‘కాలజ్ఞానం’ నిండు సత్యమే

ABN , First Publish Date - 2020-04-02T05:48:39+05:30 IST

గటిక విజయ్‌కుమార్ ‘కాలజ్ఞానం’లో కరోనా? (మార్చి 29, ఆంధ్రజ్యోతి) శీర్షికన రాసిన వ్యాసంలోని అంశాలతో విభేదిస్తూ, ఆ వ్యాసం వల్ల శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి భక్తుల మనోభావాలు...

‘కాలజ్ఞానం’ నిండు సత్యమే

గటిక విజయ్‌కుమార్ ‘కాలజ్ఞానం’లో కరోనా? (మార్చి 29, ఆంధ్రజ్యోతి) శీర్షికన రాసిన వ్యాసంలోని అంశాలతో విభేదిస్తూ, ఆ వ్యాసం వల్ల శ్రీశ్రీశ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్న క్రమంలో కొన్ని విషయాలు స్పష్టం చేస్తున్నాము. శతాబ్దాల క్రితమే రాబోయే మన సమాజం ఎదుర్కోబోయే సమస్యల గురించి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారు తాళపత్రాలపై రాసినది వాస్తవం. అధ్యయనం చేయకుండానే గటిక విజయ్ కుమార్ ఎవరి మెప్పుకోసం ఈ వ్యాసం రాసారో చెప్పాలి. ‘కాల జ్ఞానం’ గాలివార్త కాదు. ఇది ప్రపంచంలో ఎవరినడిగినా చెబుతారు. ‘కాలజ్ఞానం’ శ్రీ వీర బ్రహ్మంగారి చరిత్ర ప్రప్రథమ రచన 1895లో జరిగింది. 1897లో ముద్రితమైన కాలజ్ఞానంలోని విషయాలన్నీ కంది మల్లాయపల్లె బ్రహ్మం గారి మఠంలోగల తాళపత్రాల నుండి సం గ్రహించి రాయబడినవే. కాలజ్ఞానం అభూత కల్పన కాదు. వీరబ్రహ్మేంద్రస్వామి వారు తాము రాసిన కాలజ్ఞానంలో ‘ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను/ ‘‘కోరంకి’’యను జబ్బు కోటి మందికి తగిలి కోడిలాగ తూగి సచ్చేరయా’ అని రాసింది వాస్తవం. అయితే గటిక విజయ కుమార్ 2020 కంటే ముందు వచ్చిన పుస్తకాలలో ఆ పద్యం లేదన్నారు. ఇది అభూతకల్పన. స్వామివారిపై ఆనాటినుండి నేటి వరకు జరుగుతున్న కుట్రలు, కుతంత్రాలు సభ్య సమాజానికి తెలియదనుకోవడం వారి భ్రమ మాత్రమే. 2020 కంటే ముందు వచ్చిన గ్రంథాలలో, ప్రచురణలలో ‘సూక్ష్మంలో మోక్షం’లా అనేకమంది రచయితలు రాసిన విషయాన్ని గమనించాలి. ఉదాహరణకు రామాయణాన్ని వాల్మీకి నుండి మొల్ల, రామానందసాగర్ వరకు, ఎందరో కవులు, రచయితలు ఏవిధంగా రాసారో అవన్నీ నిజ ప్రతి ఆధారంగా రాయబడినవేనని విజయ్ కుమార్ అంగీకరిస్తే, శ్రీవీరబ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని కూడా అంగీకరించవలసిందే. 2003, 2010లలో శ్రీపరిపూర్ణ సిద్ధానందస్వామి, యోగి అచలానందస్వాములవారు, శ్రీస్వామి విరజానంద, డా. ధారా రామనాధశాస్త్రి, సాహిత్య బ్రహ్మ డా.వివిఎల్ నర్సింహరావు, జానమద్ది హనుమచ్ఛాస్త్రి, కట్టా నరసింహులు, డా. కన్నెకంటి రాజమల్లాచారి, బ్రహ్మశ్రీ జవంగుల నాగభూషణం వంటి ప్రసిద్ధ వ్యక్తుల రచనలను గటిక విజయ్‌కుమార్‌ అధ్యయనం చేస్తే మంచిది. అలాగే, బ్రహ్మంగారి మఠం వెళ్ళి ప్రస్తుత పీఠాధిపతి అనుమతితో తాళపత్ర గ్రంథాలను సైతం ఈ రచయిత పరిశీలించుకోవచ్చు. శతాబ్దాల చరిత్ర కలిగి, నాటి హిందూ సమాజం ఎదుర్కొంటున్న అనేక మూఢ విశ్వాసాలనూ అనాచారాలనూ మట్టుబెట్టి, హిందూ ధర్మం ఔన్నత్యంకోసం అన్ని వర్గాలను తమ శిష్యులుగా చేసుకొని ‘సర్వధర్మ సమభావన’ చాటిన మహనీయుని గురించి గటిక విజయ్ కుమార్ రాసిన వ్యాసాన్ని ఖండిస్తున్నాము. 

చొల్లేటి కృష్ణమచార్యులు, కొణ్యాల శివానందం, రాపాక ఏకాంబరాచారి

(విశ్వబ్రాహ్మణ ధర్మపీఠం)

Updated Date - 2020-04-02T05:48:39+05:30 IST