ఇంగ్లండ్‌పై కివీస్‌ భారీ గెలుపు

ABN , First Publish Date - 2021-06-17T09:25:20+05:30 IST

భారత్‌తో ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు..ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ విజయం న్యూజిలాండ్‌కు ఎంతో ఆత్మవిశ్వాసం ఇచ్చేదే.

ఇంగ్లండ్‌పై కివీస్‌ భారీ గెలుపు

టీమిండియాకు హెచ్చరిక!

 (ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం): భారత్‌తో ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్‌కు ముందు..ఇంగ్లండ్‌తో టెస్ట్‌ సిరీస్‌ విజయం న్యూజిలాండ్‌కు ఎంతో ఆత్మవిశ్వాసం ఇచ్చేదే. ఈ గెలుపుతో టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో కివీస్‌ మళ్లీ టాప్‌నకు చేరడం ఆ జట్టుకు మరింత ఉత్సాహాన్నివ్వడం ఖాయం. ఫైనల్‌కు ముందు ప్రత్యర్థి జట్టు అందుకున్న భారీ విజయం టీమిండియాకు హెచ్చరికగానే చెప్పాలి. రెండు దశాబ్దాల తర్వాత ఇంగ్లండ్‌ గడ్డపై టెస్ట్‌ సిరీస్‌ నెగ్గిన కివీస్‌ బలాబలాలను పరిశీలిస్తే..


బౌలర్లు, బెంచ్‌ పటిష్టం:

న్యూజిలాండ్‌ విజయ రహస్యం బలమైన వారి బౌలింగ్‌ విభాగమే. టిమ్‌ సౌథీ, ట్రెంట్‌ బౌల్ట్‌ అపార అనుభవానికి మ్యాట్‌ హెన్రీ, కైల్‌ జేమిసన్‌ పదునైన బౌలింగ్‌ తోడై కివీస్‌ పేస్‌ విభాగం ప్రత్యర్థులను వణికిస్తోంది. పిచ్‌పై పేస్‌, బౌన్స్‌ను వినియోగించుకోవడంలో సమర్థుడైన జేమిసన్‌ తన తొలి ఆరు టెస్ట్‌ల్లో 36 వికెట్లు సాధించాడు. ఆఫ్‌ స్టంప్‌ ఆవలిగా బంతులు వేసి బ్యాట్స్‌మెన్‌ను ఊరించడంలో సిద్ధహస్తుడైన హెన్రీ ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో ఆరు వికెట్లు తీశాడు. ఇక ఎడమ చేతి బౌలర్లు బౌల్ట్‌, నీల్‌ వాగ్నర్‌తో కివీస్‌ బౌలింగ్‌ విభాగం మరింత వైవిధ్యం సంతరించుకుంది. ఇంగ్లండ్‌ వాతావరణ పరిస్థితుల్లో..వికెట్‌కు ఇరువైపులా బంతిని  స్వింగ్‌ చేయడంలో తిరుగులేని బౌలర్‌ బౌల్ట్‌. వికెట్‌నుంచి లభించే సీమ్‌తో బ్యాట్స్‌మెన్‌ను అతడు ముప్పుతిప్పలు పెట్టగలడు.


అలాగే రెండు టెస్ట్‌ల గణాంకాలు పరిశీలిస్తే..ఇంగ్లండ్‌ పేసర్లకంటే కూడా న్యూజిలాండ్‌ ఫాస్ట్‌ బౌలర్లు వికెట్‌నుంచి సగటుకంటే ఎక్కువగా స్వింగ్‌ రాబట్టారు. రెండో టెస్ట్‌కు ఏకంగా ఆరు మార్పులతో బరిలోకి దిగినా  సునాయాసంగా నెగ్గడం కివీస్‌ రిజర్వ్‌ బెంచ్‌ బలానికి తార్కాణంగా చెప్పాలి. రెండో టెస్ట్‌లో 20 వికెట్లలో 16 వికెట్లను బౌల్ట్‌, హెన్రీ, అజాజ్‌ పటేల్‌ సాధించడం విశేషం. వీరు ముగ్గురూ మొదటి టెస్ట్‌లో ఆడకపోవడం గమనార్హం. అందువల్ల ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేస్తే భారత్‌ మూల్యం చెల్లించక తప్పదు.


ఫీల్డింగ్‌ అమోఘం:

తమ ఫీల్డింగ్‌ పేలవం అన్న అంచనాను తప్పని రుజువుచేసింది న్యూజిలాండ్‌ జట్టు. నికోల్స్‌, మైకేల్‌ శాంట్నర్‌, నీల్‌ వాగ్నర్‌, బౌల్ట్‌, కెప్టెన్‌ విలియమ్సన్‌ మెరుపు ఫీల్డింగ్‌తో అబ్బురపరిచారు. టెస్ట్‌ సిరీస్‌ ప్రతి ఇన్నింగ్స్‌లో 15 నుంచి 20 పరుగులను కివీస్‌ ఫీల్డర్లు నిరోధించారు. ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే అరంగేట్రంలోనే డబుల్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. సిరీ్‌సలో అతడు 306 రన్స్‌ చేయడం విశేషం. తాను ప్రమాదకర బ్యాట్స్‌మన్‌నని టామ్‌ లాథమ్‌ మరోసారి రుజువు చేసుకున్నాడు. రాస్‌ టేలర్‌, విలియమ్సన్‌, హెన్రీ నికోల్స్‌తో కివీస్‌ మిడిలార్డర్‌ దుర్భేద్యంగా ఉంది. ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కోగల సమర్థులే. వీరి తర్వాత ఆల్‌రౌండర్లు గ్రాండ్‌హోమ్‌, వికెట్‌ కీపర్‌ వాట్లింగ్‌తో న్యూజిలాండ్‌ బ్యాటింగ్‌ చివరివరకు బలీయంగా ఉంది. రెండు టెస్ట్‌లు ఆడిన నేపథ్యంలో ఇంగ్లిష్‌ వాతావరణ పరిస్థితులకు పూర్తిగా అలవాటుపడి ఉండడం, ఫైనల్‌లో డ్యూక్‌ బంతులను ఉపయోగించనుండడం.. వెరసి అంతిమ పోరుకు భారత్‌కంటే న్యూజిలాండ్‌ మెరుగ్గా సిద్ధమైందని చెప్పాలి. 


విజేతకు రూ. 11.5 కోట్లు

 ఫైనల్‌ విజేతకు రూ. 11.70 కోట్ల ప్రైజ్‌మనీతోపాటు టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప గద బహూకరించనున్నట్టు ఐసీసీ ప్రకటించింది. రన్నర్‌ప జట్టు రూ. 5.8 కోట్లు అందుకుంటుంది.

Updated Date - 2021-06-17T09:25:20+05:30 IST