వంటింటి సంక్షోభం

ABN , First Publish Date - 2021-10-22T06:49:56+05:30 IST

తిట్లపురాణాలతో రాష్ట్రం హోరెత్తిపోతోంది. దాడులు, నిరసనలు, ప్రతిదీక్షలతో రచ్చరచ్చ చేస్తున్నారు. సవాలక్ష సమస్యలతో ఉన్న జనం దృష్టిని తెలివిగా మళ్లిస్తున్నారు. పెరిగిన ధరలతో బతుకు దుర్బరంగా మారిన ప్రజలు నేతల తీరును విస్తుపోయి వీక్షిస్తున్నారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్లతో అవస్థలు.. ప్రతి రోజూ పెరిగే పెట్రోలు.. తరచూ భారంగా మారుతున్న గ్యాస్‌.. ట్రూఅప్‌ చార్జీల పేరుతో కరెంటు బిల్లులు.. భగ్గుమంటున్న నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు... నెత్తిన రోజూ పిడుగులు పడ్డట్టే ఉంటోంది.

వంటింటి సంక్షోభం

భగ్గుమంటున్న కాయగూరల ధరలు


నెల రోజులుగా అదే మోత


తిరుపతి, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): తిట్లపురాణాలతో రాష్ట్రం హోరెత్తిపోతోంది. దాడులు, నిరసనలు, ప్రతిదీక్షలతో రచ్చరచ్చ చేస్తున్నారు. సవాలక్ష సమస్యలతో ఉన్న జనం దృష్టిని తెలివిగా మళ్లిస్తున్నారు. పెరిగిన ధరలతో బతుకు దుర్బరంగా మారిన ప్రజలు నేతల తీరును విస్తుపోయి వీక్షిస్తున్నారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్లతో అవస్థలు.. ప్రతి రోజూ పెరిగే పెట్రోలు.. తరచూ భారంగా మారుతున్న గ్యాస్‌.. ట్రూఅప్‌ చార్జీల పేరుతో కరెంటు బిల్లులు.. భగ్గుమంటున్న నిత్యావసర సరకులు, కూరగాయల ధరలు... నెత్తిన రోజూ పిడుగులు పడ్డట్టే ఉంటోంది. మరీ రెండేళ్లుగా కూరగాయల ధరలు కొనలేనంతగా ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో పండే కూరగాయలు కూడా అందుబాటు ధరల్లో దొరకడం లేదు. మధ్యతరగతి నెల బడ్జెట్‌ ఈ ధరలతో తలకిందులు అవుతోంది. పేదజనం పచ్చడి మెతుకులతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. కూరగాయల కొనుగోలుకు మార్కెట్‌కు వెళ్ళాలంటేనే జనం భయపడిపోతున్నారు. కుటుంబసభ్యులకు ఏం వండి పెట్టాలో అర్థం కాక మహిళలు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో అయితే నిజంగానే వంటింటిని సంక్షోభం చుట్టుముట్టింది. 


చిత్తూరు నగరంలోని మార్కెట్లలో కాయగూరలు, ఆకు కూరల ధరలు దీపావళి టపాసుల్లా పేలిపోతున్నాయి. ఈ నగరంలో ఇంచుమించు ప్రతి కూరగాయ ధరా నెల కిందటితో పోలిస్తే బాగా పెరిగింది. వంకాయ, బెండ, చిక్కుడు, బీన్స్‌, బీర, మునగ వంటి వాటి ధరలు కొన్ని రెట్లు అధికంగా పెరిగాయి. కొత్తిమీర కట్ట ఇదివరకూ రూ. 30గా వుంటే ఇపుడు ఏకంగా వంద పలుకుతోంది.

-మదనపల్లె మార్కెట్‌లో నెల రోజులుగా కాయగూరల ధరలు మండిపోతున్నాయి. జనం రోజువారీ వంటలకు వినియోగించేదే పది రకాల్లో ఎనిమిది రకాల ధరలు రూ. 50కి పైగానే వుంటోంది. అత్యధికంగా మునగకాయలు రూ. వంద పలుకుతుంటే వంకాయ, బీన్స్‌, బీర రూ. 60 చొప్పున, ఉల్లిపాయలు, క్యారెట్‌, మిరపకాయలు రూ. 50 వంతున పలుకుతున్నాయి. ఇక కొత్తిమీర కట్ట తాకితే రూ. 50 వదిలించుకోవాల్సిందే!

-పుంగనూరు మార్కెట్‌లో జిల్లాలో మరెక్కడా లేని రీతిలో కూరగాయల ధరలు జనాన్ని ఠారెత్తిస్తున్నాయి. ఇక్కడ వంకాయ, బీన్స్‌, మునగ, క్యారెట్‌ రకాలు కిలో రూ. 80 చొప్పున పలుకుతున్నాయి. నెల వ్యవధిలో బీన్స్‌ ధర రూ. 25 నుంచీ రూ. 80కి చేరగా వంకాయ రూ. 30 నుంచీ రూ. 80కి చేరింది. మునగ, క్యారెట్‌ ధరలు రూ. 40 నుంచీ రూ. 80కి పెరిగాయి. ఉల్లి, బెండ, బీర, బీట్‌రూట్‌ ధరలు రూ. 60 వంతున పలుకుతున్నాయి. వీటిలో బెండ, బీరకాయలైతే నెల రోజుల వ్యవధిలో కిలో రూ. 15 నుంచీ రూ. 60కి పెరగడం గమనార్హం. 

-శ్రీకాళహస్తి పట్టణంలో కూరగాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉల్లి, టమోట, కొత్తిమీర ధరలు గత నెలతో పోలిస్తే పెరగగా బీన్స్‌, మునగ, క్యారెట్‌, బీర, పుదీన వంటి వాటి ధరలు ఒకేలా వుండి ఏమాత్రం తగ్గలేదు. ఒక మిరప మాత్రమే ఇదివరకూ కిలో రూ. 80 వుండగా ఇపుడు 30 తగ్గి రూ. 50కి చేరింది. అయినా మిరప ధర ఎక్కువే వుండడం గమనార్హం.

-పుత్తూరు మార్కెట్‌లో నెల రోజులుగా కాయగూరల ధరలు మోత మోగిస్తున్నాయి. మునగ రూ. 30 నుంచీ రూ. 70కి పెరగగా, బీన్స్‌ రూ. 30 నుంచీ రూ. 65కి పెరగింది. టమోట, వంకాయ ధరలు రూ. 15 నుంచీ రూ. 35కి చేరగా చిక్కుడు రూ. 40 నుంచీ రూ. 50కి, క్యారెట్‌ రూ. 45 నుంచీ రూ. 50కి పెరిగింది. 

-పలమనేరు, కుప్పం లలోనూ ధరలు ఇదే తీరులో పెరుగుతూనే ఉన్నాయి. పండుగల సీజన్‌లో కూరగాయల ధరలు ఇంతలా పెరగడం పెను భారంగా ప్రజలకు మారుతోంది. 


 

Updated Date - 2021-10-22T06:49:56+05:30 IST