Abn logo
Sep 19 2021 @ 01:24AM

పల్లె ప్రకృతి వనం గేటుకు తాళం

తన భూమిలో ఏర్పాటు చేశారంటున్న ఓ రైతు 

రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం 

ప్రభుత్వ భూమికి బదులుగా పట్టా భూమి చూపించిన వైనం 

నిడమనూరు, సెప్టెంబరు 18: ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్ట్టాత్మకంగా అమలు చేస్తోంది. పల్లెప్రగతిలో భాగంగా ప్రతి గ్రా మంలో హరితహారంతో పాటు వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, డంపింగ్‌ యార్డు, వర్మీ కంపోస్టు షెడ్‌ ఏర్పాటు చేసేందుకు రూ.లక్షల నిధులు కేటాయించింది. పల్లెప్రగతి పనుల నిర్మాణాలకు రెవెన్యూ అధికారులు గ్రామా ల్లో ప్రభుత్వ స్థలాలు కేటాయించారు. దీంతో పనులు కూడా యుద్ధప్రాతిపదికన చేపట్టారు. కానీ రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి పల్లెప్రగతి పనులకు ప్రభుత్వ భూమి కాకుండా ఇతరుల పట్టా భూమి కేటాయించారు. దీంతో ప్రభుత్వ భూమిలో కాకుండా తన పట్టా భూమిలో పల్లెప్రగతి పనులు చేపట్టారంటూ ఓ రైతు పల్లె ప్రకృతి వనం గేటుకు తాళం వేశాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నడమనూరు మండలంలోని వల్లభాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో పల్లెప్రగతి పనుల కోసం గత ఏడాది జూలైలో రెవెన్యూ అధికారులు 165 సర్వే నెంబరు ప్రభుత్వ భూమిలో 7.15 ఎకరాలు కేటాయించారు. అప్పటి తహసీల్దార్‌ సర్వేయర్‌ను పంపించడంతో ఆయన సర్వే చేిసి స్థలం కూడా చూపించారు. ఇందులో సుమారు రూ.30 లక్షలతో పల్లెప్రకృతి వనం, వైకుంఠధామం, డంపింగ్‌ యార్డు,వర్మీ కంపోస్టు షెడ్‌ పనులను సర్పంచ్‌ యుద్ధ ప్రాతిపదికన నిర్మిం చి పూర్తి చేశారు. పల్లె ప్రకృతి వనంలో 9వేలకు పైగా మొక్కలు నాటి సం రక్షించారు. పైగా చుట్టూ బయో ఫెన్సింగ్‌ కూడా ఏర్పాటు చేశారు. కానీ 165సర్వే నెంబరు పక్కన 166, 167 సర్వే నెంబర్లలో మంచిరాజు శ్రీకాంత్‌బాబు అనే రైతు కుటుంబానికి 8 ఎకరాలకు పైగా పట్టా భూమి ఉంది. పల్లె ప్రగతి పనుల కోసం రెవెన్యూ అధికారులు కేటాయించిన స్థలంలో తన పట్టా భూమి కూడా ఉందని రైతు అడ్డుకునే ప్రయత్నాలు చేసినప్పటి కీ సర్వేయర్‌ స్థలం చూపించారని, పైగా ఉన్నతాధికారుల ఒత్తిడితో పను లు చకచకా పూర్తి చేశారు. కానీ సదరు రైతు జిల్లా సర్వేయర్‌తో స్థలాన్ని సర్వే చేయించగా 166, 167 సర్వే నెంబర్లలో 1.09 ఎకరాల పట్టా భూమి పల్లెప్రగతి పనులకు కేటాయించిన స్థలంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో తన స్థలంలో పల్లె ప్రగతి పనులు చేపట్టారని పల్లె ప్రకృతి వనం గేటుకు తాళం వేశాడు. 1.09 ఎకరాల భూమి రైతుకు కేటాయిస్తే రూ.30 లక్షలతో చేపట్టిన పల్లె ప్రగతి పనులు నష్టపోయే అవకాశం ఉంది. అధికారులు స్థలం చూపించడంతోనే తాము పనులు చేశామని, సర్పంచ్‌ నన్నెబోయిన రామలింగమ్మరవి చెప్పారు. పల్లె ప్రకృతి వనానికి తాళం వేసిన ఘటనపై ఆమె శనివారం తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు.