జూట్‌ పరిశ్రమలు కుదేలు

ABN , First Publish Date - 2021-08-12T05:04:04+05:30 IST

జూట్‌ పరిశ్రమలు కుదేలవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో చాలా పరిశ్రమలు మూత పడుతున్నాయి. ప్లాస్టిక్‌ విక్రయాలను ప్రభుత్వం ప్రోత్సహించడంతో గోగు ఉత్పత్తులకు ఆదరణ తగ్గుతోంది. మరోవైపు అంతంతమాత్రంగా రాయితీలు అందజేస్తుండడంతో పరిశ్రమల నిర్వహణ భారమవుతోందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. పరిశ్రమలు మూసేస్తుండడంతో చాలామంది కార్మికులు రోడ్డున పడుతున్నారు.

జూట్‌ పరిశ్రమలు కుదేలు
రాజాంలోని శ్రీలక్ష్మి జూట్‌మిల్‌

- ప్రభుత్వ ప్రోత్సాహ ం, రాయితీలు కరువు

- ఉత్పత్తులకు తగ్గుతున్న ఆదరణ

- మూతపడుతున్న కర్మాగారాలు

- రోడ్డున పడుతున్న కార్మికులు 

(రాజాం)

జూట్‌ పరిశ్రమలు కుదేలవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో చాలా పరిశ్రమలు మూత పడుతున్నాయి. ప్లాస్టిక్‌ విక్రయాలను ప్రభుత్వం ప్రోత్సహించడంతో గోగు ఉత్పత్తులకు ఆదరణ తగ్గుతోంది. మరోవైపు అంతంతమాత్రంగా రాయితీలు అందజేస్తుండడంతో పరిశ్రమల నిర్వహణ భారమవుతోందని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. పరిశ్రమలు మూసేస్తుండడంతో చాలామంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 27 పరిశ్రమలకు గానూ.. ఇప్పటి వరకూ 20 పరిశ్రమలు మూతపడ్డాయి. ప్రస్తుతం కేవలం ఏడు పరిశ్రమలు మాత్రమే నడుస్తున్నాయి. ఇందులో నాలుగు పరిశ్రమలు సిక్కోలులో ఉండడం కాస్త ఉపశమనం కలిగించే అంశం. రాజాంలోని శ్రీలక్ష్మి, కేశవ, ఎస్‌ఎస్‌ఎల్‌ జూట్‌ మిల్లులతో పాటు శ్రీకాకుళం మండలం సింగుపురంలోని నీలం జూట్‌ మిల్లులో ఉత్పత్తులు కొనసాగుతున్నాయి. వీటిలో సుమారు 15వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఒక్కో పరిశ్రమలో రోజుకు 12 టన్నుల నుంచి 18 టన్నుల వరకు ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జూట్‌మిల్లుల్లో 50వేల మంది కార్మికులు జీవనోపాధి పొందేవారు. క్రమేపీ పరిశ్రమలు మూతపడుతుండడంతో సుమారు 30వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమలు కూడా భారంగానే నెట్టుకొస్తున్నారు. విద్యుత్‌ బిల్లుల రాయితీలు, రుణాల రూపంలో ప్రోత్సాహకాలు కరువయ్యాయి. గతంలో 20 శాతం ప్లాస్టిక్‌ వస్తువుల తయారీకి అనుమతులు ఉండగా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా దీనిని 60 శాతానికి పెంచింది. దీంతో ప్లాస్టిక్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో జూట్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ తగ్గింది. మరోవైపు ముడిసరుకుల ధరలు పెరగడం, జనుము పంట తగ్గడంతో పరిశ్రమల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.  


 గోగు పంట లేక అవస్థలు

రాష్ట్రంలో గోగు పంటల సాగు బాగా తగ్గిపోయింది. పరిశ్రమల నిర్వాహకులు గోగునార కోసం అవస్థలు పడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌, బంగ్లాదేశ్‌ నుంచి గోగునార తీసుకొచ్చి పరిశ్రమలు నిర్వహిస్తున్నారు. గతంలో మన ప్రాంత రైతులు గోగునార బాగా పండించి.. ఇతర ప్రాంతాలకు ఉత్పత్తి చేసేవారు. విత్తనాల సేకరణ నుంచి గోగు ఊరబెట్టడం, నార తీయడం వంటి పనులు కష్టమైనా...సాగు చేసేవారు. ప్రస్తుతం గిట్టుబాటు ధర లేకపోవడంతో గోగుసాగుపై రైతులు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో గోగును పండించడం లేదు. 


 మూతపడిన జూట్‌ కార్పొరేషన్‌ 

రైతులు పండించిన గోగు పంటను జూట్‌ కార్పొరేషన్‌ కొనుగోలు చేసేది. ప్రస్తుతం జూట్‌ కార్పొరేషన్‌ మూలకు చేరింది. అప్పట్లో నియమించిన సిబ్బంది పదవీ విరమణ చేశారు.. కొత్త సిబ్బందిని నియమించకపోవడంతో ఆ సంస్థ లేకుండా పోయింది. గతంలో జూట్‌ కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బంది, మండల వ్యవసాయ శాఖ అధికారుల సహకారంతో రైతులకు గోగుసాగుపై అవగాహన కల్పించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేకపోవడంతో రైతులు గోగుసాగుపై ఆసక్తి చూపడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని పరిశ్రమల యాజమాన్యాలు, కార్మికులు కోరుతున్నారు.  


 ప్రోత్సాహకాలు అందజేయాలి

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒక్కొక్క జూట్‌ పరిశ్రమ మూతపడుతోంది. పరిశ్రమలకు నూతన విధానం అమలు చేయడంతో ప్లాస్టిక్‌ వినియోగం పెరిగింది. వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పరిశ్రమలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు కూడా కరువయ్యాయి. గోగు సాగుకు అవసరమైన రాయితీలు ఇవ్వడం లేదు.  ఉత్పత్తులు పెంచేందుకు ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందజేయాల్సిన అవసరం ఉంది. 

- సీహెచ్‌ రామూర్తినాయుడు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి

Updated Date - 2021-08-12T05:04:04+05:30 IST