను, వారి ప్రతిభాపాటవాలపై వ్యాఖ్యానాలను వింటున్నాను. ఈ అనుభవంతో సార్వకాలిక ఆస్ట్రేలియన్ టెస్ట్ ఎలెవన్ నొకదాన్ని చర్చకు నివేదిస్తున్నాను. ఆ 11మంది గొప్ప క్రికెటర్లు బ్యాటింగ్ క్రమంలో వరుసగా: 1. విక్టర్ ట్రంపెర్ 2. ఆర్థర్ మోరిస్ 3. డాన్ బ్రాడ్‌మన్ 4. రిస్కే పాంటింగ్ 5. అలన్ బోర్డర్ 6. కీత్ మిల్లర్ 7. ఆడం గిల్‌‌క్రిస్ట్ 8. షాన్ వార్నే 9. డెనిస్ లిల్లె 10. బిల్ ఓ రెయిల్లీ 11. గ్లెన్ మెక్ గ్రాత్. స్టీవ్ స్మిత్ ఇంకా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నందున ఆయన్ని ఈ ఎలెవన్ నుంచి మినహాయించాను. అయితే ఈ గ్రేట్ ఎలెవన్‌కు కెప్టెన్ ఎవరు? అందరి ఎంపిక డాన్ బ్రాడ్‌మన్ అని నాకు తెలుసు. అయితే నా ఎంపిక మాత్రం అలన్ బోర్టర్. ఆస్ట్రేలియా ఆ దేశ క్రికెట్ చరిత్రలో ఒక అథమాథమ దశ నుంచి బయటపడేందుకు విశేషంగా తోడ్పడిన క్రీడాకారుడు అలన్ బోర్డర్. యువ క్రీడాకారులకు ఉత్తమోత్తమ శిక్షణ ఇవ్వడంలో బోర్డర్‌కు సాటి అయినవారు మరెవరూ లేరు. జట్టులో సంఘటిత స్ఫూర్తి (టీమ్ స్పిరిట్)ని నింపడంలో అలన్ బోర్డర్ అద్వితీయుడు. సార్వకాలిక ఆస్ట్రేలియన్ ఎలెవన్‌కు, ఫ్రాంక్ వొర్రెల్ నేతృత్వంలోని సార్వకాలిక వెస్టిండీస్ ఎలెవన్‌కు మధ్య ఉహాత్మక పోటీలో నేను ఎప్పుడైనా సరే బ్రాడ్‌మన్ కంటే బోర్డర్ నాయకత్వాన్నే విశ్వసిస్తాను. 


ఆంగ్లేయుడైన క్రికెట్ రచయిత జాన్ అర్లాట్ నుంచి ఉటంకింపులతో నా ఈ ఆస్ట్రేలియన్ క్రికెటర్ల ప్రస్తుతిని ముగిస్తాను. 1948లో ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ జట్టు పర్యటన అనంతరం ఆతిధేయ దేశం వారు క్రికెట్‌ ఆడిన విధానంపై అర్లాట్ ఒక స్ఫూర్తిదాయక వ్యాసం రాశాడు. కొన్ని ప్రశ్నలతో ఆ వ్యాసం ప్రారంభమవుతుంది. ‘ఆస్ట్రేలియన్ క్రికెటర్లు ఎందుకు భిన్నమైనవారు? ఆస్ట్రేలియాపై ఆడే ఒక టెస్ట్‌మ్యాచ్ ఇతర దేశాలపై ఆడే టెస్ట్‌మ్యాచ్ కంటే ఎందుకు భిన్నమైనది? అలా అని మనం ఎందుకు భావిస్తున్నాం?’ అనే ప్రశ్నలతో మొదలైన ఈ వ్యాసంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ల ప్రత్యేకతలు స్పష్టంగా ప్రస్ఫుటమైన మ్యాచ్‌ల గురించి అర్లాట్ విపులంగా అభివర్ణించాడు. ఆయన తన వ్యాసాన్ని ఇలా ముక్తాయించాడు: ‘ఒక యాషెస్ టెస్ట్‌లో ఒక ఇంగ్లీష్ టీమ్ ఎప్పుడు ఆడినా అది ఆస్ట్రేలియన్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, కెప్టెన్సీ, మరీ ముఖ్యంగా ‍‘ఆస్ట్రేలియనిజం’ను ఎదుర్కొంటుంది. ‘ఆస్ట్రేలియనిజం’ అంటే అర్థమేమిటి? గెలిచితీరాలనే అచంచల పట్టుదల. నిబంధనల పరిధిలో విజయం సాధించాలనే దృఢసంకల్పం, ఏకాగ్రదృష్టితో ఆడడం. ‘అసాధ్యం’ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ దాన్ని సుసాధ్యం చేయగలమని నిండుగా విశ్వసించే వారు ఆస్ట్రేలియన్లు. వారికి అసాధ్యమనేది ఏమైనా ఉంటుందా అని మనం అబ్బురపడే విధంగా వారు విజయవంతమయ్యారు. చివరి పరుగు చేసేంతవరకు, చివరి వికెట్ పడిపోయేంత వరకు వారు ఏ మ్యాచ్‌లోనూ, ప్రత్యేకించి ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఓడిపోవడం ఎన్నడూ జరగలేదు’. ఆస్ట్రేలియన్ల క్రికెట్ ప్రతిభాపాటవాల గురించిన ఆ ప్రశంస ఒక ఆంగ్లేయుని దృష్టికోణం నుంచి రాసినది. అయితే ఆస్ట్రేలియన్లపై తమ సొంత జట్టు ఆటను వీక్షించిన భారతీయులందరూ  ఆ అనుపమేయ క్రీడాప్రతిభను దర్శించి ఉంటారనడంలో సందేహం లేదు. ఏడు దశాబ్దాల నాటి అర్లాట్ వ్యాఖ్యలలోని సత్యాన్ని త్వరలో ఆస్ట్రేలియాలో ప్రారంభమవనున్న టెస్ట్ సిరీస్ మరోసారి కచ్చితంగా ధ్రువీకరిస్తుంది.

రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...